🌼🌸🌺 2. మన కవులు - పద్యములు - సాహిత్యము 🌺🌸🌼
సీ. నన్నయ తిక్కన ఎఱ్ఱన లెన్నగ ఆంధ్రభా
రత మహాకావ్య నిర్మాత లనగ
శ్రీకార మొనరించె శ్రీనాథ కవిరాట్టు
బహుకావ్య నిర్మాణ ప్రవరుడగుచు
రామునానతి మేర రచియించె భక్తితో
బమ్మెర పోతన్న భాగవతము
అష్టదిగ్గజకవు లాంధ్రభోజుండును
కావ్యప్రబంధాల కర్తలనగ
తే. కృతుల నెన్నెన్నొ వెలయించి రిటుల మున్ను
మహిత కవివర్యు లెందరో మానితముగ
ఆంధ్రభారతి కవ్వారు అనుగుసుతులు
ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ! 1
సీ. రమ్యమౌ పద్యాల రామగాథ రచించె
మల్లెల కవనాల మొల్లమాంబ
రామభద్రాంబయు, రంగాజి, కృష్ణాజి
ఛందోకళనిపుణ; చంద్రరేఖ
రసరమ్య కావ్యమ్ము రాధికాస్వాంతన
మును రచియించిన ముద్దుపళని
పోలిబోటి తరుణి, పొలతుక తంజనా
యకి కవయిత్రులై యలరినట్టి
తే. ఆంధ్రసాహితీ రంగాన అతివలనగ!
తెలుగుతల్లికి సింధూరతిలక మగుచు
మాన్యతను పొందిన వనితామణులు వారు!
ఆలకించగ రావయ్య!ఆంధ్ర జనుడ! 2
తే. అల జగన్నాథ కవివర్యు డనుపముండు
మహిని పండితరాయ నామాంకితుండు
ఘనుడు బహుముఖ ప్రాజ్ఞుడా కవివరుండు
అతని నెఱుగుదువా? నీవు! ఆంధ్ర జనుడ! 3
ఆ. అచ్చతెలుగు నుడుల నాటవెలదులందు
అందమొప్పు నటుల పొందుపరచి
“విశ్వదాభిరామ వినుర వేమ యటంచు”
వెలయ జేసెను గద వేమన కవి. 4
తే. ఘనుడు ఏనుగు లక్ష్మణ కవివరుండు
తెనుగున ననువదించినా డనుపమముగ
భర్తృహరి సుభాషిత సూక్తిపదములెల్ల
ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ! 5
తే. కావ్యములు కంఠమందున్న గణపతిముని
ఘనుడు కారణజన్ముడు కవుల యందు
కావ్యకంఠ గణపతిగ ఖ్యాతి గాంచె
అతని నెఱుగుదువా? నీవు! ఆంధ్ర జనుడ! 6
కం. శిక్షాస్మృతులై వెలసిన
లక్షణవాచకము లెన్నొ లక్ష్యార్థముగా
దీక్షగ రచించి రెందరొ!
వీక్షించితె? ఆంధ్ర జనుడ! వీసంబైనన్? 7
ఉ. పద్యము సాహితీప్రియుల భాగ్యవిశేషము తెల్గుతల్లికిన్
హృద్యము పూర్వసత్కవి సుహృత్సుమజన్య మరందకోశమున్
వేద్యము సద్రసజ్ఞులకు విద్యలతల్లికి ప్రీతి గొల్పు నై
వేద్యము సత్త్వహీనుల కభేద్యము సత్కవి చేయు సేద్యమున్. 8
కం. పద్యము ఛందోబద్ధము
గద్యము లాక్షణికమ్ము గణుతింపంగా
హృద్యంబుగ విలసిల్లును
గద్యము పద్యమ్ము లాంధ్ర కావ్యములందున్. 9
కం. పద్యము రసపోషణకును
గద్యము కథనానుగమన గంభీరతకున్
హృద్యంబుగ విలసిల్లగ
మధ్యగ దండకము వెలసె మానితమగుచున్. 10
కం. శతముకు పైబడి యెనిమిది
స్థితమగు పద్యములు గల్గి చిరుమకుటముతో
స్తుతి, సూక్తి, విమర్శలతో
శతకము విలసిల్లె తెల్గు సాహిత్యమునన్. 11
కం. ఇటునుండియు నటువైపుకు
అటునుండి నిటుదరికైన ననులోమముగన్
దిటవుగ చదివిన నొకటగు
పటుపద్యము తెలుగుఠీవి! పరికింపంగాన్. 12
కం. ఏక గుణింతము నుండియు
నేకాక్షర పదములెల్ల నేకము కాగా
ఏకముగ తెలుగు నందున
ఏకాక్షరపద్య మొప్పె నెక్కటి భంగిన్. 13
కం. ఇటునుండి సంస్కృతంబును
అటునుండి తెలుగునడకలు నలరారంగన్
పటుపద్యము లొప్పె తెలుగున
ఇటులొప్పెనె? ఇతరభాష నిట్టివి జూడన్. 14
కం. ఛందము లన్నిటి యందున
కందమ్మున చిందు శోభ కమనీయముగాన్
కందము తెల్గున కందము
మందారమరందమందు మధురిమ వోలెన్. 15
కం. అందని ద్రాక్షాఫలముల
పొందగ లేనట్టి నక్క పులుపను నటులన్
సుందరమౌ పద్యమ్మును
నిందింతురు మూఢమతులు నిష్ఫల మనుచున్. 16
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి