*ఇంటింటారామాయణ*
*దివ్యకథా పారాయణం*
*8 వ రోజు*
🏹🏹🏹🏹🏹🏹🏹🏹
*యుద్ధకాండ కొనసాగింపు*
🏹🏹🏹🏹🏹🏹🏹🏹
*రావణ సంహారం*
*రామయ్యకు విజయం*
🌸🌸🌸🌸🌸
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
*****
ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని
సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.
*గగనం గగనాకారం సాగరం సాగరోపమం. రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ
*కుంభకర్ణుడి ప్రవేశం*
అవమాన భారంతో కృంగిన రావణుడు, తన సోదరుడైన కుంభకర్ణుని నిద్రలేపమని మంత్రులను పంపాడు. శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి, కుంభకర్ణుడిని అతి కష్టంమీద నిద్రనుంచి లేపారు.
రావణుడు, కుంభకర్ణుడికి జరిగిన విషయం అంతా వివరించాడు. రాముడికి తమకు మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నదని చెప్పాడు. కుంభకర్ణుడు పెద్దగా ఆవులించి,
అనాలోచితంగా, సీతమ్మవారిని అపహరించి తప్పు చేశావని సోదర ప్రేమతో , రావణాసురుడిని నిందించాడు. సీతమ్మను అపహరించేటపుడు, ఆమెను అశోక వనంలో బంధించేటపుడు ఈ తెలివి ఏమైందని రవణాసురుడిని నిందించాడు.
కుంభ కర్ణా..నిన్ను నిద్ర లేపింది,యుద్ధంలో నీ ప్రతాపం చూపుతావని కానీ, జరిగిపోయిన విషయాల మీద నీ చేత తిట్లు తినడానికి కాదు.
ఆలస్యం చేయకుండా కదులు ,అన్నాడు రావణుడు.
సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు. ఆరు వందల ధనువుల ఎత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుడిని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. వానరులకు ధైర్యం చెప్పి, వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.
కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనపై విరుచుకు పడుతున్నాడు. అంతే , రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.వారి బాణాలు కుంభకర్ణుడిని ఆయుధ విహీనుడిని చేశాయి. రాముడు వాయవ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను కుంభకర్ణుడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని వానరులను మింగేస్తున్న కుంభకర్ణుడిని , రామచంద్రమూర్తి తన ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడిశరీరం క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నలిగిపోయారు.
*హనుమ వెళ్ళి*
*ఓషధి పర్వతాన్ని తెచ్చుట*
పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను చీల్చి చెండాడ సాగాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు..మానవ రూపంలో ఉన్న రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని మన్నించి స్పృహ కోల్పోయాడు. లక్ష్మణుడు, అటు పక్కగా ఉన్న కొందరు వానర నాయకులూ స్పృహ కోల్పోయారు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.
అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా, జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు స్పృహలో ఉంటే వానరసేన మరణించినా తిరిగి బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు. హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఔషధ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని జాంబవంతుడు, హనుమంతుడిని కోరాడు.
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శన చక్రంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. ఆ పర్వతంపై గల ఔషధ మొక్కల గాలి సోకగానే రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. మరణించిన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు అంతకుముందే ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
*ఇంద్రజిత్తు మరణం*
రామలక్ష్మణులు స్పృహ నుంచి తేరుకోవడం, రాక్షసులు వందలు వేల సంఖ్యలో వానర సేన చేతిలో మరణిస్తుండడంతో, రావణుడు మళ్లీ ఇంద్రజిత్తును యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను ఇంద్రజిత్తు కలవరపెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు.
ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు. అయితే ఇంద్ర జిత్తు ప్రాణాలకు సంబంధించిన ఒక రహస్యాన్ని విభీషణుడు రామలక్ష్మణులకు తెలియజెప్పాడు. యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా అతడిని ఎవరు ఆపగలరో వారిచేతులలోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అసలు రహస్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు. సమంత్రకంగా లక్ష్మణుడు దివ్య మహేశ్వరాస్త్రాన్ని విడిచాడు. అంతే...రెప్పపాటు కాలంలో ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ రాముని వద్దకు చేరుకొన్నారు.
*రామరావణ యుద్ధం ఆరంభం*
ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కావాలి కాని, యుద్ధం మధ్యలో పిరికివాడిలా ఇలాంటి పనులేమిటన్నాడు. దానితో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగు పెట్టాడు.
మరోవైపు వానర వీరులు "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.
*లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ*
రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు.
రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించసాగాడు. కొంత సేపటికి హనుమ ఔషధ పర్వతాన్ని తెచ్చాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుడి నాలుకపై పోశాడు. లక్ష్మణుడికి స్పృహ వచ్చింది రాముడు లక్ష్మణుడిని గుండెలకు హత్తుకున్నాడు. అన్నా ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు నీ ప్రతిజ్ఞను చెల్లించుకో , రావణ సంహారం చేయి అన్నాడు.. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ వధను జగత్తు అంతా తిలకించాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి కాసేపు విశ్రాంతికోసం లంకలోకి వెళ్ళిపోయాడు.
రాముడు చిరునవ్వు నవ్వాడు. కీలక ఘట్టం సమీపిస్తున్నది.
వానర సేన జయ జయధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి.....
*రావణ సంహారం*
రావణ సంహార ఘట్టం దగ్గర పడడంతో దేవతలు ఆకాశం నుంచి ఈ కీలక ఘట్టాన్ని ఆసక్తితో తిలకిస్తున్నారు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి, దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ఆ దివ్య రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి కొత్త వ్యూహం, కొత్త శక్తితో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు, మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావణుడిసారథి, రథాన్ని రాముడి కి ఎదురుగా లేకుండా దూరంగా తీసుకుపోయాడు.
అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన *"ఆదిత్య హృదయము"* ను ఉపదేశించాడు.
*ఆదిత్య హృదయం పుణ్యం
సర్వశత్రు వినాశనం ।
జయావహం జపేన్నిత్యం
అక్షయ్యం పరమం శివం ॥
సర్వమంగళ మాంగళ్యం
సర్వ పాప ప్రణాశనం ।
చింతాశోక ప్రశమనం
ఆయుర్వర్ధన ముత్తమం ॥ ॥
రశ్మిమంతం సముద్యంతం
దేవాసుర నమస్కృతం ।
పూజయస్వ వివస్వంతం
భాస్కరం భువనేశ్వరం
సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం.
రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు.
ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.
*శ్రీరామ జయం*
రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు.
సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు బాణాల వర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామ రావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి.
రాముని బాణాలకు రావణుని రధ ధ్వజపతాకం కూలింది.
గుర్రాలు పక్కకు తొలగిపోయాయి.
మహా సర్పాలవంటి రాముని బాణాలకు ,
రావణుని తల తెగిపడింది.
కానీ వెంటనే మరొకటి మొలుస్తున్నది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి.
"రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని,సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.
రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై రావణాసురుడిపైకి విడిచాడు.
వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివడిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది.
రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతి నుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు.
*సీత అగ్ని ప్రవేశం*
భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు.
రాముని ఆనతిపై విభీషణుడు రావణుడికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతమ్మవారికి నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.
లోకానికి సీతమ్మ పాతివ్రత్యాన్ని తెలియజేయాలనుకున్నాడు శ్రీరాముడు. అందుకు లోకం కోసం చిన్నసన్నివేశాన్ని సృష్టించాడు.
"సీతా,.... ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.
రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాటలు సీతకు పిడుగుపాటు లా అనిపించాయి.
సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక" అని పలికి సీతామహాసాధ్వి మంటలలోనికి నడచింది.
అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ, రాముని సమక్షంలో నిలిచి "రామా! నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. దేవతలు నీవు విష్ణువు అవతారానివని కీర్తించారు.రాముడు మాత్రం
*ఆత్మానం మానుషం మన్యే*
*రామం దశరథాత్మజం*
నాపేరు రాముడు,దశరథ కుమారుడైన మానవ మాత్రుడననే అని వినయంగా అంటాడు. మానవుడిగానే రావణ సంహారం చేశానని లోకానికి చాటాడు.
వెంటనే అగ్ని, సీతమ్మవారిని వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.
సీత అప్పుడు ఉదయ సూర్యబింబంలా ఉంది.
"రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన పరమ సాధ్వి.
ఈమెను అవశ్యం పరిగ్రహించు. " అని చెప్పాడు.
అప్పుడు రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీతమ్మవారి చేతినందుకొన్నాడు రామచంద్ర మూర్తి.
ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది.
*అయోధ్యకు పునరాగమనం*
యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. వానర సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు, విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.
విభీషణుడు, వానరులు తోడు రాగా, పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు.
*భరతుడికి వర్తమానం*
ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని భరతునికి సీతారామలక్ష్మణుల రాక గురించిన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రాముడికి, సీతమమ్మవారికి , లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేపట్టమని శ్రీరాముని ప్రార్థించాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ, విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతో, ప్రజల జయ జయధ్వానాల మధ్య అయోధ్యలోనికి ప్రవేశించారు. తల్లులకు, పెద్దలకు, గురువులకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.
*****
శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
*****
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధి సోమ సురారి దోర్భలో
ద్ధామ విరామ
భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!*
***
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం
శ్రీరాందూతం మనసా స్మరామి.
*(రేపు, శ్రీరామ పట్టాభిషేక పరమ పావన ఘట్టం)*