ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
భాగం 9/12
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
-----------------------
8. జీవశాస్త్రం
ఆధునికత
సృష్టి పుట్టి సుమారు 200కోట్ల సంవత్సరాలైందనీ,
జీవ పరిణామ క్రమంలో కోతి నుండి మానవుడు వచ్చాడనీ డార్విన్ వంటి శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు మనకీ విదితమే.
అవన్నీ మానవ పరిశోధనతో, మానవుడే ధ్రువపరచుకున్నవి.
ఆ శాస్త్రవేత్తలేగానీ, మరి ఏ ఇతరులు గానీ, మరికొన్ని పరిశోధనలతో ఈ విషయాలని కూడా ఖండించే అవకాశం లేకపోలేదు.
రామాయణం
సృష్టి - పుట్టుక, మార్పిడిలకి సంబంధించి శ్రీమద్రామాయణం చక్కని వివరణలని విశ్లేషాత్మకంగా బోధిస్తుంది.
జటాయువు శ్రీరామునితో చెప్పిన సృష్టి విషయాలు, పైన చెప్పిన విధంగా కాక, ఎప్పటికీ సత్యంగా కనిపిస్తాయి.
జటాయువు తెలిపిన సృష్టి వివరాలు
ప్రజాపతులలో చివరివాడైన కశ్యపుడు -
దక్ష ప్రజాపతి యొక్క అరవదిమంది కుమార్తెలలో
అదితి,
దితి,
దనువు,
కాళిక,
తామ్ర,
క్రోధవశ,
మనువు,
అనల అనే ఎనిమిది మందిని వివాహమాడాడు. అందులో
1. అదితికి
- ద్వాదశాదిత్యులు,
- అష్టవసువులు,
- ఏకాదశ రుద్రులు,
- ఇరువురు అశ్వినీ దేవతలు
మొత్తం ముప్పది ముగ్గురు దేవతలు జన్మిస్తారు.
2. దితికి దైత్యులూ,
3. దనువుకు అశ్వగ్రీవుడూ,
4. కాళికకు నరకుడూ, కాలకుడూ జన్మించారు.
5. తామ్రకు - క్రౌంచి,
భాసి,
శ్యేని,
ధృతరాష్ట్రి,
శుకి అనే ఐదు పక్షి కుమార్తెలకు జన్మనిస్తుంది.
ఆ ఐదుగురిలో,
క్రౌంచి - గుడ్లగూబలనూ,
భాసి - నీటికాకులనూ,
శ్యేనీ - డేగలనీ గ్రద్దలనీ,
ధృతరాష్ట్రి - హంసలనీ కలహంసలనీ,
శుకి - నతనీ,
నత - వినతనీ,
వినత - గరుడుణ్ణీ కన్నారు.
6.క్రోధవశ - మృగి,
మృగమంద,
హరి,
భద్రమద,
మాతంగి,
శార్దూలి,
శ్వేత,
సురభి,
సురస,
కద్రువ అనే పదిమందికి జన్మనిచ్చింది.
అందులో
అ) మృగి - మృగాలనీ,
ఆ) మృగమంద - ఎలుగుబంట్లనీ, సృమరాలనీ,
ఇ) హరి - సింహాలనీ వానరాలనీ,
ఈ) భద్రమద - ఇరావతినీ,
ఇరావతి - ఐరావతాన్నీ,
ఉ) మాతంగి - ఏనుగులనీ,
ఊ) శార్దూలి - కొండముచ్చులనీ, పెద్దపులులనీ, ..
ఋ) శ్వేత - దిగ్గజాలనీ
ౠ) సురభి - రోహిణినీ, గంధర్వినీ,
రోహిణి - గోవులనీ,
గంధర్వి - అశ్వాలనీ,
ఌ) సురస - నాగులనీ,
ౡ) కద్రువ - ఆదిశేషునీ సర్పాలనీ అందించాయి.
7. మనువు యందు కలిగినవారే మానవులు.
8. అనల యొక్క సంతానము మధుర ఫలములతో కూడిన వృక్షములు మొదలైనవి.
ప్రధాన జాతులకు సంబంధించి సృష్టి విశ్లేషణ మానవ మేధస్సుకు అందనంతగా శ్రీమద్రామాయణం తెలుపుతుంది.
జంతువులు - గుణాలు
సీతకై వెతుకుతున్న శ్రీరాముడు,
- లేడినీ,
- పులినీ,
- ఏనుగునూ పిలుస్తూ సీతజాడ అడుగుతాడు.
వాటి లక్షణాల గూర్చి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా,
జంతువులలో ప్రధానమైన సత్త్వరజస్తమోగుణాలు మూడిటికీ చిహ్నాలుగా విశ్లేషణలో తెలుస్తుంది.
వృక్ష శాస్త్రం
శ్రీరాముడు సీత తప్పిపోయినపుడు వెతుకుతూ, వివిధ వృక్షాలను సంబోధిస్తూ అడుగుతాడు.
కడిమి, మారేడు, తెల్లమద్ది, ఏఱుమద్ది, ఎర్రగోరింట, అశోక, తాళ, నేరేడు, గన్నేరు వంటి చెట్లనూ,
మల్లె, మాధవీలత, మొగలివంటి పొదలనూ కూడా సీత జాడగూర్చి ప్రశ్నించాడు.
వీటన్నిటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.
ఉదా॥ 1. ఏఱుమద్ది వృక్షం పుష్పాలు లేకుండానే ఫలిస్తుంది.
2.అశోక వృక్షం శోకాలను తొలగించేదని పేర్కొంటాడు శ్రీరాముడు.
దీని ద్వారా పొదలూ వృక్షాలద్వారా,
వాటి ప్రత్యేకతలూ,
వాటిద్వారా పొందే
- మానసిక ఆనందాన్నీ,
- శారీరక శక్తులనీ సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది.
జంతుజాలం పుట్టుక, జంతువుల ప్రధాన లక్షణాలు,
వృక్షజాతులవల్ల పొందే సుఖసంతోషాల వంటి ప్రధాన విషయాల ద్వారా
శ్రీమద్వాల్మీకి రామాయణంలోని ఈ విధమైన ఆదర్శ జీవశాస్త్రం మనలని అబ్బురపరుస్తుంది.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి