4, సెప్టెంబర్ 2023, సోమవారం

నవగ్రహ పురాణం - 45 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 45 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*బుధగ్రహ జననం - 8*


బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన స్థానంలో కూర్చున్నాడు. చెట్టు గుబురులో దాక్కున్న చిలక , ఒక్కసారి రెక్కల్ని టపటపలాడించి , ప్రణవం ప్రారంభించింది. 


*'ఓమ్!' 'ఓమ్!' 'ఓమ్ ! '*

విద్యార్థులను పాఠానికి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది ఆ చిలక చేస్తున్న ఓంకార నాదం !


బృహస్పతి చిరునవ్వుతో చెట్టు గుబురు వైపు చూశారు. విద్యార్థులకు తీసిపోకుండా నేర్చుకొంటోందీ చిలక ! ఆశ్రమాల్లో చిలకలు వేదాలు పఠించాలి. సింహాలు జింకలతో ఆడుకోవాలి ! గుంపులుగా వచ్చిన విద్యార్థులు , వరసలుగా కూర్చుంటున్నారు. బృహస్పతి. చూపులు విద్యార్థుల ముఖాలను పరిశీలనగా చూస్తున్నాయి. అందరూ ఉన్నారు... చంద్రుడు ?


బృహస్పతి కళ్ళు మరోసారి విద్యార్థులను కలియజూశాయి. చంద్రుడు వచ్చినట్టు లేడు. ఏదో అడగడానికి ఆయన నోరు తెరిచాడు...


*“స్వామీ...”* పుంజికస్థల పిలుపు విని బృహస్పతి పక్కకు చూశాడు. పుంజికస్థల ఆయన వైపు వినయంగా చూసింది. *"గురుపత్ని... ఆశ్రమంలో లేరు... " "తార ఆశ్రమంలో లేదా ?"* బృహస్పతి ఆమెకు అడ్డు తగిలాడు.


*"లేరు... విద్యార్థులకు ఆహారం సిద్ధం చేయనా ?!"* పుంజికస్థల వినయంగా అడిగింది. 


*"తార ఎక్కడికెళ్ళింది , పుంజికా ?”*


*"తెలియదు ! నిన్న మీరు ఇంద్రసభకు వెళ్లినప్పట్నుంచీ గురుపత్ని కనిపించలేదు. మీతో వెళ్ళి ఉంటారనుకున్నాను..."* పుంజికస్థల వినయంగా అంది. 


*"ఔను , గురువుగారూ ! మేమూ అలాగే అనుకున్నాం ! మీ వెంట చంద్రుణ్ణి కూడా తీసుకువెళ్ళి ఉంటారనుకున్నాం..."* ఒక విద్యార్థి లేచి , నిలబడి అన్నాడు.


బృహస్పతి కళ్ళు చిట్లించాడు. చంద్రుడా ! అంటే చంద్రుడు ఇక్కడ లేడా ?


*"చంద్రుడెక్కడ ?”* అప్రయత్నంగా ప్రశ్నించాడు బృహస్పతి.


*"మీరూ , గురుపత్నిగారూ , చంద్రుడూ - ఒకే సమయంలో ఆశ్రమంలో లేకుండా పోయారు...గురువుగారూ... అందుకని... కలిసే దేవలోకానికి..."* సనాతనుడు అనే విద్యార్థి వివరిస్తున్నాడు.


*"పుంజికా ! చంద్రుడు కూడా లేడా ?”* బృహస్పతి పరిచారికను ప్రశ్నించాడు.


*"లేడు...”*


*“ఇద్దరూ మళ్ళీ నదీస్నానానికి..."* బృహస్పతి సాలోచనగా అన్నాడు. *“నదీస్నానానికి వెళ్ళకూడదని చంద్రుణ్ణి ఆజ్ఞాపించానే !”*


*"నదిలో ఏదైనా ప్రమాదం...”* బృహస్పతి అనుమానంగా అన్నాడు. 


*"నది వైపు వెళ్ళలేదు...వాళ్ళు...”* పుంజికస్థల మెల్లిగా అంది.


వాళ్ళు ? బృహస్పతి పుంజికస్థల వైపు అర్ధం కానట్టు చూశాడు. వాళ్ళు... తారా , చంద్రుడూ కలిసి తిరుగుతున్నారా ?! ఆయనలో ఏవో ఆలోచనలు ఆందోళనలు పుట్టిస్తూ , సాగుతున్నాయి. ఏ సమిథలకో అడవిలోకి వెళ్ళి ఉంటారా ?


*"సనాతనా ! సునీతుడూ , నువ్వూ - ఇంకాకొందరూ అరణ్యంలో చూడండి ! తారకూ , చంద్రుడికీ ఏదైనా ప్రమాదం..."* వాక్యం పూర్తి చేయకుండానే ఆగాడు బృహస్పతి.


*"స్వామీ... విద్యార్థులకూ , మీకూ... ఆహారం...”*. 


*"సిద్ధం చేయి, పుంజికా..."* బృహస్పతి నిట్టూర్చాడు.


వయసులో పెద్దవాళ్ళైన విద్యార్థులు చాలా మందే అరణ్యం వైపు బయలుదేరారు. అప్పుడే తన వైపే చూస్తున్న విద్యార్థుల వైపు అన్యమనస్కంగా చూశాడు బృహస్పతి. 


*"నిన్నటి పాఠం వల్లె వేసుకోండి !"* అన్నాడు.


*"రా , చంద్రా !”* చెట్టు మీది చిలక ఉన్నట్టుండి అంది. బృహస్పతి చిలకవైపు ఆశ్చర్యంగా చూశాడు.


*"ఇలా రా , చంద్రా !”* తార పిలుపు కోకిల గానంలా చంద్రుడి చెవుల్ని తాకింది.


మందిరం ముందు నిలుచున్న చంద్రుడు లోపలికి నడిచాడు. తార పిలుపు మళ్ళీ ఒకసారి శయనాగారం లోంచి వినిపించింది. చంద్రుడు శయ్యాగారంలోకి అడుగులు వేసి , హంసతూలికా తల్పం ముందు నిలుచున్న తార పక్కనే నిలుచున్నాడు. అతని చెయ్యి తీగలా సాగి , సన్నటి తార నడుముని చుట్టింది. తార తలని చంద్రుడి భుజం మీద వాల్చింది.


*"ఈ తల్పం ఎంత బాగుందో , చూశావా ?"* అంది తార.


*"విశ్వకర్మ సృష్టి !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు. *“నీకోసమే!”*


*"కాదు"* తార వెంటనే అంది. *"మన కోసం !"*


*"నేను... శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను !"* తార పారవశ్యంతో అంది. *"ఈ మందిరం , ఈ హంసతూలికా తల్పాలు , తూగుటుయ్యాలలు , ఇవన్నీ కావాలి , నాకు !"* 


చంద్రుడు ప్రేమగా ఆమె నడుము చుట్టూ తన చేతులతో బిగించాడు. *“ఎందుకూ అంత ఆశ ?"* చిరునవ్వుతో అడిగాడు.


*"దర్భాసనాలు , కృష్ణాజినాలూ , ఆకులూ , అలములూ - వీటితో అలసిపోయాను ; విసిగిపోయాను !"* అంటూ తార సున్నితంగా చంద్రుడి చేతిని తప్పిస్తూ కొంచెం ఎడంగా జరిగింది. చంద్రుడి వైపు తిరిగి , వయ్యారంగా నిలబడింది.


*"ఇలా నా వైపు చూడు !"* అంది తార.


చంద్రుడు పూర్తిగా ఆమె వైపు తిరిగి , చూశాడు.


*"నన్ను చూడు , చంద్రా !”* అంది తార. తన ముఖంలోకి చూస్తున్న చంద్రుడితో.. చంద్రుడు రెండు చేతుల్నీ నడుం మీద ఆన్చుకుని , తారను నఖశిఖ పర్యంతం చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు కనిపించని సున్నితమైన కుంచెల్లా తార శరీరాన్ని స్పృశిస్తూ ఉండిపోయాయి.


తార - నిలువెత్తు సౌందర్యం ! రూపం ధరించి తన ముందు నిలుచున్న అందం ! 'అందగత్తె' అంటే ఇలా ఉండాలి అని చెప్పే శరీరం ! రెండు వైపులా ఉన్న చెవుల్ని అందుకోడానికి ప్రయత్నిస్తున్నట్టున్న సోగకళ్ళు...


*"మళ్ళీ చూడు !"* తార చిరుకోపంతో అంది. *“నన్ను చూడమంటే నా కళ్లలోకి చూస్తావేం , చంద్రా ? చెప్పినట్టు చెయ్ ! నన్ను... చూడు !"* చంద్రుడు గుడ్లప్పగించి మంత్రముగ్ధుళ్ళ చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లోకి


*"ఎలా ఉన్నాను ?"* తార ప్రశ్న అతన్ని హెచ్చరించింది.


*"ఎలా ఉన్నావంటే... చక్కటి - తీగలా ఉన్నావు ! ఆ తీగ అల్లుకుపోవడానికి వీలుగా స్తంభంలా నీ పక్కన నిలబడా లనిపిస్తోంది !"* చంద్రుడి కంఠంలో ఆరాధనా భావం శబ్దించింది.


*“ఇంత సౌందర్యం , ఇంత సౌకుమార్యం దర్భాసనాలకీ , కృష్ణాజినాలకీ బలైపోతే...”* తార మధ్యలో ఆపింది.


*"ఈ చంద్రుడు అలా కానివ్వడు ! అందుకే ఇక్కడకి తీసుకువచ్చేశాడు.”* 


తార వినిపించుకోనట్టు చూసింది. *“ఈ అందం , ఈ యౌవనం - ఎక్కడుండాలి ?"* చంద్రుడు హంసతూలికా తల్పాన్ని చేత్తో చూపించాడు. *“అక్కడ !”*


తార చిరునవ్వుతో వయ్యారంగా అడుగులు వేస్తూ చంద్రుడి ముందుకు నడిచింది. *"కాదు... అక్కడ కాదు , ఇక్కడ !"* అంటూ అతని హృదయం మీద చెంపని ఆన్చి , మెడ చుట్టూ చేతుల్ని దండలా ఆన్చింది.


చంద్రుడు తలవాల్చి చూశాడు. తార కొద్దిగా తల పైకెత్తి , చంద్రుడి కళ్ళల్లోకి చూసింది. ఆమె విశాల నేత్రాల్లో ప్రేమ జ్యోతుల్లా వెలుగుతోంది. చంద్రుడి చేతులు ఆమెను పొదివి , పట్టుకున్నాయి.


*"చంద్రా... నా కోరిక చెప్పనా ?”*


*"ఊ..."*


*"నీ అందం నా కొడుకుగా పుట్టాలి!"*


 *"తారా !"* చంద్రుడు పులకించిపోతూ అన్నాడు.

కామెంట్‌లు లేవు: