27, సెప్టెంబర్ 2020, ఆదివారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


****


 తృతీయ స్కంధం -31


దేవహూతి పరిణయంబు 


అప్పుడు స్వాయంభువ మనువు బంగారు రథమెక్కి భార్యతో కూడి పెండ్లికి ఎదిగిన తన కుమార్తెను వెంట బెట్టుకొని, ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషిస్తూ లోకాలన్నీ తిరిగి, ఎక్కడా అటువంటివాడు కనబడక వచ్చి వచ్చి…

పండితశ్రేష్ఠుడైన కర్దముని విష్ణువు దయతో చూచినప్పుడు ఆయన కన్నులనుండి రాలిన ఆనంద బాష్ప బిందువులు నేలపై పడి, సరస్వతీ నదిని చుట్టుకొని ప్రవహించగా బిందుసరోవరం అనే పేరు వహించిన పుణ్యతీర్థాన్ని చూశాడు. అక్కడ కర్దముని తపోవనం ఉంది. ఆ ఆశ్రమ వాటిక కానుగచెట్లు, మద్దిచెట్లు, పొగడచెట్లు, తెల్లమద్దిచెట్లు, వేపచెట్లు, కడిమిచెట్లు, కలిగొట్టుచెట్లు, చందనవృక్షాలు, కొబ్బరిచెట్లు, కర్పూరవృక్షాలు, దిరిసెనచెట్లు, లవంగలతలు, మాదీఫలాల చెట్లు, తియ్యమామిడిచెట్లు, ఎఱ్ఱచందనం చెట్లు, పోకచెట్లు, సంపెంగచెట్లు, మారేడుచెట్లు, వెలగచెట్లు, మల్లెలు మొల్లలు అల్లుకొన్న చక్కని పొదరిండ్లు కలిగి విలసిల్లుతున్నది. ఇంకా…బాగా పండిన పండ్ల బరువుతో క్రిందికి వంగిన చెట్ల కొమ్మలమీద నివసించే పక్షిమూకల కలకల ధ్వనులతో దిగంతాలు ప్రతిధ్వనిస్తూ ఆ ఆశ్రమం శుభకరంగా ఉంది.

పండిన పండ్లను మిక్కిలి వాడిగా ఉన్న తమ ముక్కులతో పొడిచి, ఆ సందులనుండి స్రవిస్తూ ఉన్న ఫలరసాన్ని త్రాగి, రామచిలుకలు సంతోషంతో చేస్తున్న అర్థవంతాలైన వేదగానాలు వీనులవిందు చేస్తున్నాయి.

లేత తియ్య మామిడి చిగుళ్ళను తినడం వల్ల వగరెక్కి పొగరెక్కిన కోయిలలు పంచమస్వరంతో మధురంగా కూస్తున్నాయి.అక్కడి సాటిలేని తమాలవృక్షాలను చూచి మేఘాలని భ్రాంతిపడి నెమళ్ళు ఉల్లాసంతో ఒళ్ళు మరచి పురులు విప్పి చూడముచ్చటగా ఆడుతున్నాయి. నీటి పక్షులతో, నీటికోళ్ళతో, బెగ్గురు పక్షులతో, కొంగలతో, చక్రవాకాలతో, తుమ్మెదలతో, కలహంసలతో, కమలాలతో, తెల్ల కలువలతో, ఎఱ్ఱ కలువలతో విరాజిల్లే సరోవరాలు ఉన్నాయి.ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్ళు, అడవిదున్నలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, లేళ్ళు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, దుప్పులు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలు సంచరిస్తున్నాయి.

అటువంటి కర్దమ మునీంద్రుని తపోవనాన్ని దర్శించి స్వాయంభువ మనువు పరిమిత పరివారంతో ఆశ్రమంలోనికి ప్రవేశించి, అక్కడ…పవిత్రమైన బ్రహ్మచర్య వ్రతానికి తగిన తపోవ్యాపారం చేత చక్కగా ప్రకాశిస్తున్న కర్దముని శరీరం మిక్కిలి చిక్కిపోయినప్పటికీ విష్ణు సంకీర్తనం అనే అమృతరసాన్ని దొన్నెలవంటి చెవులతో త్రాగి ఉండడం వల్ల కృశించినట్లుగా కనిపించడం లేదు. జడలూ, నారచీరలూ, జింక చర్మమూ ధరించి తామరరేకులవంటి విశాలమైన నేత్రాలతో ఒప్పుతూ సానబట్టని వెలకట్టరాని వినూత్న రత్నంలా వెలుగుతున్నాడు. అటువంటి కర్దముని చూచి స్వాయంభువ మనువు భక్తిభావంతో ఆయన పాదాలకు నమస్కరించాడు. ఈ విధంగా నమస్కరించగా కర్దముడు స్వాయంభువ మనువును తన ఇంటికి వచ్చిన అతిథిగా భావించి అర్ఘ్యపాద్యాలతో తృప్తి పరచి, భగవంతుని ఆదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని అతనితో ఇలా అన్నాడు. ఉత్తమ గుణాలకు స్థానమైన రాజా! భగవద్భక్తుడవైన నీవు దుర్జనులను శిక్షించడానికి, సజ్జనులను రక్షించడానికి లోకంలో పర్యటిస్తూ ఉంటావు. ఓ పుణ్యపురుషా! నీవు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, వరుణుడు, ఇంద్రుల అంశలు కలవాడవు. విష్ణుస్వరూపుడవు. అటువంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ సమస్త లోకాలలో విజయాన్ని సంపాదించే మణులు పొదిగిన బంగారు రథమెక్కి, విల్లు ధరించి, వీర సైనికుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లగా జైత్రయాత్ర సాగిస్తుంటావు.ఓ రాజా! నీవు ఈ జగత్తులో సూర్యునివలె సంచరించకపోతే ఈ లోకాలన్నీ నిద్రలో మునిగి, బ్రహ్మచే కల్పించబడిన వర్ణాశ్రమాలు అనే సముద్రం అల్లకల్లోలమై, సేతువువంటి సదాచార సంపద సంకరమై పోతుంది. జాతి సాంకర్యం ఏర్పడి దొంగల భయంవల్ల లోకాలన్నీ నశించిపోతాయి. అని చెప్పి “నీ రాకకు కారణం ఏమిటి?” అని అడుగగా, నిత్యకర్మానుష్ఠాలు నిర్వర్తించిన కర్దమ ప్రజాపతితో స్వాయంభువ మనువు ఇలా అన్నాడు. ఓ మునివరేణ్యా! బ్రహ్మ తాను రచించిన వేదాల నన్నింటినీ ఈ భూమిమీద వెలయించడానికి మిమ్ములను తన ముఖంనుండి సృష్టించాడు. దుర్మార్గులైన దొంగల బాధలను పొందకుండా సమస్త భూమిని పాలించడానికి బ్రహ్మ తన భుజాలనుండి మమ్మల్ని సృష్టించాడు..ఆ బ్రహ్మకు బ్రాహ్మణజాతి అంతఃకరణంగా, క్షత్రియజాతి శరీరంగా ఒప్పుతున్నవి. ఈ రెండూ విష్ణుదేవునిచేత తప్పక రక్షింపవలసినవి.విష్ణుస్వరూపుడవూ, దుష్టులకు చూడరానివాడవూ అయిన నీ దర్శనం నా అదృష్టం వల్ల లభించింది. నీ పాద పద్మాలలోని కేసరాల వల్ల ఎఱ్ఱబడిన నా శిరస్సూ, నీ మాటలు అనే అమృతంతో నిండిన నా చెవులూ సకల శుభాలకు స్థానాలై సఫలత్వాన్ని పొందాయి. నేను ధన్యుడ నయ్యాను. కుమార్తెపై గల వాత్సల్యం వల్ల మనస్సులో ఆందోళనపడుతూ, సమస్త దేశాలు తిరిగి అలసిపోయాను. నా విన్నపాన్ని ఆలకించు” అని ఇంకా ఇలా అన్నాడు. “ఓ మహాయోగీశ్వరా! దేవహూతి అనే ఈ కన్యక నా కూతురు. ఈమె లోకంలో మిక్కిలి సౌందర్యవంతులైన పురుషులను ఎవ్వరినీ వరించడానికి ఇష్టపడక, చింతాక్రాంతురాలై, నారద మహర్షి వల్ల నీ రూపగుణాలను విని నిన్నే వివాహమాడాలని వచ్చింది. అందుకని నీవు ఈ శుభకార్యానికి అంగీకరించి నా కుమార్తెను స్వీకరించు. పవిత్రచరిత్రా! శుద్ధమైన గృహస్థాశ్రమ కృత్యాలను నిత్యం నిర్వహించడానికి అనురూపమైన గుణమూ, శీలమూ కల ఈ కాంతను సంతోషంతో అర్ధాంగిగా అంగీకరించు. ఓ పుణ్యాత్మా! ఎంతటి విరక్తులకైనా అయాచితంగా తమంత తామే లభించిన సౌఖ్యాలను వదలకూడదని అన్నారు కదా! అటువంటప్పుడు కోరుకున్నవాళ్ళు అనుకోకుండా లభించిన ఇష్టమైన సుఖాలను మానుకుంటారా? ఇంకా విను. ఫలితం పొందడం కోసం ఒక పని చేయడానికి పూనుకొన్నవాడు లోభిని అడిగితే ఆ పని చెడడమే కాక, గౌరవానికి భంగం కూడ వాటిల్లుతుంది. నీవు వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నావని తెలిసికొని 

ఇక్కడికి…వచ్చాను. నా విన్నపాన్ని మన్నించి నా కుమార్తెను వరించు” అని చెప్పిన స్వాయంభువ మనువును చూచి కర్దముడు సంతోషంతో ఇలా అన్నాడు. “ఓ పుణ్యాత్మా! అన్యులను కాదని నాకోసం తీసుకొని వచ్చిన ఈ లతాంగి అందచందాలలో మహాలక్ష్మితో సమానురాలై ఒకనాటి రాత్రి చంద్రుని వెన్నెలతో మెరుస్తున్న తన మేడపై పాదాలకు బంగారు అందెలు అలంకరించుకొని చెలికత్తెలతో ఆడుకొంటుండగా ఆకాశంలో విమానంలో వెళ్తున్న విశ్వావసుడనే గంధర్వరాజు ఈమెను చూచి మోహంతో తూలి నేలపైన పడ్దాడు. విష్ణువును తెలిసికొనని పురుష పశువులు ఈమెను చూడలేరు. ఏం చెప్పను? అటువంటి జవరాలు అదృష్టవశాన తనంత తాను వలచినప్పుడు కోరుకొననివాడు ఉంటాడా? గుణం, రూపం, నడవడి ఈ కన్యామణికి, నాకు సమానంగా ఉన్నాయి. కనుక ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను నేను వరించి స్వీకర్తిస్తాను.ఓ పుణ్యాత్మా! దీనికొక నియమం ఉంది. అది చెపుతాను విను. గుణవతియైన ఈమెకు సంతానం కలిగేవరకు మాత్రమే నేను గృహస్థధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఓ సచ్చరిత్రా! ఆ తర్వాత విష్ణువుయొక్క ఆజ్ఞను శిరసావహించి, అతడు చెప్పినట్లుగా జితేంద్రియుడనై సన్యసిస్తాను. ఓ రాజా! విష్ణువు వల్లనే లోకాలన్నీ పుట్టి, పెరిగి, నశిస్తాయి. బ్రహ్మాదుల కతడే కారణభూతుడై ఉన్నాడు. కావున ఆ దేవుని ఆజ్ఞను జవదాటకూడదు” అని కర్దముడు పలుకగా విని స్వాయంభువ మనువు తన భార్య అయిన శతరూప అభిప్రాయాన్ని, కూతురైన దేవహూతి అభిప్రాయాన్ని తెలిసికొని ఆ కర్దముని నియమానికి ఒప్పుకొని, సంతోషిస్తూ ఉత్తమ గుణ సంపన్నుడైన ఆ కర్దమునికి దేవహూతిని ఇచ్చి యథావిధిగా వివాహం చేయించాడు. ఆ తరువాత శతరూప, పారిబర్హం అనే పేర్లు గల వివాహానికి తగిన దివ్య వస్త్రాలను, ఆభరణాలను కర్దముడు దేవహూతికి ఇచ్చాడు. ఆ విధంగా తన కులాచారాన్ని అనుసరించి పెండ్లి చేసి చింతను పోగొట్టుకొన్నవాడై స్వాయంభువ మనువు కుమార్తెను ఎడబాసి పోతున్నాననే విచారంతో ఆమెను కౌగిలించుకొని, చుబుకం పుణికి, చెక్కిలి ముద్దాడి, శిరస్సు మూర్కొని, అతిశయించిన ప్రేమతో ఉబికిన బాష్పధారలతో ఆమె శిరస్సును తడిపి “తల్లీ! పోయి వస్తాను” అని చెప్పి కర్దముని వీడ్కొని భార్యతో రథమెక్కి సపరివారంగా బయలుదేరాడు. కదులుతూ ఉన్న కెరటాలు గల బిందు సరస్సును దాటి, సరస్వతీనదిని దాటి, ఆ నదీతీరంలో తామరపూలతోను, దట్టమైన చెట్లతోను ఒప్పుతున్న మునీశ్వరుల ఆశ్రమాలను ముప్పిరిగొన్న ఆనందంతో చూస్తూ స్వాయంభువ మనువు తన పట్టణమార్గాన్ని పట్టి వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి బ్రహ్మావర్తదేశంలో…

పూర్వం విష్ణువు యజ్ఞవరాహరూపం ధరించి ఒక్కసారిగా ఒళ్ళు విదిలించగా అతని శరీరం మీది బిరుసైన వెంట్రుకలు ఆ ప్రదేశంలో రాలాయి. వాటివల్ల పచ్చని దర్భలూ, రెల్లుగడ్డీ, యజ్ఞకార్యాలకు యోగ్యమైన అగ్నీ పుట్టాయి. వాటితో ఋషులు అక్కడ యజ్ఞాలు చేశారు. యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్న రాక్షసులను తుదముట్టించారు. అటువంటి బ్రహ్మావర్తదేశంలో స్వాయంభువ మనువు కూడా విష్ణువు నుద్దేశించి యజ్ఞం చేసి ప్రజ్ఞానిధియై విరాజిల్లిన తన పట్టణాన్ని సమీపించాడు. ఆ విధంగా తన పట్టణాన్ని సమీపించగా పురజనులు కానుకలను తెచ్చి ఇచ్చి అనేక విధాలుగా స్తుతిస్తుండగా, మంగళవాద్యాలు మ్రోగుతుండగా స్వాయంభువ మనువు తన అంతఃపురం 

ప్రవేశించాడు.అలా ప్రవేశించి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికాలనే తాపత్రయాన్ని రూపుమాపే భగవద్భక్తిని పెంపొందించుకుంటూ పుత్రులు, మిత్రులు, ఆప్తులు, బంధువులతో కూడి పరమానందంగా ఉన్నాడు. అతడు ప్రతిదినం మిక్కిలి భక్తితో విష్ణువునందే మనస్సు నిల్పి, గంధర్వవీణను మేళవించి విష్ణువున కంకితంగా కమ్మని గీతాలను గానం చేస్తూ సంతుష్టాంతరంగుడై భోగభాగ్యాల మీద ఆసక్తి లేనివాడై, సర్వదా నారాయణ సేవాపరాయణుడై అనంత మహిమాన్వితుడైనాడు. 

విష్ణువు పాదపద్మాలపై సమర్పింపబడిన తులసీదళాల ప్రవిత్ర పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ భగవంతుని లీలావిలాసలను స్మరిస్తూ, కీర్తిస్తూ, చర్చిస్తూ, వింటూ ఆ దేవుని సేవలకు ఆటంకాలై సంసారబంధాలైన ధర్మార్థకామాలను తిరస్కరించి మోక్షసాధకాలైన సత్కార్యాలను నిర్వహించాడు. వేదార్థాలకు మాత్రమే గోచరమయ్యే ఆ భగవంతుని చరిత్రను ప్రసంగించడంలో ఆసక్తి కలిగిన మనస్సు కల ఆ స్వాయంభువ మనువుకు ఎన్ని జాములు గడిచినా గడువనట్లే ఉంది. ఆ స్వాయంభువ మనువు విష్ణువు దివ్యమంగళ చరిత్రలను వింటూ, ఆయన రూపాన్ని ధ్యానిస్తూ, ఆయన లీలలను గానంచేస్తూ, ఆయనను ఆరాధిస్తూ, తన స్వప్న, జాగ్రత్, సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. విష్ణుభక్తుడు కనుక శరీరానికి, మనస్సుకు సంబంధించిన వ్యథలను పొందలేదు. దేవతలవల్లా, మానవులవల్లా, పంచభూతాలవల్లా కలిగే బాధలలో చిక్కుకోలేదు. ఉత్తములైన మునీశ్వరులకు సంతోషం కలిగేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా నడుపుతూ, సర్వప్రాణులకు మేలు చేస్తూ డెబ్బైయొక్క మహాయుగాలు పాలించాడు. సమ్మోదంతో, సాటిలేని మేటి యశస్సుతో సచ్చరిత్రుడై విరాజిల్లాడు. ఈ విధంగా విదురునికి మైత్రేయుడు దయతో స్వాయంభువ మనువు చరిత్రను వినిపించి “కర్దముని కథను వివరిస్తాను” అని సంతోషంగా చెప్పాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: