26, ఆగస్టు 2023, శనివారం

పద్యదశకము

 --- శ్రీవరలక్ష్మీ మాత !నీకు వందనమమ్మా --

              (పద్యదశకము) 


హరికిన్ పట్టపు దేవివి

సిరిసంపద లిచ్చు మాత ! శ్రితజనవల్లీ !

కరుణను జూడుము నిరతము

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!        01 


నిరుపేదగు బ్రాహ్మణికిని

సిరిసంపద లీయ దలచి శ్రీశంకరులే

కరుణకు నిను ప్రార్థించెను 

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!        02 


హరియురమును  వీడియు నీ

నరులను కాపాడ నీవు నారాయణి వై 

కరవీరపురము నుంటివి

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!      03 


నరపతి జనకుని యింటను

ధరణిని చీల్చంగ బుట్టి దశరథసూనున్

పరిణయ మాడిన సీతా! 

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!      04 


నరపతి యాకాశ నృపతి 

ధర కర్షణ చేయు వేళ  తనయగ గల్గీ

సిరివాసుని పెండ్లాడిన 

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!    05 


కరు లిరు వైపుల నిలచియు

విరులను వెదజల్లుచుండ వేడుక తోడన్

సిరులను నిచ్చెడు తల్లీ 

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!  06 


సుర లసురులు  సుధ కొఱకును

తరియించగ కడలి బుట్టి తరగల యందున్

హరి నురమున నిలచిన యో

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!  07 


హరి పద్మావతి పెండ్లిని

సుర నరులును ధరణియందు జూచుచు నుండన్ 

జరిపించియు మదిమురిసిన

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!    08 


హరి భక్తుడు పద్మాక్షుని 

వరమును దీర్చ0గ నతని వరసుత వోలెన్

ధర మాతులుంగి వైతివి

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!    09


కరవీరపురము నందున

ధర భక్తుల బ్రోచి మిగుల దాక్షిణ్యమునన్

సిరులీయగ నెల వుండిన 

వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా!    10 


                -- శుభము --

కామెంట్‌లు లేవు: