20, మే 2024, సోమవారం

సిరికొలువు

 _*సిరికొలువు*_


_*(తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ)*_

 *20.భాగం* 


_*భువికి తరలివచ్చిన భూమహాలక్ష్మి!*_


శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై ఒత్తిగిలి పండుకుని జరిగిన సంఘటనను గూర్చి దీర్ఘాలోచనలో నిమగ్నమయినాడు. భూమహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి ఇరువురూ శ్రీవారికిపాదసేవనం చేస్తూ "ఏమిటి స్వామి సంగతి?" అని అడిగారు. 


ఆలోచనల నుండి తేరుకొన్న 

శ్రీ స్వామివారు దీర్ఘంగా నిట్టూరుస్తూ శ్రీదేవీ! భూదేవీ!  శ్రీ వైకుంఠంలో మన అభ్యంతర మందిర ద్వారం ముంగిట జరిగిన సన్నివేశం మన కొత్త అవతారాలకు నాంది అయ్యింది.


"ఓ భూదేవీ! నీవు నీ అంశారూపమైన భూమండలాన్ని సంపూర్ణ కళాంశలతో ఆవేశించి వుండు. నీ పూర్ణాంశలతో నిండి వున్న భూలోకం సమసైశ్వర్యాలతో, పాడిపంటలతో విరాజిల్లుతూ వుంటుంది. 


భూగోళంలో అడుగడుగునా, అణువణువునా ఒక వినూత్న తేజస్సు, అనంత ఆధ్యాత్మిక వర్చస్సు ఉట్టి పడుతూ వుంటుంది. ఆ సమయంలో నీ ఆకారం, దివ్య రూపం విశ్వమంతటా వ్యాపించి వుండటం వల్ల మహోన్నతమై సర్వకళలకు సర్వ సంపదలకు ఆలవాలమైన నిన్ను “భూమహాలక్ష్మి" పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. 


(తిరుమలలో వరాహస్వామి ప్రక్కన ఉన్న భూదేవిని ""భూమహాలక్ష్మి" అని అర్చక స్వాములు అంటారు). నీ ద్వారా భూలోక వాసుల క్షేమం కోసం ఒక మహోన్నత దివ్యక్షేత్రం భూగోళాన్ని పీఠికగా చేసుకొని ఆవిర్భవిస్తుంది. 


ఆ క్షేత్రంలో నేను అద్భుతమైన అవతారంతో నిన్ను అక్కున చేర్చుకొని అక్కడే కొలువై వుంటాను. 'భూలక్ష్మీ త్వరగా వెళ్లు! నా అవతార ఆవిర్భవానికి కర్తా నీవే, కారకురాలవు నీవే! 


ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా సంతృప్తిగా, సంపూర్ణంగా ఆమోదించి, తరలివెళ్లు.ఆ భూమిని పూర్తిగా సర్వత్రా ఆవేశించి, ఆవహించి వుండవలసింది" అని శ్రీహరి ఆజ్ఞాపించగా "నాథా! మాకు నీ మాటే వేదం. మీరు ఏం చెపితే అదే మేం చేస్తాం" అంటూ భూమహాలక్ష్మి వైకుంఠం నుంచి అదృశ్యం అయింది.


మరి నా సంగతో! అన్నట్లు శ్రీ మహాలక్ష్మి నాథునివైపు దృష్టి సారిస్తూ చూపులతోనే ప్రశ్నించింది.దాన్ని గమనించిన శ్రీహరి "ప్రస్తుతం భూమహాలక్ష్మి ఒక అవతారానికి కారకురాలు అవుతున్నట్లుగానే, 


భవిష్యత్తులో లోకకల్యాణం కోసం ఓ శ్రీ మహాలక్ష్మీ నీవూ, మరో విశిష్ట అవతారానికి ప్రధాన కారకురాలు అవుతావు. అది అవతారం కాదు, ఇలాగే ఇదే రూపాలతో నీవూ, నేనూ, భూలోకంలో వేరు వేరు క్షేత్రాలలో అవతరించి, ప్రత్యక్షంగా దర్శనమివ్వవలసి వుంటుంది. 


కాని ఇంకా ఆ తరుణం ఆసన్నం కాలేదు. అంతరవకు ఓపికగా వేచి వుండక తప్పదు. అంటూ శ్రీహరి శ్రీ మహాలక్ష్మిని అనునయించాడు.


 *గోవిందా గోవింద గోవిందా!!!!* 


 *6 వ అధ్యాయం సంపూర్ణం*

కామెంట్‌లు లేవు: