2, నవంబర్ 2023, గురువారం

ఆశ్రమ వాసానికి

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*ఆశ్రమ వాసానికి సన్నాహాలు..*


*(పదిహేనవ రోజు)*


శ్రీ స్వామివారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారనివతెలుసుకున్నాము.. శ్రీధరరావు, ప్రభావతి గార్ల మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు..శ్రీధరరావు గారు మాలకొండకు తరచూ వెళుతూనే వున్నా..ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకుముందులా మాలకొండకు వెళ్లడం లేదు..


ప్రభావతి గారి మనసులో "ఇద్దరమూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటే..ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతాడేమో.. తప్పించుకోలేక స్థలం విషయం లో వాగ్దానం చేసి.. స్థలం ఆయనకు ధారపోస్తే..ఆయన ఇక సాధారణ జీవనానికి అలవాటు పడి..ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారి పోతాడేమో..మాలకొండ మీదున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగుచేయించి ఇద్దామంటే..ఆ పని పెట్టుకోవద్దని చెపుతున్నాడు..ఈ సంకట స్థితి నుంచి బయటపడేదెలా?.." అని సవాలక్ష ఆలోచనలతో సతమతం అవుతున్నారు..శ్రీధరరావు గారు కూడా ఎటూ తేల్చుకోలేక వున్నారు..


ఈలోపల, కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యం లో మాలకొండ మీద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు..ఆ సంఘానికి శ్రీధరరావు గారే ప్రెసిడెంట్..వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావుగారు (కవి, పండితులు, అష్టావధాని.. కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు..) వుండేవారు..ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచార్యులు గారిని, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గార్లను సన్మానించాలని తీర్మానం చేసి, ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకొచ్చారు..వారిని ఘనంగా సన్మానించిన తరువాత, భక్తి పూర్వకంగా..ప్రభావతి శ్రీధరరావు గార్లు, శ్రీ శేషాచార్యులు శ్రీదేవమ్మ గార్ల కాళ్లకు నమస్కారం చేశారు..శ్రీదేవమ్మ గారు నిండుమనసుతో.."శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు!.." అని దీవించారు..శ్రీధరరావు దంపతులు..అక్కడున్న మిగిలిన సభికులు..కవులు, రచయితలు, పండితులూ..దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు..కారణం..శ్రీధరరావు ప్రభావతి గార్లకు ముగ్గురు పిల్లలు..హైస్కూల్ చదువుల్లో వున్నారు..పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు..ఈ మహాసాధ్వి..కొండంత మాలకొండ స్వామి సన్నిధిలో నిండుమనసుతో పెద్దగా దీవించింది..


శ్రీధరరావు, ప్రభావతి గార్ల ముఖాముఖాలు చూసుకోవడం..ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడటం గమనించిన శ్రీదేవమ్మ గారు, ప్రభావతి గారిని ప్రక్కకు పిలచి.."అమ్మాయీ..నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లీ?..నాకెలగూ సంతాన యోగం లేదు..మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి, అలా దీవించాను.." అన్నారు..ప్రభావతి గారు ఆవిడకు విషయమంతా చెప్పి.."ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మీరు దీవించారు..మీ వాక్కు వృధా పోదు.. ఆ స్వామి లీల ఎలా వుందో?..ఎలా మలిస్తే అలా జరుగుతుంది.." అన్నారు..ఆ తరువాత ప్రభావతి శ్రీధరరావు గార్లు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి..సగౌరవంగా సాగనంపి..శ్రీ స్వామివారి దర్శనం కొరకు పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..


అంతకుముందు రోజు..శ్రీధరరావు గారి అన్నయ్య గారు, కూతురు కుమారి చెప్పిన ఉదంతం అంతా విని, శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపారు..అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి వున్నారు..వారిని కూడా తోడ్కొని.. జింక చర్మాన్ని తీసుకొని శ్రీ స్వామివారి వద్దకు చేరారు..శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని వున్నారు..వీళ్ళను చూడగానే..దగ్గరకు వచ్చి, ప్రభావతి గారి నాన్న గారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి.."మీరు నమ్మిన వైష్ణవ భక్తి నే కొనసాగించండి.." అని చెప్పారు..


అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు గారి దంపతుల వైపు తిరిగి..తీక్షణంగా చూస్తూ.."మీకు నేను ఇంతకుముందే చెప్పివున్నాను శ్రీధరరావు గారూ..ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మత్తులు చేసి, సహజంగా రాతిలో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరచి..ఉన్న పవిత్రత పోగొట్టకండి..నాకు వచ్చింది దైవాజ్ఞ!..దానిని నేను అతిక్రమించలేను..మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి..మీకు మేలు జరుగుతుంది.." అన్నారు..సాక్షాత్తూ ఆ లక్ష్మీ నృసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరూ అనుభూతి చెందారు..వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలోనే తొలగిపోయాయి..


"సరే స్వామీ..మా పొలమే రెండు ప్రదేశాలలో ఉన్నది..మీరు వచ్చి చూసి, ఏది కావాలో నిర్ణయిస్తే..దానినే మీరు కోరుకున్నంత ఇస్తాము..మీ తపోసాధనకు మా వంతు సహకారం అందించి, మా జీవితాలు ధన్యం చేసుకుంటాము.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు చేయెత్తి ఆశీర్వదించారు..తిరిగి మొగలిచెర్లకు ఆ దంపతులు చేరారు..విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదమూ.. శ్రీ స్వామివారి ఆజ్ఞ..రెండూ ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి..


ఆశ్రమ స్థల నిర్ణయం...రేపు.. 



*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: