4, సెప్టెంబర్ 2023, సోమవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ:*


వేంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా, బ్రహ్మా అన్న విషయంపై జరిగిన నిర్ణయచర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి. అనంతాచార్యులు రచించిన వేంకటాచల ఇతిహాసమాలలో క్రీ.శ.పదకొండవ శతాబ్దినాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు.



వామనపురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు, ఇతర మునులు, వసువుతో స్వామి పుష్కరిణికి, వేంకటాచలానికి వెళ్తూ-అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహపురాణంలో సూతుని వాక్యాలు, భూ వరాహస్వాముల సంవాదం, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడపురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండపురాణంలో భృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వేంకటాచలాన్ని అభివర్ణించారు.


హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వేంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ 'స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలమువంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి వున్నారని వర్ణించారు. వరాహపురాణంలో భూదేవి, వరాహమూర్తిల సంభాషణలో వేంకటాచలంపై పుష్కరిణీతీరంపై ఆనందము అనే పేరుగల పుణ్యవిమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్తారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం, మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులవర్ణనలు ఉన్నాయి



స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని, ఆయన గురించి తపస్సు చేయడానికో, పాపప్రక్షాళనల కొరకో వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు.


వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాపప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వేంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వేంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవమంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వేంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తోంది.



పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడూ ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో, శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు. తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వేంకటాచలం వెళ్ళినపుడు కుమారస్వామి ధనుస్సు, శక్తి ధరించే వెళ్ళినట్టు ఉండడాన్ని గుర్తుచేసి ఖండించారు. 


ధృవబేరానికి రెండు చేతులు కటిహస్తం, వరదహస్తం కాగా మరో రెండు చేతులూ పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి. శరవణుడే ఐతే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తిపట్టుకోరు కదా. 3


శంఖ చక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం, రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు.



శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకొమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు.


తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తానని తెలిపారట.


వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు, సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు. నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వేంకటాచల ఇతిహాసమాల తెలిపింది.


వక్షఃస్థలంపై లక్ష్మీశ్రీవత్సం ఉండడం కూడా వేంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు.


మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా, మహలక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: