20, మే 2024, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 

*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*376వ నామ మంత్రము* 


*ఓం శృంగార రస సంపూర్ణాయై నమః*


శృంగార రసముతో సంపూర్ణయైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శృంగార రస సంపూర్ణా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శృంగార రస సంపూర్ణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు, భార్యాపిల్లలయందు చెదరని అనురక్తి, పరమేశ్వరియందు నిరంతరము భక్తితత్పరత కలిగి తరించుదురు.


పరమేశ్వరి త్రిపురసుందరి. శృంగారము అను రసముచే పరిపూర్ణముగా నిండిన హృదయము కలిగినది. 378వ నామ మంత్రములో (జాలంధరస్థితా) *జాలంధరపీఠము* ను, 379వ నామ మంత్రములో *ఓడ్యాణపీఠము* ను ప్రస్తావించడం జరిగింది. 375వ నామములో *(కామపూజితా)* కామరూప పీఠమును, ఈ నామములో *(శృంగార రస సంపూర్ణా)* పూర్ణగిరి పీఠమును ప్రస్తావింపబడినవి. ఈ నాలుగు పీఠములను అధిభూత చతుష్టయము (1. కామగిరి, 2. పూర్ణగిరి, 3. జాలంధర, 4. ఓడ్యాణ) గా చెప్పడం జరిగినది. ఈ పీఠములు మానవ శరీరంలోని వరుసగా 1.మూలాధార, 2. అనాహత, 3. విశుద్ధ, 4. ఆజ్ఞా చక్రములందు గలవు. ఈ విషయము తంత్ర శాస్త్రం చెబతున్నది. శృంగ అనగా ప్రధానమైన , అర అనగా కవాటము ససంపూర్ణా అనగా నిర్గుణబ్రహ్మముతో గూడినది (అంతటా పూర్ణముగా ఉన్నవాడు, సంపూర్ణుడు). ప్రధానమగు అవిద్యగలదనుటచే శబల బ్రహ్మస్వరూపురాలు పరమేశ్వరి. బ్రహ్మానంద స్వరూపిణి. ఆనందఘనస్వరూపిణి. శృంగ అనగా రెండు (2), అర అనగా ఆరు అనగా రెండు ఆర్లు పండ్రెండు దళాలు గల పద్మము అయిన అనాహత పద్మము. దీనిని బట్టి శృంగారరసము అనగా అనాహత పద్మము అని తెలియదగును. అమ్మవారు అనాహతవాసిని అనియు భావము.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓంశృంగార రస సంపూర్ణాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*836వ నామ మంత్రము* 


*ఓం వీరమాత్రే నమః*


ఉపాసుకులలో గొప్పవారికిని, యుద్ధమునందు అభిముఖముగా చనిపోయినవారికిని జననిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వీరమాతా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం వీరమాత్రే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సకలాభీష్టములు సిద్ధింపజేయును. 


శ్రీవిద్యలో నిష్ణాతులైన ఉపాసకులు వీరులతో సమానము. శ్రీవిద్యోపాసకులు పండ్రెండు మంది గలరు. వారు మహావీరులుగా పరిగణింపబడుదురు. వారి వల్లనే శ్రీవిద్య వ్యాప్తిచెందినది. 


శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది ప్రధానంగా ఉన్నారు. కొందరు పన్నెండు అంటారు కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. కానీ దేవతలకు సంబంధించిన మనం వారిని సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అంటున్నాం. ఇంకా...విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ అమ్మను ఉపాసించారు అని తెలుసు మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే *ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా* అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు. ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు, ఇందులో మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. కనుక అమ్మను ఆరాధించేవాళ్ళు ఎంతమంది చూడందిక్కడ! వీరంతా మహావీరులు అనబడతారు. వీరందరికీ జనని వంటిది గనుక పరమేశ్వరి *వీరమాతా* యని అనబడినది. మద్యపానపాత్రకు వీరమని విశ్వనిఘంటువులో చెప్పబడినది. అట్టి పానపాత్ర కొలచునది లేదా చేతిలో ధరించునది గనుక *వీరమాతా* యని అనబడినది. వీరుడను పేరుగల గణపతికి తల్లి యని పద్మపురాణమునందు గలదు. పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పెను: *పార్వతీ! ఈ వీరకుడు నా హృదయమునకు ఇష్టమయినవాడు. ఇతడు నా ద్వారమందలి గణములచే పూజింపబడువాడు* అని యనగా, పార్వతి అప్పుడు *ఓ పరమేశ్వరా! ఇట్టి బాలుడు నాకు పుత్రుడుగా కావలయునని నాకు కోరిక గలదు. నాకు ఆ కోరిక ఎప్పుడు తీరును?* అని యన్నది. శంకరుడు పార్వతితో *ఈ బాలకుడే నీకు పుత్రుడు కాగలడని* పలికెను. ఆ విధముగా ఆ వీరకునికి పరమేశ్వరి మాత అయినది గనుక, జగన్మాత *వీరమాతా* యని అనబడినది.


ఇంకను పూర్ణదీక్షాపరులు, శ్రీవిద్యోపాసనయందు కఠోరదీక్ష సలపువారును వీరులుగా చెప్పుదురు. అందుచే జగన్మాత *వీరమాతా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం వీరమాత్రే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *

కామెంట్‌లు లేవు: