7, నవంబర్ 2024, గురువారం

68. " మహాదర్శనము

 68. " మహాదర్శనము -- అరవై ఎనిమిదవ భాగము --ప్రతిఘటన


68.  అరవై ఎనిమిదవ భాగము--  ప్రతిఘటన



          చివరికి విద్వత్సమూహములో కూర్చున్న ఒకడు లేచినాడు. అందరి దృష్టీ అతని మీదే కేంద్రీకృతమైనది. కట్టుకున్న మడి ధోవతి ఆతని హృదయ పరిశుద్ధతను తెలియజేస్తున్నది. చేతికున్న పవిత్రమూ , కప్పుకున్న అజినోత్తరీయమూ ఆతని గురిని ఉద్ఘోషిస్తున్నవి. ముఖము పై తేజస్సు , యజ్ఞేశ్వరుడే ఈ రూపముతో వచ్చినాడా అన్నట్లుంది. చూడగా ,  భగవానులు !! భగవాన్ యాజ్ఞవల్క్యులు. 


         సభను ఆవరించిన మౌనాన్ని పగలగొట్టి , మేఘజాలమును ఛేదించుకొని వచ్చు ఉరుము గర్జన వలె ఆతని గొంతు మ్రోగింది. దూరంగా కూర్చున్న శిష్యుడిని పిలచి , " ఈ గోగణమును మా ఆశ్రమమునకు తోలుకొని వెళ్ళు " అన్నారు. గొంతులో గాంభీర్యము తొణికిస లాడుతుండినది. తానే ఎక్కువ అన్న అహంకారము ఉండలేదు. ఆతని ముఖములో కూడా అంతే! ప్రశాంతత నిండి ఉంది. ఏకాంతములో అగ్నిహోత్రము చేసి , కర్మ సాద్గుణ్యమైనది అను నమ్మికతో నిండిన భావము అక్కడ తానేతానై యున్నది. 


       సభ , భగవానుల ప్రకటనను అన్నివిధములా అంగీకరించినది. అదేమిటో ఏమోగానీ , అంతవరకూ వారిని చూడనివారు కూడా వారి తేజస్సుకు అమ్ముడు బోయినారు. అందరికీ , ఇతడిప్పుడు సర్వజ్ఞ పదవికి అర్హుడు అనిపించినది. అందరూ హర్షముతో చేతులెత్తి చప్పట్లు కొట్టినారు. 


          ఉన్నట్లుండి విద్వత్సభ వైపునుండీ ఆర్భాటమైన ఒక  గర్జన వినపడింది. అందరి దృష్టీ అటువైపు మరలింది. రాజపురోహితుడైన అశ్వలుడు లేచి నిలుచున్నాడు. ముఖము ఎర్రనై ఉంది. అతనికయిన ఆశాభంగము ఆతనికి కోపమును తెప్పించినది అన్నది స్పష్టముగా కనబడు చుండినది. అదీగాక , తాను రాజపురోహితుడనన్న అహంకారము ముఖములో యెత్తి కనబడుతున్నది.  


          ఆతడు భగవానులను మాట్లాడించినాడు. తన మనసును దాచుకోనట్లు,   ఆతని మాటనుండే ఆతని భావము వ్యక్తమగుచుండినది . : " యాజ్ఞవల్క్యులవారూ , ఇప్పుడు తమరాడిన మాట ఏమిటి ? అర్థము చేసుకున్నారా ? ఆ గోగ్రహణముతో మీరు మమ్మెల్లరనూ తిరస్కరించినట్టయింది. తమరే మనందరిలో బ్రహ్మిష్ఠతములు అని చెప్పుకున్నట్టయింది. " 


          భగవానుల ముఖముపై నున్న గంభీరభావము వికసించి మందస్మితమైనది. అటులే సన్నగా నవ్వుచూ , " బ్రహ్మిష్ఠతములైన వారెవరో వారికి మాది కూడా ఒక నమస్కారము. ఇప్పటికి మేము గోవులను ఆకాంక్షించు వారము " అన్నారు. 


          అశ్వలుడు అన్నాడు , " ఆ గోవులు మనలో బ్రహ్మిష్ఠ తములకు కానుక యని మీకు తెలుసు కదా, వాటిని ఆకాంక్షించి వాటిపై అధికారము మీదే యని చెప్పినట్లాయెను.  ఈ కార్యము వలన మాలో ఎవరు కావాలన్నా , తమను ఏమికావాలన్నా అడుగవచ్చును అన్నట్టయింది " 


       " బ్రహ్మవిచారమై ఏమికావాలన్నా అడగవచ్చును. అది ఈనాడు ఈ కార్యము వల్ల మాత్రమే అయినది కాదు, ఎప్పుడు కావాలన్నా అయి ఉండవచ్చును. " 


" అయిన , అడగవచ్చునా ? "


" దానికేమి సందేహము ? "


" అయితే చెప్పండి , అంతా తానే అయి ఉన్న మీ బ్రహ్మకూ , మాకూ వ్యత్యాసము ఏమిటి ? " 


         " మీరు చెప్పినది ఎంతో సరిగా ఉన్నది. అయితే , ఈ బ్రహ్మము ,మాది , మీది అని కాదు. బ్రహ్మము బ్రహ్మది. ఇక , దానికీ మనకూ వ్యత్యాసము అనుకున్నదాని సంగతి. అది  , అనగా ఆ వ్యత్యాసము అవిద్యా కామ కర్మల నుండీ కలిగినది. కాబట్టి , తాను వేరే అనుకొన్న సర్వమూ మృత్యువశమగును. ఆ మృత్యువును దాటినది బ్రహ్మ.  అదగుట ముక్తి. "


" మీమాట ప్రకారము ఇదంతా మృత్యువశము , కదా ? "


" ఔను "


’ అట్లయిన , ఈ యజ్ఞమును చేయు యజమానుడు ముక్తిని పొందుట , అతిముక్తుడగుట ( ముక్తిని మించినవాడగుట )  ఎటుల ? " 


        " యజమానుడు కర్మ ఫలము కావలెనని ఆశిస్తూ ( ఆశించినచో ) మృత్యువశుడగును. అలాగ కాక , అధ్యాత్మమైన ( పరమాత్మ ) తన ప్రాణమే అధిభూతమైన ( పరబ్రహ్మ )  హోతృడు అని తెలిసి చేసినచో  అదే , అధి దైవమై ( దేవతల దైవము )  అగ్ని, యనగాచేసిన కర్మము అధియజ్ఞమగును ( అన్నిటికన్నా గొప్ప యజ్ఞము ).  పరిఛ్చిన్నమైన ( తాము వేరు వేరని భావనతో నున్న )  ఈ సాధనము అప్పుడు  అపరిఛ్ఛినమై ముక్తినిస్తుంది. అదే అతిముక్తి. ." 


" మంచిది , కర్మరూపమైన మృత్యువును దాటుటెట్లో చెప్పితిరి. ఇక కాలరూపమైన మృత్యువును దాటుటెట్లు ? అది చెప్పండి. " 


       " కాలము నియతము , అనియతము అని రెండు రూపములుగా ఉంటుంది. అనియత కాలము అహోరాత్ర స్వరూపమైనది. నియతకాలము తిథి పక్షాది రూపమైనది. మీరు అడిగేది దేనిని ? " 


" రెండూ చెప్పండి "


         " సరే , యజమానుని చక్షువులున్నాయి కదా , అవి అనియత కాలమును చూపించును. దానిని,  అధ్యాత్మ వలన అధిభూతమైన అధ్వర్యుడు , అధి దైవమైన ఆదిత్య రూపముగా భావించుట చేత చేసిన కర్మ అధియజ్ఞమై కాలమను మృత్యువును ,  అనియత స్వరూపమును దాటును. 


       ఇక యజమానుని ప్రాణమున్నది కదా , దానిని,  అధ్యాత్మ వలన అధిభూతము చేసి ఉద్గాతృడిని చేసుకొని అక్కడినుండీ అధిదైవమును చేసి వాయువును చూసిన ,  కర్మము అధియజ్ఞమై కాలపు నియత స్వరూపమైన తిథి పక్షాదులను అతిక్రమించి మృత్యువును దాటును. " 


" సరే , ఇదంతా కర్మ ఫలము వద్దన్న వాడి సంగతి. కర్మఫలమును కావాలనువాడు తన స్వర్గమును ఎటుల పొందును ? "


      " అంతరిక్షము నుండీ !   ఫలము కావాలనునదీ , వద్దన్నదీ మనసు చేత. ఆ మనస్సును యజ్ఞ రక్షకుడైన బ్రహ్మ గా చేసి , చంద్రుని అనుసంధానము చేస్తే , అంతరిక్షము దారి ఇచ్చి , స్వర్గమును చూపించును. "



(  అనువాదకుని వివరణ :  యజమాని ( కర్త ) తాను చేయు ప్రతి యజ్ఞము / కర్మ  లోనూ , తన ప్రాణమును పరమాత్మ యైన పరబ్రహ్మ  ( అనగా అధిభూతము ) గా మార్చి ,  క్రమముగా హోతృడు , అధ్వర్యుడు , ఉద్గాతృడు , బ్రహ్మ ల పాత్రలు వహించి కర్మ చేయవలెను. దీనినే మనకు అర్థమగునట్లు చెప్పవలెనన్న , ఈ హోతృడు , అధ్వర్యుడు , ఉద్గాతృడు , బ్రహ్మ రూపములలో  నలుగురు ఋత్త్విజులు కర్త పరముగా యజ్ఞము చేయుదురు.  వీరు ఒక్కో వేదమునకు ప్రతినిధులుగా యజ్ఞమును పూర్తి చేయుదురు.  యజ్ఞమును కర్మ ఫలము ఆశించి చేస్తే , మృత్యువశుడగును , అనగా , కోరికలు తీరుట వలన మరలా కొత్త కోరికలు పుట్టుచూ , వాటిని తీర్చుకొనుటకై  కర్మ ఫలము వలన జన్మలు ఎత్తుతూ మరణిస్తూ ముక్తికి దూరమగును.  యజ్ఞమును కర్మ ఫలము ఆశించకుండా  చేస్తే అది ’ అధి యజ్ఞమై,’ ముక్తినిచ్చును.  


       ’అధియజ్ఞము ’ చేయుట అనగా, కర్త, తాను హోతృడై తన ప్రాణమును అగ్నితోనూ , అధ్వర్యుడై తన చక్షువులను ఆదిత్యుడితోనూ , ఉద్గాతృడై తన ప్రాణమును వాయువుతోనూ , బ్రహ్మయై తన మనసును చంద్రునితోనూ అనుసంధానము చేయవలెను. 


        దీనినే మనకర్థమగుటకు ఇలాగ చెప్పవచ్చును. అధియజ్ఞముగా చేయుటకు ఒక్కో ఋత్త్విజుడు చేయవలసినది యేమనగా , తన ప్రాణమును పరమాత్మ రూపములైన అగ్ని, వాయు , ఆదిత్యులుగా తెలుసుకొని ( భావించి , ) అనగా ,  ఋగ్వేదమునకు ప్రతినిధిఅయిన  హోతృడు తన ప్రాణమును అగ్ని తోనూ , యజుర్వేదమునకు ప్రతినిధియైన అధ్వర్యుడు తన చక్షువులను ఆదిత్య రూపముతోనూ , సామవేద ప్రతినిధియైన ఉద్గాతృడు తన ప్రాణమును వాయువుతోనూ , బ్రహ్మ స్థానములో నున్నవాడు తన మనసును చంద్రుడితోనూ అనుసంధానమూ చేసి తానే పరమాత్మయన్న భావనతో చేసే యజ్ఞము అధియజ్ఞమగును. ) 



          అశ్వలుడు తబ్బిబ్బైనాడు. బంధకమై , మృత్యురూపమైన కర్మ , కాలములను రెంటినీ దాటుటెలాగో భగవానులు ఎరుగుదురు. అలాగే కర్మ ఫలము ఎలాగ వచ్చును అన్నదీ ఎరుగుదురు. అనగా , శ్రేయస్సు ప్రేయస్సులు రెండింటీనీ తెలిసినవారు. ఇంతటి వాడి దగ్గర తానేమి వాదము చేయగలడు ? సగము తెలిసి సగము తెలియని వాడి దగ్గర వాదము చేసి గెలుచుకోవచ్చును. అన్నీ తెలిసినవాడి దగ్గర వాదమనగానేమి ? పులితో సరసమాడినట్లు కాదా ? వదిలేస్తే చాలుదేవుడా అనిపించినది. ప్రశ్న అడగకుండా ఉండుటకు లేదు  , ఏమి అడగవలెనో తెలియదు. ఇటువంటి దిగ్భ్రాంతిలో ఏదో అడిగివేసినాడు, 


" యజ్ఞములో ఋత్త్విక్కులు ఏమేమి చేయుదురు ? ఆయా కర్మలవలన యజమానునికి ఏయే ఫలములగును ? "


          ఆ ప్రశ్నను అడగగనే అందరికీ అశ్వలుల దిగ్భ్రాంతి తెలిసిపోయింది. భగవానులు నవ్వుతూ అన్నారు, " హోతృడు మూడు జాతుల మంత్రములను ఉపయోగించును, అవి : పురోనువాక్యములు , యాజ్యములు, శస్యములు అనునవి. యజ్ఞానికి ముందు చెప్పు మంత్రాలన్నీ పురోనువాక్యములు. యజ్ఞకాలములో చెప్పు మంత్రములన్నీ యాజ్యములు. యజ్ఞమైన తరువాత చెప్పునవన్నీ శస్యములు. దీనివలన యజమానుడు , ప్రాణము ఎక్కడెక్కడ ఉంటుందో , ఆ లోకముల నన్నిటినీ జయించును. 


         " అధ్వర్యువు మూడు జాతుల ఆహుతులను ఇచ్చును. మంట వలె పైకి లేచునవి  , అతిగా శబ్దము చేయునవి , కిందకు పడునవి. జ్వలించు ఆహుతుల వలన యజమానుడు దేవలోకములను గెలుచును. సశబ్దములైన ఆహుతుల వలన సశబ్దమైన పితృలోకములను గెలుచును. కిందకు పడు ఆహుతులవలన మనుష్యలోకములను గెలుచును. 


         " ఉద్గాతృడు మూడుజాతుల సామములను పాడును. యజ్ఞారంభమునకు ముందువి , యజ్ఞ కాలమునందు పాడునవి , యజ్ఞమైన తరువాత పాడునవి అని. వాటినే అధ్యాత్మముగా చూచినచో, అవి ప్రాణాపాన వ్యానములగును. వాటి వలన మనుష్యలోకము , అంతరిక్షలోకము , ద్యులోకములను గెలుచును. 


        " బ్రహ్మ ,  యజ్ఞమును మనస్సుతో రక్షించును. మనస్సు అనంతమైనది. అనంతము విశ్వే దేవతలను సూచించును. కాబట్టి , విశ్వేదేవతల వలెనే అనంతములైన లోకములను గెలుచును. " 


అశ్వలుడు ఇంకేమీ అడుగుటకు కనపడక , చేతులు జోడించి కూర్చున్నాడు. ఆనాటి సభ అక్కడికే ముగిసింది. 

Janardhana Sharma

కామెంట్‌లు లేవు: