గురువందనం
గురుపౌర్ణమి శుభదినమున,
గురువులనెదఁ దలచుకొందు గురుతర భక్తిన్,
గురువాక్యమె వల్లించెద,
గురువులకును వందనములు గురు తుల్యులకున్.
ఎల్ల వేళలయందు చల్లగా కాపాడు
తల్లి ప్రేమయె నాకు తొల్లి గురువు,
ఏదికోరకముందె ఎదనంత పరచుచు
తల్లడిల్లెడి నాదు తండ్రి గురువు,
అద్వైత వేదాంతమార్తితో పలికించు
ఆదిశంకరరూప మాత్మగురువు,
అన్నపూర్ణమ్మగా అవతారమెత్తిన
ఇలవేల్పు సీతమ్మ యింటి గురువు,
ప్రతిమ గురువు, పరగ ప్రకృతి మాత గురువు
పశువు, పైరు, గురువు, పక్షి గురువు,
అక్షరములు గురువులందరు గురువులే,
పలుకు పరమ గురువు, భాష గురువు..
ఒద్దిక సుద్దులు నేర్పుచు
దిద్దించిరి యక్షరములు దీవెనలిడుచున్,
విద్దెలతల్లిని తలచుచు
పెద్దలకివె వందనములు పేరిమి మీరన్..
అణువణువున గురువు కలడు,
క్షణక్షణమునందు గలడు కాలాత్మకుడై,
ఋణమెట్లు తీర్చుకొందును?
కణకణమున గురువు కలడు కాంచుచు మ్రొక్కన్..
అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు..
🙏🕉️🙏
- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి