2, నవంబర్ 2023, గురువారం

ఏది సత్యం.

 ఏది సత్యం...!

                            - - - - - - - - - -

                                           - సత్య భాస్కర్,


    పొద్దునే బధ్ధకంగా లేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడి ఎదురుగా టీపాయ్ మీదున్న సెల్ తీసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేసాను. ప్రతి రోజూ నా దినచర్యనే అది. అలా కాసేపు కూర్చొని ఫేస్ బుక్ లు, వాట్సప్ లను పలకరిస్తే కాని బుర్ర పనిచేయనంతగా అలవాటు పడిపోయాం. ఏం చేస్తాం అనుకుంటూనే ఫేస్ బుక్ లో అన్నీ దొర్లించేస్తున్నాను. ఒక పోస్ట్ లో ఫోటోను, కింద RIP అనే కామెంట్ చూసి ఫ్యూజులు ఎగిరి పోయాయి.    

    

" అదేంటి... రామం... మన రామం.." అంటూనే ఆ పోస్టు వివరాలు చదవసాగాను.


"ప్రముఖ ప్రగతిశీల కవి, రచయిత, ఉద్యమకారుడు శ్రీ రామచంద్ర నిన్న రాత్రి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 తో పోరాడుతూ మరణించారు. మూడు రోజుల క్రితం కోవిడ్ లక్షణాలు బయట పడడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాపాడే లేక పోయారు." అదీ సారాంశం. ఎంతో మంది మితృల సంతాప సందేశాలతో నిండి పోయింది. 

   ఆఫోటోలో వుంది నా చిరకాల మిత్రుడు రామం! ఎంత దారుణం జరిగిపోయింది! రెండు మూడు రోజులుగా ఫోన్ చేయలేదు. ఏదో బిజీగా వుండి వుంటాడులే అని అనుకున్నాను. నేనెలాగూ రిటైరయి పోయాను. మొదట్లో ఖాళీగా వున్నా కదాని అందరికీ ఫోన్ చేసే వాడిని! ఎవరికి వాళ్లు తాము బిజీగా వున్నాం, తర్వాత ఫోన్ చేయమని చెబుతుండడంతో తగ్గించాను. అలాగే రామం కూడా బిజీగా వున్నాడని అనుకున్నాను.


   రామం ఎప్పుడూ బిజీనే! కధలు, కవితలు, వ్యాసాలు, మీటింగ్ లు, ఉద్యమాలు.. తనకు చిన్ననాటి మిత్రుడు. ఏదో పత్రికలో పని చేస్తుంటాడు. వాళ్లు ఎంత జీతం ఇస్తారో ఆ కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు ఆ దేవుడికి తెలియాలి. వాళ్ళ ఆవిడ కూడా ప్రైవేట్ స్కూల్లో పని చేస్తుంది. ఇద్దరూ కలిసి సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. నేనెమో ప్రభుత్వ వుద్యోగాన్ని సంపాదించుకున్న ఎలాగోలాగు బండి నడిపించేసాను. ఉద్యోగంలో వున్నప్పుడు ఎక్కువ కలిసే వాళ్ళు కాదు కానీ ఫోన్ లో పలకరింపులు మాటలు ఎప్పుడు ఆగక పోవడంతో ఆ స్నేహం అలాగే కొన సాగింది.నేను రిటైర్ అయి సిటీ లో సెటిల్ అయ్యాకనే ఒకరి ఇంటికి ఒకరి రాక పోకలు సాన్నిహిత్యం పెరిగింది. ఇంత ఘోరం జరిగి పోతుందనుకో లేదు. వారం రోజులకితం రామంతో ఆఖరి సంభాషణ గుర్తుకొచ్చింది. 

                                                    ******


  ఆరోజు కూడా ఇలాగే పొద్దునే లేచి సెల్ పట్టుకుని కాలక్షేపం చేస్తుండగా రామం ఫోన్ చేసాడు. 


"హలో! గుడ్ మార్నింగ్! ఏమిటి ఇంత పొద్దునే గుర్తు కొచ్చాను." అని అన్నాను. 


"గుడ్ మార్నింగ్! నిద్ర లేచావా, నేనే లేపేసానా!" అని అన్నాడు. 


"అదేం లేదులే! ఇవాళ ముందే లేచి బ్రష్ చేసుకున్నాను. మీ సిస్టర్ ను టీ ఇవ్వమని బతిమలాడుతున్నాను." అని అన్నాను. 


"అనవసరంగా ఆవిడను బదనాం చేయకు. నువ్వడగక ముందే నీ చేతిలో టీ కప్పు పెడుతుంది." అని పెద్దగా నవ్వాడు. 


" నీకు తెలీదురా బాబు! ఉద్యోగం చేస్తున్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ట్రీట్మెంట్ లో తేడా వస్తుంది... అది సరే గాని నేనెందుకు గుర్తుకు వచ్చానో చెప్పు." అని అన్నాను. 


" ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కోవిడ్ వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడి అనే అంశం మీద చిక్కడపల్లిలో మీటింగ్ పెడుతున్నాం నువ్వు తప్పకుండా రావాలి"అని విషయంలోకి వచ్చాడు రామం! 


ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను." ఈ కరోనా భయంతో ఇంటి గేటు కూడా దాటడంలేదు. నన్ను మీటింగ్ కు రమ్మంటావేమిటి! సీనియర్ సిటిజన్స్, పిల్లలను బయటకు రావద్దంటున్నారుగా! "అని అన్నాను. 


" అదంతా హంబగ్! ఈ కరోనా అనేది జలుబు కన్నా తక్కువ స్థాయి వైరస్! అంతర్జాతీయంగా ఫార్మాసుటికల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు మీడియాతో లేనిపోని భయాలు సృష్టించి జనాలను బెదరగొట్టి లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఒక వైపు మందే  లేదంటున్నారు మరో వైపు కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షలు, కోట్లు బిల్లులు వసూలు చేస్తున్నారు. ఏం వైద్యం చేసారని అంతలేసి బిల్లులు వేసారో చెప్పమను! ఈ విషయాలన్నీ బయట పెట్టాలనే ఈ మీటింగ్ పెట్టాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాములే! నువ్వు భయపడకుండా ఓ మాస్క్ వేసుకుని వచ్చేయ్! "అని అన్నాడు రామం! 


   వాడి మాటలకు భయంతో నా కాళ్ళు వణికాయి. 


" నన్నొదిలేయరా బాబు! నాకు ముందే భయం ఎక్కువ. ఇలాంటప్పుడు అసలే బయటకు రాను. కోవిడ్ దెబ్బకు మినిస్టర్ లు,ఎంపిలు,ఎంఎల్ ఎ లు, సినిమా స్టార్ లు కూడా అడ్డం పడుతున్నారు. నువ్వు నేను ఎంత చెప్పు! జూం మీటింగు లు పెట్టుకోవచ్చుగా! అందరూ పోగవడమెందుకూ!" అని చిరాగ్గా అన్నాను. 


దానికి వాడేమీ చలించకుండా ఇలా అన్నాడు. 


" మనం ఇళ్ల లో కూర్చుని జూం మీటింగులు పెడుతూంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడ వుండడం లేదు. ఈ కరోనా భయం చెప్పి జనాలను ఇళ్ల లోనే లాక్ డౌన్ లో పెట్టి దేశాన్ని అమ్మేస్తున్నారు. మొన్న పార్లమెంటులో ఏం జరిగిందో చూసావుగా! ప్రతిపక్షాలు లేకుండా చేసి అధికార పార్టీ వ్యవసాయాన్ని, కార్మికులను కార్పొరేట్ లకు తాకట్టు పెట్టేసింది. అందుకే మేం కూడా జనాలను కదిలించాలని నిర్ణయం తీసుకున్నాం. వేరే రాష్ట్రాలలో జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు. మనం కూడా ఈ కరోనా భయాన్ని పక్కకు పెట్టి రోడ్డు ఎక్కాలి.... సరే! నీకు వీలైతే రా! "అని ఫోన్ పెట్టేసాడు రామం! 


అదే ఆఖరి సంభాషణ! మళ్ళీ ఈరోజు  పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. కళ్ళనుండి నీరు ధారాపాతంగా కారి పోతోంది. అలాగే అచేతనుడినై కూర్చుండి పోయాను. 

                     

                        " ఏది సత్యం.... ఏదసత్యం"

                        " ఏది మృత్యువు... ఏది జీవితం" 

                          "ఏది  భ్రాంతి..... ఏది క్రాంతి" 

                  ఆ పాట ఎక్కడనుండో లీలగా వినిపిస్తోంది. 

                                     

                                       ***********

    (కరోనా సమయంలోకూడా ప్రజలకోసం వుద్యమించి బలయిపోయిన యోధులకు అంకితం)

కామెంట్‌లు లేవు: