2, నవంబర్ 2023, గురువారం

ఉన్నవాడికీ- లేనివాడికీ ,తేడా!

 🙏


ఉన్నవాడికీ- లేనివాడికీ ,తేడా! 

                     ___________________________ 


            మన శతక వాఙ్మయం  సామాజిక దృక్పధానికి  అద్దంవంటిది. శతక కారులంతా సమాజంలోని ఒడిదుడుకులను అనుభవించినవారే ఆయనుభవంవలన  వారికి  అపారమైన లోకజ్ఙత సిధ్ధిచింది. ఆవిధంగా శతక కవులందరూ సామాజిక దార్శనికు లైనారు. వారు తమ యనుభవాన్నంతా రంగరించి  శతకాలలో పద్యరూపమైన యుపదేశంగావించారు. వెలగొనలేనియా ఉపదేశాలను విని సంఘంబాగుపడాలని వారిభావన.మరిమనమెంతవరకూ వారినుపయోగించుకున్నామో తెలియదు. శతాబ్దాలు గడుస్తున్నా యింకా అవేపరిస్ధితులుగదా! అవే చీకటి నీడలుకదా! అయినా వారికి విసుగులేదు. చెప్పిన విషయాలనే మార్చిమార్చి చెపుతూ వచ్చారు. 


                           సుమతీ,(బద్దెన) వేమన, కుమార, కుమారీ, యిలా ప్రాచీన అర్వాచీన శతకాలు. వాటిపరధిలో అవి సామాజిక మైన దురవస్థలను యెత్తిచూపి అన్యాపదేశంగా పరిష్కారాలు సూచించాయి. అయినా మనపరిస్థితి," ఎక్కడ వేసిన గొంగడి అక్కడే! " గానేమిగిలిపోయింది. మాచిన్నప్పటి  ఒకపాట  నాకిప్పటికీ  స్మృతి పథంలో మెదులుతూ ఉంటుంది. 


               " ఉన్నవాడికే   అన్నిసుఖాలూ, రయ్యో రయ్యో! 


                 లేనివాడిగతి  యీలోంలో  నుయ్యో  గొయ్యో!                           విన్నారుగా? సరిగ్గా యిదే భావంతో ఆరుదశాబ్దాలక్రితం  ' భైరవ కవి' తన శతకంలో ఒకపద్యవ్రాశాడు. వింటారామరి! యిదిగో  మీకోసం! 


       చ:  కలిగిన  వాని  యింట  శుభకార్యము  గల్గిన, కీడు గల్గినన్, 

             పిలువక మున్నె,  బాంధవులు పెల్లుగఁబోయి, తతంగ మంతయున్ 

             తెలుపుచు నుందురాతనికి ,దీనుని యింట  శుభంబె  గల్గినన్, 

             పలుమరుఁ బిల్చినప్పటికి, పల్కరుగా! యెవరైన   భైరవా! 


                             ఇదండీ ఆపద్యం! ఉన్నవాడి యింట్లో  శుభాశుభాలు యేంజరిగినా , ఊరిజనం పిలువక పోయినా పరుగున బోయి వాని కార్యక్రమాలన్నీ దగ్గరుండి  జరిపించి వస్తారు. అదేం చిత్రమో!, పేదవాడియింట్టో శుభంజరుతున్నా, తమను పేరుపేరున పిలిచినా ఒక్కరూ రారుకదా! అంటాడుకవి. యిది నగ్న సత్యంకదా! మరి సమాజం యీతీరున నుంటే, యింక లోకం బాగుపడేదెలా? 


                               దీనికి పరిష్కారం యువతే కనుగొనాలి. మానవత నేల్కొనాలి. నవత నలుదిశల పరిమళించాలి. యిదేమనం చేయవలసిన కర్తవ్యం!🙏👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: