🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 7*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*క్వణత్కాంచీదామా" కరి కలభ కుంభస్తననతా*
*పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా |*
*ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*
*పురస్తా-దాస్తాం నః పురమథితు రాహోపురుషికా ||*
ఈ శ్లోకము, తరువాతి శ్లోకము రోజూ భక్తితో పారాయణము చేస్తే, ఇంటిలోని దోషాలు తొలగి, గృహస్థులు సుఖశాంతులు కలిగియుంటారని ప్రతీతి.
ఇక్కడ నుండి అమ్మవారి రూప వైభవాన్ని వర్ణిస్తున్నారు శంకరులు. భక్తులు దైవ స్వరూపాన్ని నాలుగు విధాలుగా స్మరించుకోగలితే ఉత్తమ ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. ఇవి
స్థూల - విగ్రహము
సూక్ష్మ - దేవతకు సంబంధించిన మంత్రము సూక్ష్మతర - కుండలినీ ధ్యానము
సూక్ష్మతమ - ఉపనిషత్ ప్రతిపాదితమైన నిర్గుణ బ్రహ్మ తత్త్వము. ప్రతిదీ సూక్ష్మమైన కొలదీ మరింత శక్తి కలిగియుంటుంది పరమాణువు వలె. జీవుడికి కూడా ఈ నాలుగు అన్వయించవచ్చు. వరుసగా శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ.
ఇప్పుడు పై శ్లోకంలో శ్రీ కాంచీపుర కామాక్షీ అమ్మవారి స్థూలరూప వర్ణన చేస్తున్నారు శంకరులు.
క్వణత్కాంచీదామా = క్వణత్ అంటే కింకిణీ నాదములు చేస్తున్న, ధ్వనిస్తున్న
కాంచీ అంటే నడుము భాగము (మొల) దామా అంటే నూలు (త్రాడు) అంటే అమ్మవారు మువ్వల మొలనూలు/వడ్డాణము ధరించియున్నారు. అమ్మవారి ఆభరణములు మంత్రములైతే, మువ్వల ధ్వని మంత్ర నాదములు. ముందుగా వడ్డాణము గురించి చెప్పటంలో విశేషం ఇదే, అమ్మవారు మంత్రస్వరూపిణి అని.
భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు.పరమాత్మ సర్వవ్యాపియై వుండి ఏ విధంగా శరీరంలోకి ప్రవేశిస్తాడు అని. శ్రీ కృష్ణుడు చెప్తున్నారు పరమాత్మ తన ప్రకృతిని అధిష్ఠించి విశ్వరూపాన్ని ధరిస్తాడు. ఆ ప్రకృతి పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని రెండు విధాలు. జీవభూత సృష్టి అంతా పరా ప్రకృతి, జడ సృష్టి అంతా అపరా ప్రకృతి. పరమాత్మ ఈ సృష్టిలో ప్రాణరూపంగా, సూక్ష్మాతి సూక్ష్మమైన నాదంగా మూలాధార చక్రంలో ప్రవేశిస్తాడు. అక్కడ నుండి నాభి స్థానంలోని మణిపూర చక్రాన్ని చేరుతాడు. అక్కడ నాదము కొంత దిటవై 'పశ్యంతి' గా మారి క్రమంగా సాగుతూ వర్ణరూపంగా (అక్షర రూపం) మారుతుంది. వ్యక్తమైన నాదము మొదట నాభి స్థానము నుండి బయలుదేరుతుంది కనుక శంకరులు అమ్మవారి వర్ణన వడ్డాణము నుండి మొదలుపెట్టారు.
కరి కలభ కుంభస్తననతా పరిక్షీణా మధ్యే = సన్నని నడుముపై వున్న ఉత్తుంగమైన వక్షస్థలము, జగములను పోషించగల వక్షము.
పరిణత శరచ్చంద్రవదనా = పండిన శరత్కాలపు పూర్ణచంద్రుని వంటి ముఖము,
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః = క్రింది రెండు చేతులతో ధనుర్బాణములను, పై రెండు చేతులతో పాశమును, అంకుశమును (సృణి) ధరించినది,
పురమథితు: = త్రిపురాసుర సంహారియైన పరమేశ్వరుని యొక్క
అహో పురుషికా = ఆశ్చర్యకరమైన ఇచ్చాశక్తి అయిన అమ్మవారు,
పురస్తాత్ ఆస్తాం నః = ఈ రూపం కల తల్లి నా కన్నులకు సాక్షాత్కరించుగాక!
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి