7, నవంబర్ 2024, గురువారం

పరమార్ధ చింతన - లోకరీతి !

 


పరమార్ధ చింతన - లోకరీతి !


               శా: అంతామిధ్య తలంచి చూచిన ; నరుండట్లౌటెరింగి న్సదా 


                      కాంతల్ ,పుత్రులు ,నర్ధముల్, తనువు , నిక్కంబంచు ,మోహార్ణవ 


                     భ్రాంతిన్ జెంది చరించుఁ గాని ; పరమార్ధంబైన నీయందు తా


                     చింతాకంతయు చింత నిల్పడుగదా ! శ్రాకాళ హస్తీశ్వరా !


                         శ్రీ కాళహస్తీశ్వర శతకము- మహాకవి ధూర్జటి ;


                     

                   జీవన భ్రాంతిలో మునిగి జనం పరమార్ధతత్త్వాని గురించి తలంచే సమయమే గానక యేరీతిగా అజ్ఙానంలో జీవనం గడుపు తున్నారో ధూర్జటి యీపద్యంలో చాలా నిపుణంగా వివరించాడు.


                 భావము: ఓశ్రీకాళహస్తీశ్వరా! లోకమంతా మిధ్య (మాయ) యని తెలసిననూ జీవన భ్రాంతులై జనులు భార్యా పుత్రులు ధనములు శరీరాదులు నిజమనుకొని (శాశ్వతమని భావించి) తమనుతాము మరచి చరించుచున్నారే గాని, పరమార్ధ

స్వరూపుడవగు నిన్ను చింతాకంతయు ధ్యానింపరుగదా! 


          వివరణ: జగమొక నాటకరంగము మనము పాతల్రమే ! మనపాత్ర నటన పూర్తియైన వెనుక కాలయవనిక వెనుకుకు బోవక తప్పదు. రాజైనను పేదయైనను అదేనియతి. నిత్యము లోకమున జనన మరణాదుల నెన్నిటిని మనము గాంచుటలేదు. అయినను మనకు నదియంతయు మిధ్యయను జ్ఙానము అలవడుటలేదు. ఇది నాభార్య ,వీడు నాకొడుకు, నాయిల్లు , నాఆస్తి , అనియనుక్షణం వానిచుట్టూ తిరుగుచూ

  మోహార్ణవంలో మునిగిపోతున్నాం. ఎందరు చెపుతున్నా వినబడటంలేదు అదేపాట. అదేయావ. యీగొడవలోపడి పరమాత్మ నొక్కక్షణమైనా తలచుకోలేక పోతున్నాంకదా! 


                               ఇది పరమార్ధ సాధనకు తోడ్పడునా? పుట్టుకకు ఇదేపరమార్దమా?


                                                       అని , ధూర్జటి కవి ప్రశ్న ? ఇక సమాధానము మనదే !


                                                                                       స్వస్తి !🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: