5, నవంబర్ 2023, ఆదివారం

ఆడకోతి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

చందమామ కథ 

ఆడకోతి 

డి.సుబ్రహ్మణ్యం 


పూర్వం కాంచీపురరాజ్యాన్ని కనకసేను డనే రాజు పాలిస్తూవుండేవాడు. ఆయన చాలా విలాసపురుషుడు. దూరదేశాలనుంచి కూడా అనేకరకాల పూలమొక్కలూ వృక్షజాతులూ తెచ్చి, రాజభవనంవెనక చక్కని ఉద్యానవనం పెంచాడు.


అందమైన ఆ ఉద్యానవనంలో, అతి మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లూ, వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలూ ఉన్నయి.


ఒకనాడు కాంచీపురరాణి కొలనుకు స్నానానికని వెళ్లింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికి ఇచ్చింది వాటిలో ఒక అమూల్యమైన రత్నాలహారంకూడా వుంది.


రాణి యిచ్చిన నగలన్నిటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి, అక్కడ చేతికి అందిన చెట్లనుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన వుండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆరత్నాలహారాన్ని ఆందిపుచ్చుకొని, ఒక్కగంతులో మళ్లీ చెట్టు ఎక్కేసింది.


హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసీది చూసింది. కాని ఏంచేయటానికీ తోచక చూస్తూవుండిపోయింది. ఇంతలో రాణి కొలనునుండి బయటికి వచ్చి, దుస్తులు ధరించి, నగలలో తన రత్నాలహారం కనబడకపోయేసరికి దాసీదానిని అడిగింది.


"ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ యిక్కడే పెట్టాను!" అన్నది దాసి, రాణి కోపగిస్తుందేమో నన్న భయంతో.


రాణి వెళ్ళి రాజుతో యీ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయంలోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలచి జరిగినదంతా వివరించి, సూర్యాస్త మయం లోపల రత్నాలహారంతో స హా దొంగను పట్టి ఒప్పగించకపోతే వుద్యోగానికి తిలోదకాలేనని గట్టిగా చెప్పాడు.


దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్టుగా వందలకొలది సైనికులతో బయలుదేరాడు. పట్టణం అంతా గాలించి వేశాడు. దొంగ యెవడో, యెలా వుంటాడో యెవరికీ తెలీదు. కాని, దొంగతనం చేసిన వాడు తప్పక బీదవాడై వుంటాడనీ, బీద వాడైతే మాసిన దుస్తులతో, పెరిగిన గడ్డంతో వుంటాడనీ వారి నమ్మకం.


చివరికి పట్టణమూ, ఆ చుట్టుపట్ల వున్న అడవులూ వెదికి సూర్యాస్తమయంలోపల ఒక చింకిగుడ్డలవాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు.


"రత్నాలహారం యెక్కడ దాచావు?" అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు. దొంగిలించలేదంటే యెవ్వరూ నమ్మరనీ, ఆ నిమిషానే వురితీయిస్తారనీ భయపడి, ఆ బీదవాడు " రత్నాలహారం, కోశాధిపతిగారికి యిచ్చానండీ!” అన్నాడు. ఇలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి  రాజుముందుకు లాక్కొని వచ్చారు. 


రాజు అదేప్రశ్న మళ్లీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు; కనుక తడుముకోకుఁడా "మన ఆస్థానజ్యోతిష్టుల వారికి యిచ్చానండీ!” అన్నాడు.


ఆస్థానజ్యోతిషుణ్ణి కాళ్లూ చేతులూ కట్టి తెచ్చి రాజుగారిముందు నిలబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరినీ ప్రశ్నించినట్టే మళ్లీ ప్రశ్నించాడు. దానికి జోతిష్కుడు తడబడ కుండా "మంత్రిగారి పెద్దకుమారుడికి యిచ్చానండి! " అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది.


అందుచేత "తతిమ్మా వ్యవహారం అంతా రేపు వుదయం చూసుకుందాం. నేరస్థులను మాత్రం ఖైదులో వేయండి!'' అని చెప్పి రాజుగారు లేచిపోయారు.


ఆరాత్రి మంత్రికి నిదురపట్టలేదు. రత్నాలహారం పోవడం, ఆ దొంగతనం యెవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకుమీదికి రావడం— —అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రిసమయాన పడక గదినుంచి  బయలుదేరి సరాసరి నేరస్థులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఒగ్గి వినసాగాడు. జైలు గదిలోపలనుంచి సన్నగా ఏడుపు వినబడింది. మంత్రి అలానే తలుపుదగ్గిరసా చెవివుంచి వింటున్నాడు. ఇంతలో ఆ యేడుపు ఆగిపోయింది. అదేసమయాన బీదవాడి గొంతుక యిలా అన్నది:


" కోశాధిపతిగారూ ! నన్ను క్షమించాలి. ప్రాణభయంవల్ల అలా మీ మీద అబద్దం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాలహారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలియదు.”


తరవాత కోశాధి పతి: "జ్యోతిషుల వారూ! నన్ను క్షమించాలి. ప్రాణభీతివల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక, నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను " అన్నాడు.


ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు: "జ్యోతిషం, నా శ్రాద్ధమును! యిలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవికావు.  అందుకే మంత్రికొడుక్కి వుచ్చువేశాను."


ఇంతవరకూ అందరి మాటలూ విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రివేళ రాజుదగ్గరకు పోయి, నిద్ర లేపి, తను విన్నదంతా చెప్పేశాడు.


మంత్రి చెప్పినదంతా విని, రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాలహారం యెవరు దొంగిలించినట్టు? తెల్లవార్లూ రాజుకు యిదే ఆలోచన.


తెల్లవారింది. రాజు దాసీదానిని ఎదటికి పిలిపించాడు. 'నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలుముక్కలుగా నరికించి, కాకులకూ గద్దలకూ వేయించమంటావా?' అని బెదిరించాడు.


దాసీది హడిలిపోయింది.


"మహారాజా ! నేను నిర్దోషిని. కాని కొలనుపక్షని రావిచెట్టుమీద నివసించే ఆ ఆడకోతిమీద మాత్రం నాకు అనుమాన మున్నది !” అని చెప్పింది.


"కోతిమీద ఎందుకని అనుమానం! అది నీకన్న అందంగా వుందనా ?” అన్నాడు రాజు, గుడ్లెర్రజేస్తూ.


"లేదు ప్రభూ! అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం నేను చూశాను. అమ్మగారు కొలనులో స్నానంచేస్తున్నంతసేపూ, అదికూడా చెట్ల కొమ్మల మీద స్నానంచేస్తున్నట్టు అభినయిం చేది. అమ్మగారిలాగానే కనపడీ కనపడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించటం నేను చూశాను!" అన్నది. 


రాజుగారికి, దాసీవాని మాటలు వినే సరికి అరికాలు మంట నెత్తికెక్కినట్టయింది. దాసీదానిని నిలువునా నరికేద్దామను కున్నాడు. కాని రత్నాలహారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు.


"ఐతే, రత్నాల హారం ఆ ఆడకోతే దొంగలించిందంటావా? బాగానే వుంది. మరి ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసు కోవడం ఎలా ?" అన్నాడు రాజు.


"అదేమంత కష్టంకాదు ప్రభూ!" అని మెల్లగా అంటూ ముసిముసినవ్వులు నవ్వింది ఆ దాసీది. ఎందుకని కష్టం కాదు ?" అని గాడు రాజు ఉగ్రుడై.


తమరు భవనంలో వున్నప్పుడేగదా రాణీగారు ఆ రత్నా లహారాన్ని ధరిస్తారు ?" అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది.


" కావొచ్చు!" అన్నాడు రాజు కనుబొమలు చిట్లిస్తూ.


"ప్రభూ! తమకు నా మీద కోపం రావొచ్చు కనక, అంత వివరంగా చెప్పలేను. కాని, ఆ ఆడకోతి రత్నాలహారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే, మనం ఒక మగకోతిని తీసుకొనివస్తే వెంటనే తెలిసిపోతుంది !" అన్నది దాసి.


దాసీదాని మాటలలోని అంతరార్థం గ్రహించి, రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణీని ఆడకోతితోను, తనను మగకోతి తోనూ ఆది పోల్చుతున్నదని గ్రహించాడు. కాని, యెలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలిగదా ! రాజు ఆజ్ఞాపించగా, క్షణాలమీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దానిని అలంకరించారు. మగకోతి  వెనుక రాజూ, మంత్రి మొదలైనవారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్ళారు.


రావిచెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి యిదంతా చూచింది. ఒక్కగంతులో ఆ పక్కనవున్న చెట్టుతొర్రలో జొరబడి, అక్కడ దాచివుంచిన రత్నాలహారం బయటికి తీసి, మెడలో వేసుకున్నది. తరు వాత చెట్టు దిగి , రాణీగారిలాగే వయ్యారంగా నడుస్తూ, మగకోతివేపు బయలుదేరింది.


రాజభటులు ఆడకోతిని పట్టుకుని, దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు. ఆది కీచుకీచుమంటూ తిరిగి చెట్టుమీదకు పారిపోయింది.


రత్నాలహారం రాణికి యిచ్చి, నిర్దోషులందర్నీ వదిలేశారు. అందరితోపాటు రాజూ, దాసీదాని తెలివిని మెచ్చుకుని తగిన రీతిన  బహుమతి ప్రదానం చేశాడు .

(చందమామ - 1953, ఏప్రిల్ )


*సేకరణ:- శ్రీ శర్మద గారు*

కామెంట్‌లు లేవు: