20, మే 2024, సోమవారం

అన్నవరము సత్యనారాయణ స్వామి

 చాలా చిన్న పిల్లగా ఉండగా మూడు సం || వయసులో ఉండగా నా కూతురు పరిగెడుతూ కడిగిన ఇంట్లో వేసిన బట్ట పట్టామీద కాలు వేసి నోరు తెరచి ఉండగా పట్టా వెనకకు వెళ్ళి గడప మీద పడిపోయింది. 


గడప కింది దవడను కొట్టడముతో నాలుక రెండు ముక్కలు అయిపోయింది. కొద్ది పట్టుతో వ్రేలాడుతున్నది. తెల్లటి పిల్ల. ఎర్రటి నెత్తురు కారిపోతున్నది. గబగబా డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళితే ఆయన చూసి హడలిపోయి ఆ పాపను చూస్తే నాలుక కుట్టబుద్ధి వేయడము లేదు. 


ఇంక ఎవరి దగ్గరకు అన్నా తీసుకుని వెళ్ళమని అన్నారు. నాలుక మోద్దుబారిపోతున్నది గబగబా ఇంకో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళితే ఆయన ఈ అమ్మాయి చిన్న పిల్ల టోటల్ ఎనస్తిషియా ఇస్తే పక్షవాతము వచ్చే అవకాశము ఉన్నది. చాలా నెత్తురు కారిపోయి0ది నేను బహు సమర్ధులైన శస్త్ర చికిత్సా నిపుణులైన వారిలా నాలుక కుట్టమని అంటే కుట్టలేను. 


మీరు ఎవరైనా బలవంతముగా నోరు తెరచి పట్టుకుంటే నాలుకకు కుట్లు వేస్తాను. సరిగ్గా అంటుకుంటుంది అన్న నమ్మకము లేదు మీ అమ్మాయికి జీవితములో మాటలు సరిగా రావు చిన్న కొస మాత్రమే ఉన్నది కాబట్టి కుట్టేస్తాను మీరు అందుకు సిద్ధము అవ్వండి అన్నారు. కుట్టేయ్యండి అన్నాను మా ఇంట్లో ఒక పిల్లవాడి ఇంజనీర్ చదువుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లవాడు నోరు తెరచి పట్టుకున్నాడు. 


ఆయన నాలుక కుట్టేస్తే నాలుక మీద తిత్తుల లాగా వచ్చాయి. అందరూ రావడము అయ్యో నాలుక తెగిపోయిందా ఏదీ ఏదీ అనడము పిల్ల బెంగ పెట్టుకుని నోరు తెరవడము మాని వేసింది ఏమీ తినదు. కుట్లు ఊడి నెత్తురు కారి నాలుక మళ్ళీ ఊడిపోయింది. అర్ధరాత్రి రెండు గంటల సమయము ఎక్కడకు తీసుకుని వెళ్ళను? 


మళ్ళీ గబగబా ఉన్న ఊళ్ళో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాను. పిల్ల ఇలా అయిపోయింది ఏమీ తినటము లేదు జీర్ణించుకు పోయింది. కోడి ఎలా కూస్తు0దో అలా ఏడవడానికి ఓపిక లేక క్కొ క్కొ అని ఏడుస్తున్నది. నేను ఇంక ఆశ వదలి వేసుకుని ఈశ్వరుడు నాకు ఈ పిల్లను ఋణ పుత్రిక కింద ఇచ్చాడు ఉండదు వెళ్ళిపోతుంది అన్నమాట అని చాలా నిరాశ కలిగి ఆ పిల్లవాడిని పిలిచి నోరు తెరచి పట్టుకోవయ్యా మళ్ళీ కుట్లు వేస్తారుట అన్నాను. 


ఆ హాస్పటల్ లో ఎదురుగా సత్యనారాయణ స్వామి మూర్తి ఉన్నది. గండు మీసములతో నవ్వుతున్నట్లుగా ఉన్నాడాయన పవిత్రమైన వేదిక మీద నిజము చెపుతున్నాను అబద్దము ఆడటము నాకు ఇష్టము లేదు. ఆయనను చూసి చాలా అసహ్యము వేసింది. దేనికీ ఆ వెకిలి నవ్వు ? అభము శుభము తెలియని పిల్లకు నాలుక తెగి అంత కష్ట పడుతున్నది బ్రతుకుతు0దన్న ఆశ లేదు. 


నేను ఇక్కడ ఇంత బాధతో కూర్చున్నాను. నువ్వు నవ్వుతూ కనపడుతున్నావు. దేనికీ ఆనవ్వు? ఏమిటి సాధించానని నవ్వవలసిన అవసరము ఏమిటి ఇప్పుడు ? అలా నవ్వితే ఇప్పుడు ఊరుకు0టానా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఈశ్వరుడవు అన్న మర్యాద ఉన్నది నీ మీద నాకు భక్తి ఉన్నది గౌరవము ఉన్నది. 


నువ్వు ఒక ఉపకారము చెయ్యి ఒకవేళ నేను గత జన్మలలో ఏదో పాపము చేసి ఉ0డటము వలన ఈ కష్టము పడుతుంటే ఆ కష్టమును ఇంకొక రకముగా తీసుకుంటాను నీ మీద నాకు ఉన్న నమ్మకము అటువంటిది. కాలినడకన నడచి నీ క్షేత్రమునకు వస్తాను. నా కూతురు కష్ట పడకుండా దానిని బ్రతికించు. నేను దానికి మాట ఉండాలి అని అడగలేదు బ్రతికితే చాలు అన్నాను. 


యధార్ధము చెపుతున్నాను నన్ను నమ్మండి మా పిల్ల ఆడుకోవడము చక్కగా తిరగడము మొదలు పెట్టింది ఏదైనా నోట్లో పెడితే మింగేది ఒక పది రోజులు పోయిన తరవాత డాక్టర్ దగ్గరకు తీసుకుని వెడితే ఏదమ్మా ఆ అను అంటే టక్కున నోరు తెరచి0ది నాలుక బయట పెట్టు అంటే చాపింది ఆయన నాలుక పట్టుకుని చూసి తెల్లపోయి కోటేశ్వరరావు గారూ ఈ నాలుకకేనా నేను కుట్లు వేసింది అన్నారు మీరు ఈ నాలుకకే వేసింది అన్నాను. 


ఈ పాపకి ఒకప్పుడు నాలుక తెగిపోయింది అనడానికి గుర్తుగా పక్కన నల్లపూసంత చిన్న పొక్కు ఉన్నది నరము కూడా కలసి పోయింది. కుట్లు విప్పడానికి కూడా ఏమీ లేదు నాలుక మామూలుగా వచ్చేసింది ఎలా వచ్చేసిందో ఇది నిజముగా ఆశ్చర్యము మీ పాప ఎప్పటిలా మాట్లాడగలదు అన్నారు. 


తరవాతి కాలములో పిల్ల పెరిగి పెద్దది అయి నాన్నగారండీ ఎందుకు అన్ని డేట్లు ఇస్తారు? ఎందుకు అంత ఇబ్బంది పడతారు? ఎ0దుకంత కష్ట పడతారు ? ఎందుకు అన్ని ఉపన్యాసములు చెపుతారు? ఏమి ఆఫిసునుంచి వచ్చి విశ్రాంతిగా కూర్చో లేరా ! అని నన్ను గద్దించేది. అమ్మా!ఈశ్వరుడు నన్ను ఇలా మాట్లాడటానికి అవకాశము ఇచ్చాడు. 


ఆయన కోసము నేను ఏదో చెప్పుకుంటూ ఉంటాను కంగారు పడకు అంటూ ఉండేవాడిని హాయిగా సంగీతము నేర్చుకుని పాటలు పాడుతుంది B. Tech పాసయ్యి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి రామాయణములో చెప్పినట్లు రామచంద్రమూర్తితో సీతమ్మ ఆడుకున్నట్లు సంతోషముగా అల్లుడుతో ఆడుకు0టూగడుపుతున్నది. 


ఆ తరవాత నేను పాదయాత్ర చేసి స్వామివారి దర్శనము చేసుకునే అదృష్టము కూడా అన్నవరము సత్యనారాయణ స్వామి వారు కృప చేసారు. ఇది చెప్పక పోతే కృతఘ్నుడను అవుతాను అని చెప్పాను తప్పించి డాంబికమునకు చెప్పానని మీరు అనుకోవద్దు.


🌷 🌷 🌷 🌷 🌷 శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష 🙏 🙏 🙏 🙏 🙏 


లోకాః సమస్తాః సుఖినో భవన్తు 


🙏 శుభమస్తు 🙏

కామెంట్‌లు లేవు: