*దశిక రము**
🏵️ శ్లోకం 09🏵️
**ఈశ్వరో విక్రమీ ధన్వీ**
**మేధావీ విక్రమః క్రమః|**
అనుత్తమో దురాధర్షః
కృతజ్ఞః కృతిరాత్మవాన్||
75. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
76. విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
77. ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
78. మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.
79. విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి) ; పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
80. క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి) ; సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక) ; అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు) ; సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).
81. అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
82. దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
83. కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
84. కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
85. ఆత్మవాన్ --- సత్కార్యములోనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!9 !!
.............................(నామాలు 74 ... 64)
18. సర్వ శక్తులుండె, సామర్థ్యమది మెండు
విల్లు ధూర్తు నడచు, విద్వతుండు
శౌర్య వంతుడతడు సక్రమ పథగామి
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : ఈశ్వరః ... శక్తి సంపన్నుడు, విక్రమీ ... విశేష సామర్థ్యము గలవాడు, ధన్వీ ... శార్జ్ఞమను ధనుస్సు గలవాడు, మేధావీ ... జ్ఞాన గుణ సంపన్నుడు, విక్రమః ... పక్షి వాహనంపై నుంచే విశ్వ సంచారం చేయగల సమర్థుడు, క్రమః ... నియమ బద్ధత పాటించేవాడు మరియూ పాటింపజేసేవాడు.
భావము : సకల ప్రాణకోటిని పోషించగల సమర్థుడు, ఘటనాఘటన సమర్థుడు, విశ్వ రక్షణకై శార్జ్ఞమను ధనుస్సు ధరించినవాడు, జ్ఞాన గుణ సంపన్నుడు, గరుడుడినే వాహనంగా చేసుకుని విశ్వమంతా విహారం చేయగలవాడు, తాను పద్ధతిగా ఉంటూ చరాచర జగత్తును గీత దాటకుండా నడిచేట్లు చూసేవాడు ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
19. సాటిలేని సుగుణి, సరిలేరు పోరులో
కర్మ చేయుచుండు, కర్మ కతడె
ఆధరవును మరియు నాత్మవాననవలె
వందనాలు హరికి వంద వేలు !!
{అర్థాలు : అనుత్తమః ... సాటిలేని ఉత్తముడు(సుగుణి యనునది ఇకారాంత పుంలింగమే ననేది నిఘంటు ప్రమాణం), దురాధర్ష ... ఎదురులేని వాడు, కృతజ్ఞః ... ప్రాణులు చేయు కర్మలు తానే చేయువాడు, కృతి ఆత్మవాన్ ... ఆత్మల యందు సుప్రతిష్టుడు.
భావము : సుగుణాలలో సాటిలేనివాడు, రాక్షసులు సైతం ఎదుర్కోలేని యోధుడు, తనపట్ల నమ్మకముంచుచూ కృతజ్ఞతతో మెలిగేవారి కర్మలు తానే చేసేవాడు, సకల ఆత్మలయందు సుప్రతిష్ఠుడై ఉండువాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.)
**ఓం నమో నారాయణాయ** 🙏🙏
**ధర్మో రక్షతి రక్షితః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి