20, మే 2024, సోమవారం

శివానందలహరి

 శ్రీ శంకర భగవత్పాద     విరచిత శివానందలహరి 🙏 


25 వ శ్లోకం 

                             

   

శ్లోకము:

*********

స్తవై ర్బ్రహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం

గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది ।

స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం

కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ॥ 25 ॥

*********

*భావము*

స్త్రోత్ర పాఠములతో బ్రహ్మాదులును,జయ జయ ధ్వనులతో మహర్షులును,ఆట పాటలతో ప్రమథగణములును కొలువ పార్వతీ సమేతుడవై వృషభ వాహనముమీద వేంచేసియున్న నీ సందర్శనము చేయు భాగ్యము నాకెన్నడు లభించునో కదా!


*వివరణ*

ఈ శ్లోకం లో కూడా శ్రీ శంకరులు తాను ఎదురు చూసే భాగ్యం గురించి తెలియపరుస్తున్నారు.

'సాక్షాత్తు వాణీనాథుడైన బ్రహ్మ మొదలైన వారు స్త్రోత్రాలు చేస్తూ ఉండాలిట.

మహానుభావులైన మహర్షి పుంగవులు జయజయ

ధ్వానాలు చేస్తూ వుండాలిట. వీటికి ప్రమథ గణాల ఆటపాటలు 

తోడవాలిట.ఈ ఆనందాన్ని చూసి పరవశించే నంది మీద అయ్యవారైన శివుడు స్థిరంగా ఠీవిగా కూర్చొని వుండాలిట. ఆయన శరీరంలో సగభాగమై అమ్మవారు ఆక్రమించుకుని వుండాలిట. చేతుల్లో లేడి,ఖండపరుశువు పట్టుకుని వుండాలిట.అలా వుండే శివుణ్ణి తనివితీరా చూస్తూ పరవశిస్తూ పరమానందాన్ని పొందాలిట. ఇంతకు మించి తనకింకేమీ అక్కరలేదుట. ఇష్ట దైవాన్ని గూర్చి ఏ భక్తునికైనా ఇలాంటి కోరికే వుండాలి.హృదయంలో ఆ దైవం ముద్రితమై ఉండిపోతేనే జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఆ ఆనందాన్ని పొందే భాగ్యం చేకూరుతుంది.



ఆ పార్వతీపరమేశ్వర పాదారవిందాలకు ప్రణమిల్లుతూ...🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: