7, నవంబర్ 2024, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము చతుర్థాశ్వాసము*


188* వ రోజు*

*అశ్వథ్థామ ఆగ్రహం*


తండ్రిని అలా తూలనాడటం విన్న అశ్వత్థామ " సుయోధనా! పశువులను కాచేవారిని బెదిరించి ఆవులను పట్టుకున్నంతా మాత్రాన ఇలా మాట్లాడటం తగదు. మనమింకా యుద్ధం చేయ లేదు, శత్రువులను జయించ లేదు, నగరం చేర లేదు యుద్ధసంలో గెలిచిన వారు కూడా ఇలా మాట్లాడరు. యుద్ధమంటే జూదంలో రాజ్యాన్ని అపహరించటం కాదు, యుద్ధభూమిలో జూదం ఆడటం కుదరదు. పాండవుల జయించేనా ద్రౌపదిని సభకు పిలిపించింది? ఈడ్చుకు రమ్మని ఆజ్ఞాపించింది. శకుని మాట వినేగా అవన్నీ చేసింది ఇప్పుడు ఆ శకుని యుద్ధం చేస్తాడులే . సభలో నీచే అవమానించ బడిన కపికేతనుడు నీపై యుద్ధానికి వస్తున్నాడు. గురువును అధిక్షేపించావు కాని దేవదానవులను జయించిన అర్జునుని నీవు ఒక్కడివే ఎదుర్కొన గలవా? వీరుని పొగడటం సహజం. పుత్ర సమానుడైన ప్రియ శిష్యుడైన అర్జునిని పొగడటం నేరమా. ఇంత జరిగిన తరువాత సిగ్గు లేకుండా నా తండ్రి యుద్ధం చేయ వచ్చు కాని నేను చేయను. సుయోధనా! యముడు చెలరేగినా, అగ్ని ఆగ్రహించినా, మృత్యు దేవత పురులు విప్పినా కొంత అయినా మిగులుతుంది. అర్జునుడు బాణాలు సర్వనాశనం చేస్తాయి. నీ కుటిల బుద్ధులు ఇక్కడ పని చేయవు. అర్జునుడు గాండీవంతో శరసంధానం చేసి బాణాలు విసురుతాడు కాని పాచికలు విసరడు. మనం మత్స్య దేశాధీశుని గోవులను పట్టుకున్నందుకు మత్స్యదేశాధీశుడు ససైన్యంతో వస్తే ఎదిరిస్తాము కాని అర్జునిని ఎదిరించ లేము " అన్నాడు.


*కర్ణుడి ఆగ్రహం*


ఆ మాటలకు కర్ణుడు ఊగిపోయాడు " మనం వచ్చింది పాండవులను పట్టు కోవడానికి. పాండవులను గుర్తించడానికి. అర్జునిని చూసి బెదరడం భావ్యమా. సుయోధనుని పిచ్చివాడిని చేయటం తగునా? మీకు భయంగా ఉంటే మీరు ఊరుకోండి. ఒక్కని ఎదిరించడానికి ఎంత మంది కావాలి. నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కపిధ్వజాన్ని విరగొట్టి, దాని చుట్టూ ఉన్న పిశాచాలను తరిమి కొడతాను. సారధిని చంపి అర్జునిని శరీరాన్ని నా బాణాలతో తూట్లు చేస్తాను. నా బాహు బలాన్ని చూడండి. అర్జునుడు పమూడేళ్ళ అరణ్యాజ్ఞాత వాసాలు ముగించుకొని యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నాడు. కౌరవసేనలో మహా వీరుడనైన నేను అతనిని ఎదుర్కొంటాను. రారాజు ఋణం తీర్చుకోవడానికి, పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్రప్రయోగం చేయడానికి కర్ణార్జునులలో ఎవరు గొప్పో తేలడానికి ఇది సమయం. అర్జునిని గెలిచి సుయోధనునికి ముదము చేకూర్చెదను. ఇష్టం ఉన్న వారు మా ద్వంద యుద్ధం చూడండి లేని ఎడల ఆవుల వెంట నగరానికి పొండి " అన్నాడు.


*కృపాచార్యుని వాదం*


కర్ణుని మాటలు విన్న కృతవర్మ " కర్ణా! నీవు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతావు. కార్యసిద్ధి గురించి నీకు పట్టదు. కార్యసాధనలో యుద్ధం ఒక నీచమైన ప్రక్రియ అని రాజనీతిజ్ఞులైన పెద్దలు చెప్తారు. దేశ, కాల, పరిస్థితిని అర్ధం చేసుకుని తన బలాన్ని ఎదిరి బలాన్ని బేరీజు వేసుకుని యుద్ధం చేయాలి కాని మూర్ఖంగా దుస్సాహసంతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు. అర్జునుడు ఒంటరి వాడని నువ్వు అంటున్నావు. ఖాండవవన దహన సమయంలో ఇంద్రునితో యుద్ధం చేసింది అర్జునుడు ఒక్కడే, యాదవ సైన్యంతో పోరాడి సుభద్రను చేపట్టింది అర్జునుడు ఒక్కడే, రాజసూయ యాగమున దిగ్విజయం చేసింది అర్జునుడొక్కడే, నివాతకవచులను సంహరించి దేవతలకు మేలొనరించించింది అర్జునుడొక్కడే, దేవేంద్రునికి అజేయులైన కాలకేయులను సంహరించింది అర్జునుడొక్కడే. అంతెందుకు ద్రౌపది స్వయవరంలో అబేధ్యమైన మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని చేపట్టడమే కాక అనంతరం తిరగబడిన రాజులను జయించినది అర్జునుడు ఒక్కడే. నువ్వూ అక్కడే ఉన్నావు కదా. పాండవులు అందరూ తమతమ శక్తి కొద్దీ దిగ్విజయం చేసారు. నీవేమో హస్థినా పురంలో కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు అర్జునుని గెలుస్తానని చెప్పడం ఒంటి చేత్తో సముద్రం ఈదడం లాంటిది. కనుక దుస్సాహసం విడిచి మనమంతా రారాజును కాపాడు కోవాలి కాని యుద్ధోన్మాదులం కాకూడదు. అందరం కలసి అర్జునిని ఎదుర్కొందాం నువ్వొక్కడివే పోరాడతానని చెప్పడం అవివేకం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: