2, నవంబర్ 2023, గురువారం

దత్త దర్శనం

 *దత్త దర్శనం..*


ఆ శనివారం నాడు మాలకొండలో జోరు వాన కురుస్తోంది..వర్షం వల్ల భక్తులు బాగా తక్కువగా వచ్చారు..అంతకు ముందురోజు రాత్రి వచ్చిన వాళ్ళు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శనం చేసుకొని..అక్కడే ముందున్న మంటపం లో ఆగిపోయారు..అప్పటికి మాలకొండ లో సౌకర్యాలు తక్కువగానే ఉండేవి..వర్షం తగ్గిన తరువాత కొండ దిగి..తమ తమ ఊళ్లకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు..


అలా మంటపం లో ఉన్న వాళ్లలో దమయంతమ్మ గారొకరు.. ఆవిడ నెల్లూరు నుంచి తన కుమారుడిని వెంటబెట్టుకొని మాలకొండ వచ్చారు..మాలకొండలో శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దర్శనం చేసుకొని..కొండపైనున్న అమ్మవారి ని కూడా దర్శించుకొని వెళ్లాలని ఆవిడ కోరిక..అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లాలంటే..వర్షం వల్ల వీలు కుదరటం లేదు.."అమ్మా..ఈసారి వచ్చినప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకుందాము..వాన కొద్దిగా తగ్గితే..మెల్లగా కొండదిగి వెళ్లి బస్సెక్కి నెల్లూరు వెళ్లిపోదాము.." అని కుమారుడు  చెపుతున్నాడు..


ఒక అరగంటకు వాన తగ్గుముఖం పట్టింది..చినుకులు పడుతున్నాయి..మంటపం లో ఉన్నవాళ్లు మెల్లిగా బైటకు వెళుతున్నారు..దమయంతమ్మ గారు కూడా కొడుకు తో సహా బైటకు వచ్చి చూసారు..అమ్మవారి ఆలయానికి వెళ్లాలంటే మళ్లీ మెట్లు ఎక్కాలి..కొద్దిగా కష్టం తో కూడుకున్న పని..అందుకని క్రిందనుంచే ఆ లక్ష్మీదేవి కి మనసులోనే నమస్కారం చేసుకొని..ఈసారి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటానని గట్టిగా మ్రొక్కుకొని..కొండ దిగడం ప్రారంభించారు..


ఆరోజుల్లో కొండదిగి రావడానికి శివాలయం, పార్వతీదేవి మఠం మీదుగా ఉన్న మెట్ల దారిని ఎక్కువమంది ఉపయోగించేవారు..కుమారుడితో సహా మెల్లిగా మెట్లు దిగుతున్న దమయంతమ్మ గారు శివాలయం దగ్గరకు వచ్చేటప్పటికి..లోపలికి వెళ్లి చూసొద్దామని కోరిక కలిగింది..సన్నటి గుహ లాంటి దారి లోంచి నడచి శివాలయం లోకి వెళ్లారు..ఒకే రాతి క్రింద విశాలంగా ఉన్న ప్రదేశం లో శివలింగం ప్రతిష్టించి ఉంది..ప్రశాంతంగా ఉంది..కళ్ళు మూసుకొని శివలింగానికి నమస్కారం చేసుకున్నారు..ఒక్కక్షణం కూర్చుని వెళదామని అనుకోని..అక్కడే కూర్చున్నారు..ఈ శివాలయం దగ్గర ఒక యోగి తపస్సు చేసుకుంటూ వున్నాడని ఆవిడ విని ఉన్నది కానీ..ఇతమిద్దంగా ఎక్కడ అన్నది ఆవిడకు తెలియదు..శివాలయం, పార్వతీదేవి మఠం..ఈరెండు చోట్లా ఆ యోగి ఉంటాడని వినడమే తప్ప చూసింది లేదు..దేవుడి దయ వల్ల తనకు ఆ యోగి దర్శనం అయితే బాగుండు అని మనసులో అనుకున్నారు..


ఇంతలో శివాలయం పైనుంచి..తెల్లటి మేని ఛాయతో ఆజానుబాహుడైన ఒక యువకుడు దిగంబరంగా మెల్లిగా ఆ రాళ్ళ మధ్య లో ఉన్న చిన్న కాలిబాటలో అడుగులో అడుగు వేసుకుంటూ దిగి వస్తున్నాడు..భుజాల క్రింది దాకా పొడవైన జుట్టు..నీళ్లు కారుతున్నది..సాక్షాత్తూ ఆ పరమశివుడే ఇలా మానవ రూపంలో దిగి వస్తున్నాడా అని అనిపించేటట్లుగా ఉందా రూపం..ఒక చేతిలో దండం..మరో చేతిలో కమండలం..పట్టుకొని..చిరునవ్వుతో వచ్చి..శివలింగం దగ్గరగా ఓ ప్రక్కగా క్రింద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు..


దమయంతమ్మ అప్రయత్నంగా చేతులు జోడించి..నమస్కారం చేసుకుంది..తన కుమారుడు చేత కూడా దణ్ణం పెట్టించింది..ఆవిడ కోరిక ఇలా వెంటనే తీరుతుందని కలలో కూడా అనుకోలేదు..నోట మాట రావటం లేదు.. ఒక నిమిషం తరువాత శ్రీ స్వామివారే.."అమ్మా..నన్ను చూడాలని తపన పడ్డావు కదా..కోరిక తీరింది కదా..ఇక వెళ్ళిరండి..శుభం జరుగుతుంది.." అన్నారు..సరే అన్నట్లు తలవూపి..ఒక నమస్కారం చేసుకొని..తల్లీ కుమారులు ఇద్దరూ ఇవతలికి వచ్చేసారు..శివాలయం బైటకు వచ్చిన తరువాత దమయంతమ్మ గారికి..శ్రీ స్వామివారి తో ఒక్క మాట కూడా తాను మాట్లాడలేదే అని గుర్తుకొచ్చింది..గబ గబా తిరిగి శివాలయం లోకి వెళ్ళింది..కానీ చిత్రం..అక్కడ శ్రీ స్వామివారు లేరు..ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు..తనకు ఇంతే ప్రాప్తం అని భావించారు దమయంతమ్మ గారు..


శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసుకునే రోజుల్లో..శ్రీధరరావు ప్రభావతి గార్లకు కాకుండా అతి కొద్దిమందికే తమ ఉనికిని చూపారు..అలా చూసి తరించిన వాళ్లలో దమయంతమ్మ గారొకరు..ప్రస్తుతం ఆవిడ జీవించి లేరు..మా తల్లిదండ్రులైన శ్రీధరరావు ప్రభావతి గార్ల ద్వారా ఈ విషయాన్ని విన్నాను నేను..నేనూ దమయంతమ్మ గారిని చూడలేక పోయాను..ఒకటి రెండు సార్లు ఆవిడ మొగలిచెర్ల లోని  శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారట కానీ..ఆ సమయం లో నేను లేను..నాకు ప్రాప్తం లేదు..


శ్రీ స్వామివారిని జీవించి ఉండగా భక్తితో దర్శించుకొన్న దమయంతమ్మ గారి గురించి నేను విన్నది ఈరోజు అక్షరబద్ధం చేసాను..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: