22, జులై 2024, సోమవారం

వేదవ్యాసుడు

 సద్గురుస్తుతి.




1.వేదవ్యాసుడు.




ఉ.భారతభారతీమహితభవ్యతపోధనుడార్షధర్మసే

వారతుడున్ కవీంద్రుడురుభారతభాగవతాదిసత్కథా

సారధనుండువ్యాసముని ,సత్యమువిష్ణునిరూపునిన్ సదా


ధారునిగొల్చెదన్ శుభదుధార్మికసద్గురుబాదరాయణున్.




మహావిశిష్టమైనభారతదేశమునందు ,మహితమైనభారతీదయను ,భవ్యతపోధనుడును ,ఆర్షధర్మసేవకుడును ,కవీంద్రుడును ,భారతభాగవతాదిసత్కథలనేధనముగలిగినవాడును ,విష్ణుస్వరూపుడును ,సత్యమునకాధారభూతుడును ,శుభములనిడువాడును ,బాదరాయణుడనువ్యాసుని సద్గురునిగాగొలుతును.





2.ఉ.ఆదరమొప్పభారతము నాతతశక్తిపురాణశాస్త్రముల్

మోదముతోరచించి జనమోక్షపథమ్ముగవేదభాగముల్


మేదురతన్నొసంగెనిల ,మేచకవర్ణుడుకృష్ణనాముడై


సాదరభక్తిమ్రొక్కెదను సద్గురుసత్తమువేదవ్యాసునిన్.





భా.మిక్కిలిఆదరముతో బహుపురాణశాస్త్రములను రచించి ,జనులకుమోక్షపథముజూపు వేదవిభజననొనరిచిన మేఘవర్ణుడును ,కృష్ణ యనుపేరుగల ,సద్గురూత్తముని వేదవ్యాసునికి మ్రొక్కెదను.





3.దక్షిణామూర్తి.




ఉ.రక్షణనిచ్చుదైవమయి ,రాజిలుతత్త్వమునాత్మముద్రయై


వీక్షణమౌనధారియయి ,విశ్వముపర్వగజ్ఞానధారలే

శిక్షితమైస్రవించగను ,శీఘ్రముశిష్యులబ్రోచుసామియౌ

దక్షుని జ్ఞానసాగరుని  దక్షిణమూర్తినిగొల్తుభక్తితో.




భా:దైవమువలెరక్షిస్తూ ,ఆత్మజ్ఞానమునందించుచిన్ముద్రనుధరించి ,చూచెడివారికి మౌనముద్రధరించి ,జగమంతటా జ్ఞానధారలనువర్షింపచేసి ,శిష్యులనుసుశిక్షితులనొనరిచినదక్షుడు ,దక్షిణామూర్తిని భక్తితోగొలిచెదను.




4.దత్తాత్రేయుడు.




మ.అనసూయాత్రితనూజుడై వసుధదత్తాత్రేయుడైశోభిలెన్


మనసారాభుజియించినాడుహరియున్మన్నించిసాధ్వీమణిన్


శునకంబుల్ తనవెంటవచ్చిపలికెన్ సూక్తుల్ సువేదంబులన్


విననాశ్చర్యముగాదెసద్గురుకథల్ ,సద్వేదాంతునేగొల్చెదన్.




భా.దత్తాత్రేయుడు అనసూయాత్రికుమారుడు.త్రిమూర్తులుబాలలై అనసూయనుపరీక్షించిభుజించారు.వీరివెంటవచ్చుశునకములుకూడాఆశ్చర్యకరంగావేదములువల్లించెనట.అట్టివేదాంతగురుని ,నేనుగొల్చెదను.





5.ఆదిశంకరాచార్య



శా.అద్వైతామృతధారలన్ జగతిలోనత్యంతసందీప్తి ,సం

పద్వైశిష్ట్యమహాసుధల్ పరగసంప్రావీణ్యతన్ గూర్చి ,శ్రీ

మద్వాక్కుల్ శుభమైవరింపసతమున్ మాన్యుండునైధన్యుడై

సద్వైశిష్ట్యముగన్నధీమణి!తపస్సారా!నతుల్ శంకరా!




భా.అద్వైతమనేఅమృతధారలుజగతిలో నత్యంతదీపింపగా ,విశిష్టజ్ఞానసంపదలనేసుధలుప్రావీణ్యముతోనందించి ,శ్రీసూక్తులతోనలరించినధన్యుడు ,మాన్యుడు ,నైనశంకరాచార్యునికినతులు.




6.భగవద్రామానుజాచార్య



మ.కుమతంబుల్ భువిఖండనంబొనరచెన్ గోవిందునర్చించుచున్

సమతావాదిగమంత్రరాజమునిలన్ ,సంతోషియైజెప్పె ,నా

సమతావాదిని భాష్యకారుయతిరాట్ ,సత్సాధురక్షాకరున్


రమణీయున్ కలినాశకారుగొలుతున్ ,రామానుజాచార్యునిన్.





భా.సమాజంలో అప్పటికినెలకొన్న కుమతములను నిరసించి ,సర్వసమత్వభావంతో ,అష్టాక్షరీమంత్రరాజమునెల్లరకూ ఉపదేశించినవారు ,గోవిందభక్తుడు ,సమతావాది ,భాష్యకారుడు ,యతిరాజు ,కలిపాపనాశకరుడైనరామానుజాచార్యునిగొలుతున్.




7.శ్రీమదనానందయతీంద్రులు.



మ.మదనానందయతీంద్రువందితపదున్ ,మాధుర్యవాక్శోభితున్


సదయాపాంగుని ధర్మరక్షణధృతిన్ సచ్ఛాత్రరక్షాకరున్


కదలేదైవము పాపనాశకరునిన్ ,కన్పించుశ్రీశంకరున్


పదముల్ గూర్చినుతింతుసంతతము సద్భావంబులన్ గోరుచున్.



భా.శ్రీమదనానందయతీంద్రులు నమస్కరింపదగినపాదములుకలవారు.మాధుర్యవాక్కులుగలవారు.దయాసాగరులు.ఛాత్రరక్షకులు.ధర్మరక్షణాదక్షులు.నడయాడేదైవము.కన్పించేశివుడు.వారిని నేనుపదములల్లినుతించి ,మంచిభావములిమ్మనిగోరెదను.




8.శ్రీ.అష్టకాలనరసింహరామశర్మగారు.



వరకావ్యార్ధవిధాతయై గురువునై ,వాణీదయాపాత్రుడై


సురభాషామయధీస్వరూపుడిలలో శోభిల్లువాణ్యాకృతిన్


నరసింహాఖ్యునిరామశర్మవరదున్ నైర్మల్యచిత్తంబుతో


ధరలోసద్గురుపాదునిన్ గొలిచెదన్ సత్సాహితీరూపునిన్.




భా.విశిష్టమైనకావ్యరచనలో విధాతయు ,సద్గురువును ,రూపముధరించినసరస్వతియు ,దేవభాషతోనిండినధీశక్తియుతులు ,నడయాడే సరస్వతిగా పేరందినవారు ,ఆకారముదాల్చినసాహిత్యమువంటీసద్గురుపాదులు ,శ్రీఅష్టకాలనరసింహరామశర్మగారినిగొలుతును.



కం.నరులైననుసురవరఖే

చరులైననువిద్యలంద సద్గురుకరుణన్


వరలగవలయునుతథ్యము


గురుముఖమునచదవకున్న కోవిదుడగునే.




డా.గాయత్రీదేవి

కామెంట్‌లు లేవు: