విస్సన్న చెప్పింది వేదం" అని జాతీయం. ఎవరు ఆ విస్సన్న? ఏమిటి ఆ కథ?
“లేచింది ..నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం” అనే పాట గుండమ్మ కథ సినిమా లోనిది మన N.T.రామారావుగారిది అందరూ వినే ఉంటారు. దానిలో అతడు “ఎపుడో చెప్పెను వేమన గారూ అపుడే చెప్పెను బ్రహ్మంగారూ ..ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా విస్సన్న చెప్పిన వేదం కూడా” అంటూ పాడుతాడు. వేమన్న ఎవరో మనందరికీ తెలుసు. అలాగే కాలజ్ఞానం చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారూ తెలుసు. అయితే వీరి పేర్ల సరసన చేర్చబడిన ఆ విస్సన్నగారెవరో చాలమందికి తెలీదు. ఆయన చెప్పిన వేదం ఏమిటో కూడా తెలీదు. ఆయన ఎక్కడివాడో ఎప్పటి వాడో తెలుసుకుందామన్నా చెప్పేవారెవరూ లేక ఆయన కూడా ఒక మహానుభావుడై ఉంటాడ్లే అని సరిపెట్టుకుని ఊరుకుంటాము. అలా ఊరుకోనక్కర లేదు. ఆయనా ఒక చారిత్రిక పురుషుడే.ఆయన పూర్తి పేరు ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు .విస్సన్న చెప్పిందే వేదం అని ప్రఖ్యాతి గాంచిన ఈయన ఏ వేదం చెప్పలేదు. కాని ఏ విషయంలోనైనా వాదనలో ఆయనను ఓడించగల వాడు ఆయన కాలంలో ఉండేవాడు కాదు. ఏ శాస్త్ర విషయమైనా ఆయన నిర్ణయాన్ని కాదనగలిగే వారు లేక పోవడంతో ఆయన వాక్కే వేద వాక్కయిందన్నమాట. His was the last word in any literary dispute or argument. ఇంత ప్రఖ్యాతి గాంచిన ఈయన గురించిన విశేషాలు తెలుసుకుందాం.
శ్రీ ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు గారిది అప్పటి గోదావరి జిల్లా. ఈయన శ్రీ బులుసు అచ్చయ్య గారి శిష్యుడట. శ్రీ బులుసు అచ్చయ్యగారు దేశమంతా ప్రఖ్యాతి గాంచిన మహా పండితుడు. (అటువంటి వారి శిష్యుడైన విశ్వపతి శాస్త్రులుగారు కూడా మహా పండితుడు కావడమే కాకుండా వాదనలో మహా దిట్ట. అందువల్ల ఏ సంవాదంలోనైనా ఆయన మాటే చివరికి చెల్లుబాటై విస్సన్న చెప్పినదే వేదం అనే ఖ్యాతి ఆయనకు తెచ్చి పెట్టింది. ఈయనకు సంబంధించిన ముచ్చట ఒకటి చెబుతాను వినండి:
ఒకసారి యానాం లో మన్యం వారి దివాణంలో జరిగిన సభలో ఇతర పండితులందరికీ వ్యతిరేకంగా ఈయన చేసిన సిధ్ధాంతం ఏమిటంటే బ్రాహ్మలు కోమట్ల ( అలాగే శిష్టు కరణాల) ఇళ్ళల్లో జరిగే ఆబ్దికాలలో నేతితో కాని నూనెతో కాని వండిన అరిసెలు గారెలు వంటివి నిరాక్షేపణీయంగా భోజనం చేయవచ్చునని. దీనికి ఆయన చూపించిన ప్రమాణం-
“శ్లో. ఘృత పక్వం తైల పక్వం, పక్వం కేవల వహ్నినా,
శూద్రాదపి సమశ్నీయా దేవమాహ పితామహః”
వెంటనే ఆ రోజుల్లో విస్సన్నగారు చెప్పినది అందరు బ్రాహ్మలూ అమలు చేసేరో లేదో మనకు తెలియదు గాని, కాల క్రమేణా వారి ఆచారంలో సడలింపు తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. దీనికి సాక్ష్యం “రొట్టెకు రేవేమిటి?”అనే సామెతే.( ఈసామెత శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు తమ కథలూ గాథలూలో రెండు మూడు చోట్ల వాడేరు. ఏదో చెబుతూ విషయాంతరంలోకి వెళ్లి పోయి తిరిగి అసలు విషయానికి వచ్చే సందర్భంలో వాడేరిది.). ఆ రోజుల్లో గోదావరిలో రోజుల తరబడి పడవలలో ప్రయాణం చేసేటప్పుడు పడవ వాడు వంట చేసుకోవడానికి అనువుగా ఏదో తీరం చేర్చేవాడు. అక్కడ ఒడ్డు మీద వంటలూ భోజనాలూ కానిచ్చి తిరిగి ప్రయాణం కొనసాగించే వారన్న మాట. అలా ఏదో ఒక రేవు చేరితే కాని బ్రాహ్మలకు, వారు అంటు పాటిస్తారు కనుక, ఏదీ తినడానికి అవకాశం ఉండేది కాదన్నమాట. అయితే విస్సన్నగారు చెప్పిన దాని ప్రకారం నిప్పు మీద కాల్చినవాటికీ, నూనెలోనూ, నేతిలోనూ వేగిన వాటికీ, ఈ అంటు ప్రసక్తి ఉండదన్నమాట. అందు చేత ఎక్కడైనా తినవచ్చునని తీర్మానం. అందువలన పడవ ప్రయాణంలో రేవు రాక పోయినా దారి మధ్యలో రొట్టె వంటి పదార్థాలు భుజించవచ్చునన్నమాట. అందుకే పుట్టింది ఈ రొట్టెకు రేవేమిటి? అనే సామెత.
తన మాటను వేద వాక్కుగా జనం స్వీకరించారంటే విస్సన్నగారు (శ్రీ ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు గారు) ధన్యజీవియే కదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి