20, మే 2024, సోమవారం

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*


*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.40 (నలుబదియవ శ్లోకము)*


*తస్యానుజా భ్రాతరోఽష్టౌ కంకన్యగ్రోధకాదయః|*


*అభ్యధావన్నతిక్రుద్ధా భ్రాతుర్నిర్వేశకారిణః॥9987॥*


అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగువారు ఎనిమిదిమందియు మిక్కిలి క్రుద్ధులై తమ అన్న ఋణము తీర్చుకొనగోరి (అన్నను హతమార్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకై) ఆ బలరామకృష్ణుల మీదికి దాడిచేసిరి.


*44.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*తథాతిరభసాంస్తాంస్తు సంయత్తాన్ రోహిణీసుతః|*


*అహన్ పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః॥9988॥*


ఆ విధముగా అతివేగముతో సర్వసన్నద్ధులై తమ మీదికి దూసికొనివచ్చుచున్న కంకాదులను జూచి, బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని, సింహము పశువులను వలె వారిని అందఱిని సంహరించెను.


*44.42 (నలుబది రెండవ శ్లోకము)*


*నేదుర్దుందుభయో వ్యోమ్ని బ్రహ్మేశాద్యా విభూతయః|*


*పుష్పైః కిరంతస్తం ప్రీతాః శశంసుర్ననృతుః స్త్రియః||9989॥*


అప్పుడు శ్రీహరియొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూవులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములొనర్చిరి.


*44.43 (నలుబది మూడవ శ్లోకము)*


*తేషాం స్త్రియో మహారాజ సుహృన్మరణదుఃఖితాః|*


*తత్రాభీయుర్వినిఘ్నంత్యః శీర్షాణ్యశ్రువిలోచనాః॥9990॥*


పరీక్షిన్మహారాజా! అంతట కంసునియొక్క, అతని సోదరులయొక్క భార్యలు తమ ప్రాణనాథులు (ఆత్మీయుల) మరణములకు మిగుల వగచిరి. వారు తలలు బాదుకొనుచు, కన్నీరుమున్నీరుగా ఏడ్చుచు అచటికి చేరిరి.


*44.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*శయానాన్ వీరశయ్యాయాం పతీనాలింగ్య శోచతీః|*


*విలేపుః సుస్వరం నార్యో విసృజంత్యో ముహుః శుచః॥9991॥*


ఆ వనితలు వీరమరణమును పొందియున్న తమ పతుల కళేబరములను కౌగలించుకొని, పదేపదే దుఃఖాశ్రువులను రాల్చుచు బిగ్గఱగా విలపింపదొడంగిరి.


*44.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథవత్సల|*


*త్వయా హతేన నిహతా వయం తే సగృహప్రజాః॥9992॥*


*44.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*త్వయా విరహితా పత్యా పురీయం పురుషర్షభ|*


*న శోభతే వయమివ నివృత్తోత్సవమంగళా॥9993॥*


*44.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణమ్|*


*తేనేమాం భో దశాం నీతో భూతధ్రుక్ కో లభేత శమ్॥9994॥*


*44.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*సర్వేషామిహ భూతానామేష హి ప్రభవాప్యయః|*


*గోప్తా చ తదవధ్యాయీ న క్వచిత్సుఖమేధతే॥9995॥*


"ప్రాణనాథా! ప్రియా! ధర్మజ్ఞా! అనాథలను కనికరముతో ఆదుకొనువాడా! నీవు మరణించుటతో మేము అందఱము మృతప్రాయలమైతిమి. గృహములు కళావిహీనములయ్యెను. పిల్లలు ఎల్లరును దిక్కులేనివారైరి.

పురుషశ్రేష్ఠా! ప్రభుడైన నీ వియోగముతో ఈ మథురాపురముగూడ మావలె అనాథయైనది. ఇచటి ఉత్సవములు, శుభకార్యములు అన్నియును ఆగిపోయినవి. ఇప్పుడీ నగరము వెలవెలబోవుచున్నది. స్వామీ! నీవు నిరపరాధులైన ప్రాణులకు (వ్రజవాసులు మున్నగువారికి) తీరని ద్రోహము చేసితివి. ఆర్యా! అందువలన మాకు ఇట్టి దుర్గతి ప్రాప్తించినది. ప్రాణులను హింసించినవానికి సుఖము ఎట్లు లభించును? (అట్టివానికి దుఃఖములు తప్పవు). సమస్త ప్రాణులయొక్క సృష్టి స్థుతి లయములకు ఈ కృష్ణపరమాత్మయే కారకుడు. అట్టి పురుషోత్తమునకు హాని తలపెట్టినవాడు ఎన్నడును సుఖములను పొందజాలడు".


*శ్రీశుక ఉవాచ*


*44.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*రాజయోషిత ఆశ్వాస్య భగవాంల్లోకభావనః|*


*యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్॥9996॥*


*శ్రీశుకుడు ఇట్లు నుడివెను* పరీక్షిన్మహారాజా! సమస్త జగత్తునకు శ్రేయస్సులను గూర్చువాడైన శ్రీకృష్ణుడు దుఃఖితులైయున్న ఆ రాజపత్నులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యువుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తరక్రియలను జరిపించెను.


*44.50 (ఏబదియవ శ్లోకము)*


*మాతరం పితరం చైవ మోచయిత్వాథ బంధనాత్|*


*కృష్ణరామౌ వవందాతే శిరసాఽఽస్పృశ్య పాదయోః॥9997॥*


పిమ్మట బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధవిముక్తులను గావించిరి. పిదప వారి పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి.


*44.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరౌ|*


*కృతసంవందనౌ పుత్రౌ సస్వజాతే న శంకితౌ॥9998॥*


అంతట దేవకీ వసుదేవులు తమ పాదములకు ప్రణమిల్లిన తమ పుత్రులను (బలరామకృష్ణులను) జగదీశ్వరులుగా ఎఱిగినవారిని అక్కున జేర్చుకొనిరి.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం  దశమస్కంధే పూర్వార్ధే కంసవధో నామ చతుశ్చత్వారింశోఽధ్యాయః (44)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట, దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట* యను నలుబది మూడవ అధ్యాయము (44)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: