20, మే 2024, సోమవారం

మహాభాగవతం

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*


*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.26 (ఇరువది యారవ శ్లోకము)*


*తతః కూటమనుప్రాప్తం రామః ప్రహరతాం వరః|*


*అవధీల్లీలయా రాజన్ సావజ్ఞం వామముష్టినా॥9973॥*


పరీక్షిన్మహారాజా! శత్రువును దెబ్బతీయుటలో మేటియైన బలరాముడు తనమీదికి విజృంభించి వచ్చుచున్న కూటుడను మల్లుని హేళన చేయుచు తన ఎడమచేతి పిడికిలితో బలముగా మోది, అవలీలగా వధించెను.


*44.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తర్హ్యేవ హి శలః కృష్ణపదాపహతశీర్షకః|*


*ద్విధా విశీర్ణస్తోశలక ఉభావపి నిపేతతుః॥9974॥*


అదే సమయమున శ్రీకృష్ణుడు శలుడను మల్లుని శిరస్సును తన పాదముతో తన్ని వానిని హతమార్చెను. అట్లే ఆ ప్రభువు తోశలకుడను మల్లుని గడ్డిపఱకనువలె   రెండుగా చీల్చివేసెను. ఇట్లు ఆ ఇద్దఱు మల్లులును శ్రీకృష్ణుని చేతిలో మట్టిగఱచిరి.


*44.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*చాణూరే ముష్టికే కూటే శలే తోశలకే హతే|*


*శేషాః ప్రదుద్రువుర్మల్లాః సర్వే ప్రాణపరీప్సవః॥9975॥*


చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలకుడు అను ఐదుగురును బలరామకృష్ణుల ధాటికి నిహతులు కాగా, మిగిలిన మల్లులు అందఱును ప్రాణములమీది తీపిచే,   బ్రతుకుజీవుడా యనుచు శరవేగముతో పిక్కబలము చూపిరి.


*44.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*గోపాన్ వయస్యానాకృష్య తైః సంసృజ్య విజహ్రతుః|*


*వాద్యమానేషు తూర్యేషు వల్గంతౌ రుతనూపురౌ॥9976॥*


ప్రత్యర్థులైన మల్లురను మట్టిగఱపించిన బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురను చేరబిలిచిరి. ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలురతోగూడి నృత్యములొనర్చిరి. అప్పుడు వారికాలి అందెల రవళులు మధురముగా నినదించెను.


*44.30 (ముప్పదియవ శ్లోకము)*


*జనాః ప్రజహృషుః సర్వే కర్మణా రామకృష్ణయోః|*


*ఋతే కంసం విప్రముఖ్యాః సాధవః సాధు సాధ్వితి॥9977॥*


బలరామకృష్ణుల విజయహేలలకు కంసుడు తప్ప జనులు అందఱును మిగుల సంతోషించిరి. బ్రాహ్మణులు మొదలగు సాధుపురుషులు 'బాగుబాగు' అని పలుకుచు విజేతలను ప్రశంసించిరి.


*44.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*హతేషు మల్లవర్యేషు విద్రుతేషు చ భోజరాట్|*


*న్యవారయత్స్వతూర్యాణి వాక్యం చేదమువాచ హ॥9978॥*


చాణూరాది ప్రముఖ మల్లయోధులు  నిహతులుకాగా, మిగిలిన మల్లులు పాఱిపోవుచుండుటను చూచి, కంసుడు వెంటనే తూర్యాది వాద్యములను నిలిపివేయించెను. పిమ్మట అతడు తన సేవకులను ఆజ్ఞాపించుచు ఇట్లనెను-


*44.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*నిఃసారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్|*


*ధనం హరత గోపానాం నందం బధ్నీత దుర్మతిమ్॥9979॥*


*44.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*వసుదేవస్తు దుర్మేధా హన్యతామాశ్వసత్తమః|*


*ఉగ్రసేనః పితా చాపి సానుగః పరపక్షగః॥9980॥*


"సేవకులారా! దుష్టులైన ఈ బలరామకృష్ణులను వెంటనే పురమునుండి వెళ్ళగొట్టుడు. గోపాలుర ధనములను లాగికొనుచు దుష్టబుద్ధియైన నందుని బంధింపుడు. దుర్జనుడు, దురాత్ముడు ఐన వసుదేవుని వెంటనే చంపివేయుడు. ఉగ్రసేనుడు నాకు తండ్రియే యైనను అతడు శత్రుపక్షపాతియై ఉన్నాడు. కావున అతనిని, అతని అనుచరులను హతమార్చుడు".


*44.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*ఏవం వికత్థమానే వై కంసే ప్రకుపితోఽవ్యయః|*


*లఘిమ్నోత్పత్య తరసా మంచముత్తుంగమారుహత్॥9981॥*


కంసుడు ఇట్లు నోటికి వచ్చినట్లుగా ప్రేలుచుండుట చూచి శ్రీకృష్ణుడు ఎంతయో క్రుద్ధుడయ్యెను. పిమ్మట ఆ స్వామి కంసుడు ఆసీనుడైయున్న ఉన్నతాసనము మీదికి వేగముగా లఘిసిద్ధిద్వారా మిక్కిలి తేలికగా మారి పైకెగిరి చేరెను.


*44.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*తమావిశంతమాలోక్య మృత్యుమాత్మన ఆసనాత్|*


*మనస్వీ సహసోత్థాయ జగృహే సోఽసిచర్మణీ॥9982॥*


*44.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*తం ఖడ్గపాణిం విచరంతమాశు  శ్యేనం యథా దక్షిణసవ్యమంబరే|*


*సమగ్రహీద్దుర్విషహోగ్రతేజా  యథోరగం తార్క్ష్యసుతః ప్రసహ్య॥*




*44.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగమంచాత్|* 


*తస్యోపరిష్టాత్స్వయమబ్జనాభః  పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్రః॥9984॥*


అప్పుడు సమయస్ఫూర్తిగల కంసుడు తన పాలిట మృత్యువైన శ్రీకృష్ణుడు తన మీదికి వచ్చుచుండుటచూచి, ఆసనమునుండి డిగ్గునలేచి, ఖడ్గమును, డాలును చేబూనెను. అంతట అతడు (కంసుడు) ఖడ్గపాణియై, ఆకాశమున డేగవలె ఆ శ్రీకృష్ణునకు కుడియెడమల తిరుగుచు అదనుచూచి ఆయనను చంపుటకై ప్రయత్నించుచుండెను. అప్పుడు గరుత్మంతుడు ఒక మహాసర్పమును పట్టుకొనుటను వలె నిరుపమాన పరాక్రమశాలియైన కృష్ణప్రభువు ఆ కంసుని ఒడిసిపట్టుకొనెను. అంతట కంసుని కిరీటము క్రింద పడిపోయెను. విశ్వమునకు ఆశ్రయమైనవాడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఐన ఆ స్వామి వెంటనే   అతని జుట్టు పట్టుకొని, ఎత్తైన ఆ మంచె (గద్దె) పై నుండి రంగస్థలమున పడవేసెను. పిమ్మట ఆ పద్మనాభుడు ఆ కంసునిపై దుమికెను.


*44.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*తం సంపరేతం విచకర్ష భూమౌ  హరిర్యథేభం జగతో విపశ్యతః|*


*హా హేతి శబ్దః సుమహాంస్తదాభూదుదీరితః సర్వజనైర్నరేంద్ర॥9985॥*


మహారాజా! ఆ దెబ్బతో కంసుడు అసువులను కోల్పోయెను. అందఱు  చూచుచుండగనే సింహము ఏనుగునువలె శ్రీకృష్ణుడు అతని కళేబరమును నేలమీద ఈడ్చెను. అచటనున్న సభాసదులు అందఱును మిగుల బిగ్గఱగా 'హాహాకారములు' చేసిరి.


*44.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*స నిత్యదోద్విగ్నధియా తమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్|*


*దదర్శ చక్రాయుధమగ్రతో యతస్తదేవ రూపం దురవాపమాప॥9986॥*


ఇంతవఱకును కంసుడు నిరంతరము మృత్యుభయముతో ఆందోళనపడుచున్నవాడై, త్రాగుచు, మాట్లాడుచు, అటునిటు తిరుగుచు, నిద్రించుచు, ఉచ్ఛ్వాసనిశ్వాసలు సలుపుచు ఉన్నప్పుడును అతనియెదుట చక్రధారియైన ఆ పరమేశ్వరుని రూపమే కనబడుచుండెను. కంసుడు అనుక్షణము దోషబుద్ధితోనైనను (శత్రు భావముతో నైనను) శ్రీకృష్ణునే స్మరించుచున్నందున అతడు జ్యోతిస్వరూపముతో ఆ కృష్ణభగవానునియందే లీనమయ్యెను. పరమ యోగీశ్వరులకును దుర్లభమైన సారూప్యమోక్షము అతనికి ప్రాప్తించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: