5, నవంబర్ 2023, ఆదివారం

ఇంతకీ ఎవరీ దక్షిణామూర్తి?*

 *ఇంతకీ ఎవరీ దక్షిణామూర్తి?*


మొదటగా ఆయన వయసు ఎంత అని చూద్దాం. 'వృద్ధాఃశిష్యా గురుర్యువా' అని ఉంది. అంటే శిష్యులు వృద్దులు, గురువు యువకుడు. ఎవరీ గురువు? దక్షిణా మూర్తి.  'యువానమ్‌' అని అయన గురించి చెప్పబడి ఉంది. అంటే ఆయన యువకుడు. అయన నిత్య యవ్వనుడు. అంటే ఎప్పటికీ యువకుడే. 


అయన ఎలా ఉంటాడు? ఆయన రూపమెట్టిది? 'కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం' - చిన్ముద్ర లో ఉన్న ఆనంద మూర్తి. స్వాత్మారాముడు – తనలో తాను ఆనందించేవాడు, 'ముదిత వదనం' – ముఖంలో చిరునవ్వులు చిందించే వాడు(విషణ్ణ వదనంతోనో గంభీర వదనం తోనో ఉన్నవాడు కాదు). 'నిర్మలాయ' – కల్మషం లేని వాడు, 'ప్రశాంతాయ' – పరమ శాంతితో కూడిన వాడు. 


అయన ఎవరు? గురువా దైవమా? 'ఆచార్యేంద్ర' - ఉపాధ్యాయులకు రాజు, గొప్ప గురువు. త్రిభువనగురుమీశం - మూడు లోకాలకు గురువైన ఈశ్వరుడు, 'ఈశ్వరో గురు రాత్మేతి' - గురు స్వరూపుడైన ఆత్మ, ఈశ్వరుడు. అంటే అయన గురువు, దైవమూనూ.


అయన ఎక్కడుంటాడు?   'వట విట సమీపే భూమిభాగేనిషణ్ణం' - మఱ్ఱి చెట్టు సమీపంలో నేలపై కూర్చొని ఉంటాడు. సమీపం అంటే ఎంత సమీపంలో? 'వట తరోర్మూలే' - చెట్టు మూలంలో, అంటే దాని వేర్ల దగ్గర. 


ఎటు తిరిగి కూర్చొని ఉంటాడు? ఇది ఆయన పేరులోనే ఉంది. దక్షిణ దిక్కు చూస్తూ కూర్చొని ఉంటాడు. శిష్యులు ఉత్తర దిక్కు లోని గురువును చూస్తూ కూర్చొని వుంటారు. ఉత్తర దిక్కు మోక్షానికి ప్రతీక. దక్షిణ దిక్కు సంసారానికి. 


అయన ఏ భాషలో బోధిస్తాడు? సంస్కృతమా లేక ఏ ఇతర భాషైనానా? 'గురోస్తు మౌన వ్యాఖ్యానం' - ఈ గురువు మౌనంగా బోధిస్తాడు. 'మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం' - ఎందుకంటే పరబ్రహ్మ తత్వం మౌనంగానే ప్రకటించబడింది. సంస్కృతమైనా మరే ఇతర భాషైనా మనసుకు బుద్ధికి సంబంధించింది. పరబ్రహ్మ తత్వం మనసుకు, బుద్ధికి అతీతమైనది. అందుకే మౌనంగా ప్రకటితమయ్యే పరబ్రహ్మ తత్వాన్ని మౌన భాషలోనే వివరిస్తాడు దక్షిణామూర్తి. భాషంటే క్రమబద్దీకరించబడిన పాదాల సమూహం. భావాలను పదాలలో వ్యక్తీకరిస్తే దానిని వినేవాడు భావంలోకి మార్చుకొని అర్థం చేసుకుంటాడు. ఇదంతా మనసులో జరుగుతుంది. ఆ భావాలను తార్కికంగా  విశ్లేషించేది బుద్ధి. ఆత్మ జ్ఞానము మనసుకు బుద్ధికి అతీతమైనది కనుక అది ఏ భాషలో చెప్పలేము. 


మరైతే ఆయన ఏమీ చెప్పడా? సూన్యంలో ఏమి అర్థమవుతుంది? చెపుతాడు. అందుకే 'మౌనవ్యాఖ్యా ప్రకటితం' అన్నది. వ్యాఖ్య ఉన్నది అంటే బోధ వున్నది. అట్లని చెప్పడమూ లేదు. కేవలం ప్రకటితం అవుతుంది. దానిని అపరోక్షంగా అనుభూతి చెందాలి. 


ఆయన ఎలాంటివాడు? 'బ్రహ్మ నిష్టైహి' - బ్రహ్మ నిష్ఠ కలవాడు, 'నిధయే సర్వ విద్యానాం' - సమస్త విద్యలకు నిధి, 'శుద్ధజ్ఞానైక మూర్తయే' - శుద్ధజ్ఞానైక మూర్తి, 'ప్రణవార్ధాయా' - ప్రణవానికి అర్థం  లాంటివాడు.   


ఏమి బోధిస్తాడు? ఆయనను ఆశ్రయిస్తే మనకు ఒనగూరేదేమీ? 'జ్ఞానదాతారమారాత్' - జ్ఞానాన్ని ఇస్తాడు. 'జనన మరణ దుఃఖచ్చేద దక్షం' - జనన మరణ దుఃఖము నుండీ విముక్తి కలిగించే నైపుణ్యం కలిగిస్తాడు. 'శిష్యోస్తు చ్ఛిన్న సంశయాః' - శిష్యుల సంశయాలను విచ్చిన్నం చేస్తాడు. 'భిషజే భవ రోగిణామ్‌' - భవరోగ నివారణకోసం ఆయన ఔషధం లాంటి వాడు. 


ఇంతవరకూ వాక్యార్ధం తెలుసుకున్నాము. ఇప్పుడు నిగూడార్థం తెలుసుకుందాం. దక్షిణామూర్తి మనలాగా శరీరధారి కాదు. అట్లయితే దేశకాలాలకు పరిమితమౌతాడు. జనన మరణాలుంటాయి. కౌమారం, యవ్వనం, వృద్యాప్యం ఉంటాయి. ఆయన నిత్య యవ్వనుడు. దక్షిణామూర్తి (దక్షిణ + అమూర్తి) అంటే దక్షిణ దిక్కుకు చూస్తున్న 'ఆమూర్తి'. అంటే ఆయన శరీరి కాదు. 'వ్యోమవత్‌ వ్యాప్త దేహాయ' - ఆకాశంలా సర్వ వ్యాపితమైనవాడు. ఆద్యంత రహితుడు, కాలాతీతుడు. ఆయన ఓంకారానికి రూపం. ఆయనే శివుడు. 'ఈశ్వరో గురురాత్మేతి' - గురు స్వరూపుడైన ఆత్మ. అంటే ఆత్మే గురువు రూపంలో ఉంది. 


అంటే ఆయన దేవుడా? ఆయన శివుడా? శివుడే గురువై మనకు బోధచేసే అవతారమే దక్షిణామూర్తి అవతారమా ? అవును - కాదు. అవునెందుకంటే దక్షిణామూర్తి శివ స్వరూపం కాబట్టి. కాదెందుకంటే శివుడంటే మేడలో పామును పెట్టుకొని శరీరానికి బూడిద రాసుకున్న శివుడి గురించి కాదు ఇక్కడ చెప్పింది. శివుడంటే ఆత్మ స్వరూపం. 


'నేను'లు రెండు - నేను శరీరము, మనసు, బుద్ది అనుకొనే 'నేను' ఒకటైతే నిజమైన 'నేను' వేరొకటి. నేను శరీరం అనుకొనే 'నేను' శిష్యుడికి ప్రతీక. నిజమైన 'నేను' గురువుకు ప్రతీక. అంటే నిజమైన 'నేను' దక్షిణామూర్తి. అంటే దక్షిణామూర్తి ఎక్కడో హిమాలయాలలో మఱ్ఱిచెట్టు కింద లేడు. నీలోనే ఉన్నాడు. నువ్వే దక్షిణామూర్తి. 


'బీజస్యాంతరి వాంకురో..' అన్న శ్లోకంలో విత్తనం నుంచీ మహా వృక్షం బహిర్గతమైనట్లు, ఈ జగతిని ఇంద్రజాలికునిలా గా తననుంచీ బహిర్గతము చేసి తన మాయా శక్తితో స్వేచ్ఛగా జగన్నాటకం నడిపే మహా గురువు దక్షిణా మూర్తి అని వుంది. ఇలా జగత్తును సృష్టించేది ఆత్మ అని వివేకచూడామణిలో ఉంది. ఇలా సృష్టించబడ్డ జగత్తు తిరిగి ఆత్మలో లయం కావడం తో జనన మరణ చట్రం నుంచీ బయటపడతాం. అప్పుడు ఏ సంసార బంధాలూ ఉండవు. అంటే దక్షిణా మూర్తి అంటే మనలోనే ఉండే సచ్చిదానంద స్వరూపమే. అందుకే ఆయన చిద్విలాసంగా ఉంటాడు అని చెప్పింది. ఆత్మ అంటే ఒక జ్యోతి కాదు. అది ఒక సత్ చిత్ ఆనంద స్వరూపం. దుఃఖ రహితమైన ఆ స్థితిలో కేవలం ఆనందమే ఉంటుంది. 


వివేకానంద స్వామికి రామకృష్ణ పరమ హంస గురువు. రామకృష్ణ కు తోతాపురి. మరి తోతాపురికి ఎవరు గురువు? రమణ మహర్షి ఎందరికో గురువు. మరి రమణ మహర్షికి ఎవరు గురువు? అని బీసెంట్ జేకే ప్రపంచానికి గురువు అంటే, నేనెవరికీ గురువు కాదు. మీ గురువు మీలోపలే ఉన్నాడు అన్నాడు జేకే. 


మనం గురువు కోసం ఎక్కడా ఇక వెతకాల్సిన పని లేదు. దక్షిణామూర్తి యే అందరికీ గురువు. ఆయన ప్రతి ఒక్కరిలో కొలువై వున్నాడు. ఆయనను శరణు వేడు. తానే ప్రకటితమౌతాడు . అప్పుడు నీవంటూ వేరే ఎవరూ ఉండవు. అప్పుడు జీవుడు, దేవుడు, జగత్తు అంతా ఒకటైపోతుంది. అంతా బ్రహ్మమే.

కామెంట్‌లు లేవు: