20, మే 2024, సోమవారం

జ్ఞానం, విజ్ఞత, వ్యవహారశైలి-

 జ్ఞానం, విజ్ఞత, వ్యవహారశైలి- మాటల ద్వారానే తేటతెల్లమవుతాయి. శ్రీరాముడి తొలిదర్శనంలోనే ఆంజనేయుడి మాటల తీరు ఆకట్టుకునేలా చేసింది. ఆ విషయాన్ని దాచుకోలేని దాశరథి మారుతి వాక్చాతుర్యం గురించి లక్ష్మణుడికి చెబుతాడు. ఇది రామాయణానికే పరిమితం కాదు. సార్వకాలీన సత్యం. కొందరు స్పష్టత లేకుండా, సందర్భానికి విరుద్ధంగా పెద్దగొంతుతో, అవహేళన స్వరంతో మాట్లాడతారు. మరికొందరు ముభావంగా, మొహం ముడుచుకుని పది మాటలకు ఒక మాట మాట్లాడతారు. ఇంకొందరు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పైగా ‘యథార్థవాదీ లోక విరోధి’ అంటూ తమను తాము సమర్థించుకుంటారు. ఎదుటివారు ముందుగా మాట్లాడితేగానీ కొందరు స్పందించరు. అంతవరకు చూపులు తిప్పుకొని, పరిచయస్తుల్ని కూడా ఎవరో తెలియనట్టు నటిస్తారు. మరికొందరు అతిగా మాట్లాడి ఇబ్బందిపెడతారు. 


వాక్కులు సరస్వతీదేవి ప్రసాదాలు. వాటిని అంత పవిత్రంగా, గౌరవంగా వినియోగించాలి. మాటలు మిత్ర శత్రుబంధాలను తారుమారు చెయ్యగలవు.ఇంటిగుట్టు ఎవరికీ చెప్పరాదనేది ప్రాథమికసూత్రం. ఎక్కువగా మాట్లాడేవారు ఎప్పటికప్పుడు మనసు కడిగేసుకుంటున్నట్టు- కనిపించిన వాళ్లందరికీ ఏకరువు పెడుతుంటారు. ఆ మాటల్లో ఇతరుల మీద విమర్శలూ ఉంటాయి.  నేరుగా అంటే పెద్దగా పట్టించుకోని వాళ్లు, ఇతరుల ద్వారా విన్నప్పుడు మండిపడతారు. 

వేదాలు బ్రహ్మవాక్కులు. అందుకే వాటిని మహర్షులు మాత్రమే వినగలిగారు. అవే శ్రుతులు. పండితులు పొల్లుమాట దొర్లకుండా వాక్కుల్ని నిగ్రహిస్తారు. కవులు పదాలను రసార్ణవం చేస్తారు. ప్రతి కావ్యం ఒక తేనెపట్టులాంటిదే. లాఘవంగా మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి.మనసులో స్వచ్ఛత, ప్రేమ, సమభావన ఉన్నవారి మాటలు కోయిలగానంలా, వెన్నెల విడిదిలా శ్రోతలను అలరింపజేస్తాయి. సిరి సంపదలు లేకపోయినా మధురభాషణలే, అమూల్య భూషణాలుగా ఉండేవారికి సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి.భగవంతుడు స్త్రీలకు మధురస్వరం ఇచ్చాడు. వారి మాటలు మధురాతి మధురంగా ఉండాలని ఆయన ఆకాంక్ష. సంగీతం మగువల గొంతులో ఎంతో మధురంగా ధ్వనిస్తుంది. అందుకే వాణి వాక్కులరాణి అయింది.


మన మాటలే వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని గుణాత్మకంగా, ఎంతో అర్థవంతంగా ఉపయోగించాలి. ఇతరుల మాటలు ఎలా ఉండాలని ఆశిస్తామో మనం అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ‘ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి’ అనే సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మందహాసం మొహాన్ని అందంగా మారుస్తుంది. ఎన్ని చీకాకులు వేధిస్తున్నా వాటిని చిరునవ్వు వెనక దాచుకోవచ్చు. రాముడికి పూర్వభాషి’ ముందుగా తానే పలకరించే తత్వం) అనే లక్షణం ఉంది. ఇది మానవ సంబంధాల్లో అద్భుతమైన విజయాలను చేతికందిస్తుంది. కలివిడిగా అందరితో కలిసిపోవడంతో పాటు పొందికగా పొదుపుగా మాట్లాడటం వల్ల మనల్ని అందరూ ఇష్టపడతారు.బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా రాని గౌరవాన్ని, మంచి మాటల ద్వారా పొందవచ్చు. అందుకే మాటల్ని వాగ్భూషణాలు అంటారు.

జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

కామెంట్‌లు లేవు: