18, ఆగస్టు 2024, ఆదివారం

సౌందర్యలహరి

 . *🌹సౌందర్యలహరి ప్రారంభం🌹*



*🍁ముముక్షువుల అర్హతను బట్టి వారి జ్ఞాన సముపార్జనకు సహాయపడేటట్లు ఆదిశంకరాచార్యులు చేసిన ప్రస్థానత్రయ భాష్యాలు (బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత), ప్రకరణ గ్రంథాలు (ఆత్మబోధ, వివేకచూడామణి, అపరోక్షానుభూతి వంటివి) కాకుండా మన స్థాయి వారికోసం చేసిన స్తోత్రాలలో శివానందలహరి, సౌందర్యలహరి ముఖ్యమైనవి*.


*🍁అయ్యవారి గురించి చేసిన స్తోత్రంలో 'ఆనందం' అనే మాట వాడితే, అమ్మవారి స్తోత్రానికి వచ్చేటప్పటికి 'సౌందర్యం' అనే శబ్దం ఎందుకు వాడారు? మనకు తెలుసు -- సుందరుడు పురుష శబ్దం, సుందరి స్త్రీ శబ్దం. అయితే అమ్మవారు కేవలం సచ్చిదానందస్వరూపిణి. ఆ స్వరూపానికి లింగభేదం అన్వయించదు. విశ్వమంతా వ్యాపించి వున్న స్వరూపమది. ఆమె తప్ప మరొకటి లేదు. అది సాధన వల్ల మాత్రమే తెలుసుకోగలిగిన తత్వము. ఆమెయే చైతన్యము, ఆ చైతన్యమే సౌందర్యం. ఆ సాధనయే శ్రీవిద్యోపాసన. ఇక లహరి అంటే కెరటాలు , తరంగాలు; నిరంతరం ఒకదాని వెనుక ఒకటిగా ప్రవహించటం. అమ్మవారి చిచ్ఛక్తి ఆ విధంగా ప్రపంచమంతా ప్రసరిస్తూ ఉంటుంది. శివానందలహరి, సౌందర్యలహరిలలో ఏది గొప్పది అంటే ఒక్కటే చెప్పవచ్చు. అందమే ఆనందం అని. ఏది ఆనందం కలిగిస్తుందో అదే అందం. చైతన్య రూపిణితో తాదాత్మ్యం కలిగించే ఆనందమే శివానందం, సచ్చిదానందం, సత్యం-శివమ్-సుందరం*.


*🍁శంకరుల స్తోత్రాలు ఉపాసనా సంబంధమైనవి, మంత్ర శక్తి కలిగినవి. ఏ దేవతనుద్దేశించి స్తోత్రం చేస్తున్నామో, ఆ దేవత ఈ స్తోత్ర నాదంలో ఉంటుంది. ఆత్మవిద్య సాధనలో చిత్త ఏకాగ్రత అవసరం. అట్టి ఏకాగ్రతను ఉపాసన ద్వారా పొందవచ్చు. ఉపాసన ద్వారా* *అమృతమును పొందుతున్నాను అంటుంది ఉపనిషత్. అమృతత్త్వము అంటే మృత్యువు లేకపోవటం. అంటే ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందని కాదు. మృత్యువును కూడా సాక్షీభూతుడిగా చూస్తాడు జీవుడు, ఎలాటి దుఃఖము, చింత లేకుండా. దేహమే నేను అనుకోవటం అవిద్య, అజ్ఞానం. ఉపాసన ద్వారా ఈ అవిద్యను దాటి బ్రహ్మజ్ఞానమును పొందాలి. భక్తి, యోగ, జ్ఞాన సమన్వయమే శ్రీవిద్య. అది బ్రహ్మజ్ఞానాన్నిస్తుంది. నిరంతర సచ్చిదానందమును కలిగిస్తుంది*.


*🍁సౌందర్యలహరిలో ప్రధానమైన అంశం శివ, శక్త్యైక భావం. శివ, శక్తుల ఐక్య దర్శనమే 'సమయాచారము' అన్నారు*. *మన శరీరంలోనూ, ప్రపంచంలోని అన్ని జీవుల్లోనూ, వస్తువుల్లోనూ, అవసరమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి పరమేశ్వరునిది. ఆయననూ, ఈ శక్తినీ కలిపి దర్శించగలగాలి మనం. ఆ శక్తియే మంగళం. శివునిది కాబట్టి శివే. ఈ శక్తి* *పురుషార్ధములను సాధించిపెడుతుంది కనుక సర్వార్థ సాధికే. శివుడిని వదిలేసి శక్తిని మాత్రమే పూజించటం వామాచారం అనబడుతుంది. దక్ష ప్రజాపతి అలా అనుకొనే భ్రష్టత్వం పొందాడు. శంకరులు అందుచేతనే శివానంద లహరిలోనూ, సౌందర్యలహరి లోనూ, ప్రారంభ శ్లోకాలు శివ, శక్తుల ఏకత్వాన్ని, సామ్యతను ప్రస్తుతించారు*. 


*🍁ఇవి నామ సామ్యం: శంకర/శాంకరి రూపసామ్యం ఇద్దరూ త్రినేత్రులు, చంద్రకళాధారులు*. *ఆయన కామేశ్వరుడైతే, ఈమె కామేశ్వరి అధిష్టాన సామ్యం: శివ శక్త్యాత్మికములు కనుక లింగార్చన, శ్రీచక్రార్చన ఏది* *చేసినా ఇద్దరికీ కలిపి చేసినట్లే కృత్యసామ్యం: సృష్టి, స్థితి, లయము, తిరోధానము (మాయ ఆవరించటం) అనుగ్రహము (ఆ మాయను తొలగించటం) అనబడే పంచకృత్యములు చేయటంలో* *అమ్మవారు అయ్యవారికి ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. అమ్మ నామాల్లో సామరస్య పరాయణ అన్నారందుకే.లలితా* *సహస్రనామాల్లోని చివరి నామమైన శివా శివ శక్త్యైక రూపిణీ తో సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం ప్రారంభం అవుతుంది*. *🍁లలితా నామాలు ఇందులో శబ్దపరంగా, భావపరంగా కనబడతాయి*.


*శంకరులు ఈ స్తోత్రం చేయటం వెనుక ఒక ఇతిహాసం చెప్తారు. ఆయన దేశాటనం చేస్తూ కేదారంలో తపస్సు చేస్తూండగా దత్తాత్రేయ దర్శనం లభించి. వారి ఆదేశానుగ్రహాలతో యోగశక్తితో కైలాసం వెళ్తారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను భక్తితో ప్రార్ధించగా సంతసించిన ఈశ్వరుడు అయిదు స్ఫటిక లింగములను, అమ్మవారు నూరు శ్లోకాల స్తోత్ర గ్రంథాన్ని శంకరులకు బహుకరించారట. ఆయన తిరిగి వస్తుండగా నందీశ్వరుడు అడ్డగించి విషయం తెలుసుకొని అయిదు స్ఫటిక లింగములను తీసుకువెళ్ళమని అమ్మవారిచ్చిన నూరు శ్లోకాలలో 41 మాత్రమే శంకరులకిచ్చి మిగిలినవి తనవద్దనే ఉంచుకొన్నాడట*. 


*అంటే భోళా శంకరుడు భక్తులకు వారు అడిగినవన్నీ ఇచ్చినా అర్హతను నిర్ణయించి ఎవరికి ఎంతవరకు అవసరమో ఇస్తాడట నందీశ్వరుడు. అందుకే మనకు లోకంలో ఒక సామెత వుంది. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడు అని. ఇక అప్పుడు శంకరులు మారు మాటాడక చిదంబర క్షేత్రానికి చేరి అమ్మవారి పై మిగిలిన 59 రచించారట. చిదంబరం శ్రీచక్ర క్షేత్రమని చెప్తారు. ఇక్కడ అమ్మవారు శివకామసుందరి. నటరాజ స్వామి సాక్షాత్తు శ్రీచక్ర రూపమేనని చెప్తారు.*


🍁 *అమ్మవారు అనుగ్రహించిన 41 శ్లోకాల్లో దివ్యమైన మంత్ర*, *తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు నిక్షిప్తమై* *ఉన్నాయట ఇవి సచ్చిదానంద తత్త్వమును చెప్తాయి*. 


*🍁మిగిలిన శ్లోకాల్లో అమ్మవారి సౌందర్య వర్ణన వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి*. 


*🍁శంకరులు కైలాసంనుండి తెచ్చిన అయిదు స్ఫటిక లింగాలు ఇప్పటికీ త్రికాల పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాయి*. ఇవి


 *🚩ముక్తిలింగం - కేదారనాథ్* 

 *🚩వర లింగం - నీలకంఠ క్షేత్రం* (నేపాల్)

*🚩భోగలింగం - శృంగేరి శారదా పీఠం*

*🚩మోక్షలింగం - చిదంబరం* *నటరాజ ఆలయం* 

*🚩యోగలింగం - శ్రీ కంచీ కామకోటి పీఠం*. 


*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే* 

 *శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే*.🙏🏻*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️

కామెంట్‌లు లేవు: