5, నవంబర్ 2023, ఆదివారం

దత్తక్షేత్రం ఫకీరు మాన్యం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*దత్తక్షేత్రం ఫకీరు మాన్యం..*


*(పద్దెనిమిదవ రోజు)*


శ్రీ స్వామివారితో సహా శ్రీధరరావు దంపతులు, కౌసల్యమ్మ గారు రమణయ్య గారు అందరూ మొగలిచెర్ల సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి..రమణయ్య గారు తాను పొట్టిపల్లె వెళ్ళిపోతానని చెప్పి..బండి దిగి శ్రీధరరావు గారి వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారిని తోడ్కొని దంపతులిద్దరూ తమ ఇంటికి చేరారు..కౌసల్యమ్మ గారు ముందుగా బండి దిగి ఇంటిలోకి వెళ్లారు..ప్రభావతి గారు కూడా దిగి గబ గబా  వెళ్లి, శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కోవడానికి ఒక బకెట్ తో నీళ్లు సిద్ధం చేశారు..ఈలోపల శ్రీధరరావు గారి తల్లి.. సత్యనారాయణమ్మ గారు మెల్లగా బైటకు వచ్చారు..ఆవిడ శ్రీ స్వామివారిని చూసి ఏమని వ్యాఖ్యానిస్తారో నని, ప్రభావతి శ్రీధరరావు గార్లు మధనపడుతున్నారు..


శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కుని నేరుగా సత్యనారాయణమ్మ గారి ముందు చిరునవ్వుతో నిలబడ్డారు..ఆవిడ అవాక్కైపోయినట్లుగా మారిపోయి..అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి నమస్కారం చేసి.."స్వామీ మీరు ఇక్కడికే వచ్చారా?..మిమ్మల్ని చూడగలనో లేదో అని ఈరోజు చాలాసార్లు లోలోపల బాధపడుతున్నాను..నా కోసమే వచ్చినట్లు ఉంది నాయనా.." అన్నారు..శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఆశ్చర్యంగా ఉంది..అంతకుముందు బండిలో శ్రీ స్వామివారు.. "అన్నీ సవ్యంగా జరుగుతాయి!.."అన్నమాట ఇప్పుడు అక్షర సత్యమై కూర్చుంది..శ్రీ స్వామివారు ఎంతో ప్రసన్నంగా.."అమ్మా!..ఆరోగ్యం నెమ్మదిగా ఉందా?.." అని అడిగి ఆమె చేతులను స్పృశించి..ఇంటి వరండాలోకి వచ్చారు..ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాళ్లు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం చూస్తే!..


సత్యనారాయణమ్మ గారు పట్టరాని సంతోషంతో.."అమ్మాయ్ ప్రభావతీ..స్వామివారికి ఏలోటూ చేయకండమ్మా.. అన్నీ దగ్గరుండి చూడండి నువ్వూ శ్రీధరుడూ..ఇదిగో మా చెల్లెలు వచ్చిందికదా..అదీ నేనూ మాట్లాడుకుంటూ ఉంటాము..మా గురించి ఆలోచించకండి..ముందు మీరిద్దరూ స్వామి వారి ఏర్పాట్లు చూడండి!.."అన్నారు..ఆవిడ ముఖం లో ఆనందం తాండవిస్తోంది..శ్రీ స్వామివారు మళ్లీ ఆవిడ దగ్గరకు వచ్చి.."అమ్మా!..నాకు ఒక గ్లాసు పాలు చాలు!..మీరు విశ్రాంతి తీసుకోండి.."అన్నారు..


శ్రీ స్వామివారు బావి వద్ద స్నానం చేస్తూ..శ్రీధరరావు గారితో.."ఈ బావి ఇక్కడ ఉండకూడదు!.." అన్నారు.."అది మా నాన్నగారు త్రవ్వించినది..ఆయనకు వాస్తుపైనా..దైవం పైనా పెద్దగా నమ్మకం లేని వ్యక్తి.."అన్నారు.."అలాగా..సరేలేండి..కాలమే దిద్దుతుంది!.." అన్నారు..ఆ తరువాత శ్రీధరరావు గారింటి ఆవరణ లోనే ఉన్న మరో ఇంట్లో(ఔట్ హౌస్) స్వామివారికి బస ఏర్పాటు చేశారు..శ్రీ స్వామివారు ఒక్క గ్లాసు పాలు త్రాగి ఆ ఇంట్లోకి వెళ్లి, ధ్యానంలోకి వెళ్లిపోయారు..


మరునాడు ఉదయాన్నే శ్రీధరరావు దంపతులు, శ్రీ స్వామివారిని వెంట పెట్టుకొని మొగలిచెర్ల కు దక్షిణంగా సుమారు రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలం వద్దకు తీసుకెళ్లారు..ఆ మొత్తం పొలం బీడువారి ఉంది..పూర్తిగా రేగు చెట్ల మయం..గొర్రెలు కాచుకునే వాళ్ళు తిరిగే కాలిబాటలు..ముళ్ళు..సన్నని పలుకురాళ్లు..చూడకుండా పాదం మోపితే కస్సున దిగుతాయన్నట్లుగా ఉన్నాయి..ఆ భూమి పేరు.."ఫకీరు సాహెబ్ మాన్యం"..ఎవరో ఫకీరు కొన్ని తరాల క్రిందట అమ్ముకొని వెళ్లిన భూమి..


శ్రీ స్వామివారు బండి దిగి..ఆ నేలపై పాదం మోపారు..ఆయన ముఖంలో ఒక్కసారిగా ఎక్కడలేని కాంతి వచ్చింది..తేజోరూపుడిగా మారిపోయారు..పట్టరానంత సంతోషంతో.."ఇదే భూమి!..ఇదే భూమి!..నేను కోరుకున్నదీ.. నాకు కావాల్సింది..ఇదే..ఈ పవిత్రభూమి కోసమే నేను ఇంతకాలం వేచి ఉంది..నా తపస్సుకు అనువైనది..శ్రీధరరావు గారూ ఇది క్షేత్రం..దత్త క్షేత్రం..మీ దంపతులకు ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం అయింది!..అవునా?.."అంటూ..పసిపిల్లాడు తిరిగినట్లు..ఆ భూమిలో తిరుగాడారు..


ఈశ్వర సాక్షాత్కారమా?..శ్రీధరరావు గారికి శ్రీ స్వామివారు చెప్పిన మాట అర్ధం కానట్లు గా చూస్తూ ఉండిపోయారు..కానీ ప్రభావతిగారికి చప్పున గుర్తుకొచ్చింది...కొన్ని సంవత్సరాల క్రిందట ఒక శివలింగం ఈ భూమిలోనే వారికి దొరికింది..ఆ శివలింగం ప్రస్తుతం వారింట్లో పూజామందిరంలో ఉంది..అది జరిగి కూడా చాలా ఏళ్ళు అయింది..శ్రీ స్వామివారు గుర్తుచేసారు.. దంపతులిద్దరూ శ్రీ స్వామివారి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు..సిద్ధులూ సాధకుల గురించి విని వున్నారు కానీ..ప్రత్యక్షంగా వారి ప్రవర్తన ఇదే చూడటం..శ్రీ స్వామివారు అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు..


అక్కడినుండి కొద్దిదూరంలోనే ఉన్న "మన్నేరు"నది వద్దకు అందరూ వెళ్లారు..శ్రీ స్వామివారు ఆ నదినీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేశారు.."ఇది మార్కండేయ నది..అది ఫకీరు భూమి!..ఫకీరు అంటే సాధువు అని అర్ధం!..నా తపస్సు..నా శేషజీవితం.. ఇక ఇక్కడే..ఇది దత్తక్షేత్రం..భవిష్యత్ లో మహా పుణ్యక్షేత్రం అవుతుంది..శ్రీధరరావు గారూ..అమ్మా..ఇద్దరూ వినండి..ఇది పుణ్యక్షేత్రం..సాక్షాత్తూ దత్తుడి భూమి..నా తపస్సుకు ఇంతకంటే అనువైనది లేదు.."అన్నారు..


మన్నేరు నుంచి మరలా ఫకీరు మాన్యం లోకి వచ్చి, కొంతసేపు గడిపిన తరువాత అందరూ మొగలిచెర్ల చేరారు..శ్రీ స్వామివారు ధ్యానానికి వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారి ఆహార పద్ధతులు...రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: