Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 10 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
ఉద్యద్భానుసహస్రాభా – చతుర్భాహుసమన్వితా
లలితాసహస్రనామస్తోత్త్రములో ఇక్కడ పెద్ద రహస్యము ఉన్నది. దేవతల ఆ కార్యము కోసమని వస్తున్న అమ్మవారిని వశిన్యాదిదేవతలు స్తోత్త్రము చేస్తూ కేశపాదాదిపర్యంతము అనగా తలదగ్గరనుంచి పాదములవరకు అందించారు. ముందు తల చెప్పకుండా చతుర్భాహుసమన్వితా అని తల, చేతుల గురించి చెప్పడానికి ముందు ఉద్యద్భానుసహస్రాభా చేతులు – ఆయుధములు చెప్పారు. ఉద్యద్భానుసహస్రాభా అనగా ఉదయిస్తున్న వేయిసూర్యుల కాంతి కలిగిన తల్లి. సూర్యుడు ఉదయిస్తున్న సమయములో కాంతి ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది. వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందన్న ఊహకికూడా అందదు. ముందు ఎఱ్ఱటికాంతి కనపడుతున్నదని ‘ఉత్’ అన్న శబ్దము వేశారు. ఉత్ అనగా పైకెత్తడము. కొన్ని కోట్లజన్మల తరవాత ఈ నామము వినబడి లోపల దర్శనమయితే ఆ జీవుడి జీవయాత్రలో పైకి ఎక్కడము ప్రారంభమయింది. బ్రహ్మ, విష్ణు, శివుడనే మూడుతత్త్వములను కలిపి ముద్ద చేసిన ఒకగుళిక అన్నట్టుగా సూర్యబింబము ఉన్నది. లలితాపరాభట్టారిక ఎరుపురంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశము అంతా ఆ కాంతితో నిండిపోయి అన్నీ లేత ఎరుపులోకి వచ్చేస్తాయి. అమ్మవారి ఆవిర్భావమును ఎర్రటికాంతితో ధ్యానము చేస్తే ఏమవుతుంది ? ఆ ఎరుపునకు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పిన విషయమును పట్టుకుంటే జీవనయాత్రలో కొత్తమలుపు వస్తుంది. సూర్యబింబము ఉదయిస్తున్నప్పుడు ఎఱ్ఱటికాంతి – ‘శ్రీసరణిభిః’ ముందు వచ్చి కూర్చున్న ప్రాంతము అంతా ఎరుపులో మునిగిపోయి ఆ ఎరుపులో ధ్యానము చేస్తే ఊర్వశితో సహా మూడులోకములలోని దేవవేశ్యలు అంతా వశమైపోతారని అన్నారు. ఈ శ్లోకము స్త్రీలకు ఉపాసన చెయ్యడానికి, వృద్ధిలోకి వద్దామని అనుకున్న వారికి పనికిరాదు. జగద్గురువైన శంకరులు ఇటువంటి శ్లోకము ఇవ్వడమేమిటి? ఎరుపురంగు గురించి ఈ మాట చెప్పడము ఏమిటి? అనిపిస్తుంది. గురువుల బిగింపు చాలా విచిత్రముగా ఉంటుంది. వారి వెంటపడితే తప్ప దాని రహస్యము దొరకదు. మూడులోకములలోని అందగత్తెలు వశమయ్యారు అంటే మూడులోకములలోని ఆనందము ఏది ఉన్నదో అది తామైపోయి, జ్ఞాని అయి పూర్ణులయినట్టు. ఆనందమును బయట వెతుక్కోక లోపలే అనుభవిస్తూ ఆనందస్వరూపులై ఉంటారు. ‘చిదానంద రూపం శివోహం శివోహం’ అన్న భావనలు ఏర్పడడానికి కావలసిన అమ్మవారి అనుగ్రహపు ఎర్రటికాంతులను సూర్యమండలమునందు దర్శనము చేసి ఉపాసన చెయ్యడము. అమ్మవారి ఈ అనుగ్రహము ఎర్రగా ఉండే క్రియాశక్తిగా ఉంటుంది. అన్నిపనులు చేసే చేతిని క్రియాశక్తి అంటారు. కరమే కిరణము. ఆ కిరణముల వలన మొదట వచ్చిన కాంతి ఎరుపు. ఆ ఎరుపే అమ్మవారు. ఆవిడే భగవంతునిలో కలపగలదు. ఎరుపుని ధ్యానిస్తే పూర్ణత్వం వస్తుంది. ఈ ఎరుపు కారుణ్యము. ఈ ఎరుపులో రాజసం ఉన్నది. చిక్కబడిన ఎరుపు మెల్లగా ప్రవహిస్తుంది. పలుచగా ఉన్నది తొందరగా పరిగెడుతుంది. అమ్మవారి అనుగ్రహము బాగా ప్రసరించి ఎరుపుతో కలసిపోయినవారు మెల్లమెల్లగా కదిలి వెళ్ళి ఈశ్వరునిలో కలసిపోతారు. గొప్ప అనుగ్రహము అక్కడ మొదలయితే అనుభవించవలసిన ఆనందము ఇంకొకటి ఉండదు. అమ్మవారు అందరికీ దర్శనము కావాలన్న కోరికతో వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పిస్తూ ఈ కాంతి పడని వారికి తన దర్శనము కుదరదని, అలా తనను చూడలేని వారికి తల దగ్గరనుంచి చూడడము కుదరదని చెప్పింది. చేతులు క్రియాశక్తి. చేతుల వలన ఆ శక్తిని దర్శనము చేసి జీవితమును మార్చుకుంటున్నవారు వారిని తలనుంచి పాదముల వరకు చూడగలుగుతారు. అందుకని ముందు కాంతి మీద పడాలి. ఆవిడ ఆవిర్భావము ధ్యానము చేస్తే ఆ ఎరుపుకాంతిలో మునిగిపోతే ఆనాడు జన్మకు ధన్యత కలుగుతుంది. ఎరుపు దర్శనము చేసి అనుభవిద్దామని తాపత్రయము ఏర్పడనంత కాలము జీవయాత్ర సాగుతూనే ఉంటుంది. ఏదో ఒకనాడు ఒకసారి అమ్మవారి అనుగ్రహమును బలముగా సంపాదించుకుంటే వాళ్ళయందు క్రియాశక్తి ప్రారంభము అవుతుంది. ఇది కేవలము ఒక శ్లోకములో చెప్పడము కాదు. గురుముఖతః తెలుసుకుని ధ్యానములో అనుభవించగలగాలి. గురువు అనుగ్రహముగా ముడి విడిపోతే ధ్యానము చేసి పూర్ణులు కావాలి. ఎరుపుకాంతి వెనక ఇంత రహస్యము ఉన్నది.
www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి