27, సెప్టెంబర్ 2020, ఆదివారం

తిరుమల కు వెలితే

 తిరుమల కు వెలితే తప్పకుండ చూడవలసినవి ఏంటో తెలుసు కుందామా 🙏


శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా....


తిరుమల... ..శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం. చారిత్రక, పురాణ ప్రాశస్త్యమున్న ఎన్నో ఆలయాలు, తీర్థాలకు ఏడు కొండలు నెలవుగా ఉన్నాయి. ఒక విధంగా తిరుమల ఎన్నో విశేషాల సమాహారం. సప్తగిరులే శయన రూపంలో ఉన్న శ్రీనివాసుడి ముఖాన్ని పోలి కనిపించడం ఎంతో విశేషమైనది. ఒకసారి తిరుమలకు వెళితే తప్పకుండా చూడాల్సినవేంటో తెలుసుకుందాం. తిరుమల గురించి అరుదైన విశేషాలను కూడా తెలుసుకుందాం.


️లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమలలో నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశాడని అందరికీ తెలిసిందే. వైకుంఠ లోకం నుంచి స్వామి వారు భూలోకంలోని ఏడుకొండలపై దిగిపోయి పద్మావతీ అమ్మవారిని పరిణయమాడిన కథనం గురించి వినే ఉంటారు. విషయం తెలుసుకుని లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి స్వామి వారిని నిలదీయడం, దాంతో స్వామి వారు విగ్రహ రూపంలోకి మారిపోవడాన్ని ఆలయ స్థల పురాణం చెబుతోంది. స్వామి వారు శిలామూర్తిగా మారిపోయిన వెంటనే లక్ష్మీదేవీ అమ్మవారు స్వామి ఎడమ వక్షస్థల ప్రాంతంలో, పద్మావతీ అమ్మవారు కుడి వక్షస్థల ప్రాంతంలో అంతర్లీనమైనట్టు చెబుతారు. చూడ్డానికి స్వామి వారి విగ్రహం ఒక్కటే కనిపిస్తుంది. కానీ అక్కడ స్వామి, అమ్మవార్లు కూడా ️ఉన్నట్టు భావించాలి. 


భూ వరాహస్వామి🙏


స్వామి వారి ఆలయం ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని ఉండే ఆలయమే శ్రీ భూవరాహ స్వామి ఆలయం. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. భూవరాహస్వామి వారి ఆధ్వర్యంలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు భూమిపైకి రాక ముందు భూ వరాహస్వామి ఏడుకొండలపై నివసించేవారు. ఏడుకొండలపై నివాసం ఉండాలన్న శ్రీనివాసుడి కోరిక మేరకు వరాహస్వామి అక్కడి భూమి అంతటినీ స్వామి వారికి కేటాయించేశారు. ఇందుకు స్వామి వారు కృతజ్ఞతతో తొలి దర్శనం, తొలి నైవేద్యం భూవరాహ స్వామి వారికే దక్కాలని అనుగ్రహించారు. ఫలితంగా తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా భూ వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుడ్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెబుతోంది. దీని ద్వారా స్వామి వారి కృపకు పాత్రులు కావడానికి వీలుంటుంది.


భూ వరాహ స్వామి ఆలయం ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు దర్శనాల కోసం తెరిచి ఉంటుంది. వరాహ స్వామి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.


బేడీ ఆంజనేయస్వామి ఆలయం 🙏


️తిరుమలకు వచ్చే వారు ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా దాదాపు చూసే ఉంటారు. ప్రతి రోజూ నిత్య నైవేద్యాన్ని తొలుత భూ వరాహస్వామి వారికి తర్వాత వెంకటేశ్వరస్వామి వారికి సమర్పణ చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి కూడా తీసుకెళ్లి ఆరగింపు చేస్తారు. ఆంజనేయుడు యుక్త వయస్సులో ఉన్నప్పుడు తిరుమల నుంచి వెళ్లిపోవాలని భావిస్తాడు. తల్లి అంజనాదేవి ఇది తెలుసుకుని ఆంజనేయుడి రెండు చేతులను కలిపి బేడీలు వేసినట్టు కట్టేసి తాను తిరిగి వచ్చే వరకు కదలవద్దని చెప్పి అదృశ్యం అవుతుంది. ఆకాశగంగ వెనుక భాగంలోకి వెళ్లిన అంజనాదేవి ఎంతకీ తిరిగి రాలేదు. దాంతో ఆంజనేయుడు అలానే ఉండిపోతాడు. బేడీ ఆంజనేయస్వామి అనే పేరు ఇలానే వచ్చింది. స్వామి వారికి ప్రతీ ఆదివారం అభిషేకం నిర్వహిస్తారు.


విమాన వెంకటేశ్వరుడు🙏


️తిరుమలలో స్వామి వారిని దర్శించుకుని గర్భగుడి చుట్టూ తిరిగి వెళ్లే క్రమంలో విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం కనిపిస్తుంది. గర్భగుడి బయట పై భాగంలో స్వామి వారి రూపు వెండి, బంగారు తొడుగుతో దర్శనమిస్తుంది. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం.


స్వామి పుష్కరిణి🙏


️స్వామి వారి ఆలయం పక్కనే ఉండే పుష్కరిణికి చాలా విశిష్టత ఉంది. వైకుంఠంలోని పుష్కరిణియే ఇదని చెబుతారు. స్వామి భూమిపైకి రావడంతో ఆయన వాహనమైన గరుత్మంతుడు పుష్కరిణిని ఇక్కడకు తీసుకొచ్చినట్టు చెబుతారు. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి రోజున ముక్కోటి పుష్కరిణిగా మారుతుందని నమ్మకం. ఆ రోజున ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే నదుల్లో చేసినంత పవిత్రత, పుణ్యం వస్తుందంటారు. పురాణాల ప్రకారం పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలుస్తాయని, ఇక్కడ దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని చెబుతారు. 


తీర్థాలు🙏


️పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం, సనక సనందన తీర్థం ఇవి కొన్నే. తిరుమల అంతటా పవిత్ర తీర్థాలు కోటి వరకు ఉన్నాయని చెబుతుంటారు.


తీర్థాల వద్ద జరిగే ముఖ్యమైన పండుగలు🙏


కుమారధార వద్ద మాఘ పౌర్ణమి రోజున, రామకృష్ణ తీర్థం వద్ద పుష్య పౌర్ణమినాడు, తుంబురు తీర్థం వద్ద ఫాల్గుణ పౌర్ణమి నాడు, చక్రతీర్థం వద్ధ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.....


శిలాతోరణం🙏


️ఆలయం ఉత్తరలో కిలోమీటరు దూరంలో ఉండే అటవీ ప్రాంతంలో ఇది కనిపిస్తుంది. రెండు భారీ రాతి శిలలు సూక్ష్మ పరిమాణంలో అనుసంధానమై ఉండడం ఇక్కడి విశిష్టత. ఇటువంటి అరుదైనది అమెరికాలోని రెయిన్ బో ఆర్చ్, ఆస్ట్రేలియా మినహా మరెక్కడా లేదని చెబుతారు. స్వామి వారు శిలా రూపంలోకి మారిపోవడానికి సంబంధించి కీలక సమాచారం ఇక్కడే సమాధి కాబడిందని చెబుతారు. 10 అడుగుల ఎత్తులో, 25 అడుగుల వెడల్పుతో ఉండే ఈ రాతి ఆర్చ్ దగ్గరకు ప్రైవేటు వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. నడచి వెళ్లాలనుకుంటే వరాహస్వామి ఆలయం నుంచి 20 నిమిషాలు పడుతుంది. చక్ర తీర్థం కూడా ఇక్కడే ఉంటుంది.


పాపవినాశనం🙏


️కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార ఇది. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే దీనికి పాపనాశనం తీర్థమనే పేరు స్థిరపడింది. భక్తుల నీటి అవసరాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యామ్ కూడా చూడవచ్చు. తొలుత పాపవినాశనం తీర్థ జలాలను స్వామి వారికే వినియోగించేవారు. ఆలయానికి దూరంగా ఉండడంతో ప్రస్తుతం ప్రత్యేక దినాల్లోనే ఈ జలాలను తీసుకెళుతున్నారు.


ఆకాశగంగ🙏


ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఇది ఉంది. ఇది కూడా సహజసిద్ధ తీర్థమే. ఈ తీర్థంతో శ్రీవెంకటేశ్వస్వామి వారికి నిత్య అభిషేకం నిర్వహిస్తుంటారు.


స్వామివారి పాదాలు🙏


తిరుమల బస్ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నారాయణగిరి పర్వత ప్రాంతంలో రాతి రూపంలో ఉన్న స్వామి వారి పాదాలను చూడవచ్చు. ఏడుకొండలపై మొదట స్వామి వారు అడుగు పెట్టింది ఇక్కడేనని, ఆ పాద ముద్రలే ఇవని చెబుతారు. ఈ పాదాల చుట్టూ గ్లాస్ బాక్స్ ను ఏర్పాటు చేసి భక్తులు తాకకుండా రక్షణ కల్పించారు. దీనికి సమీపంలోనే శిలా తోరణం కూడా ఉంటుంది. ప్రైవేటు ట్యాక్సీ లేదా షేర్ ట్యాక్సీలో ఇక్కడికి వెళ్లవచ్చు.


చక్రతీర్థం🙏


శిలాతోరణానికి సమీపంలోనే చక్రతీర్థం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవాలని భావిస్తారు. తనకో మంచి ప్రదేశం చూపాలని కోరడంతో వెంకటేశ్వరస్వామి తన సుదర్శన చక్రంతో రాతిని చీల్చి బ్రహ్మకు స్థానం చూపించారు. కొండపై నుంచి వచ్చిన నీటితో ఇక్కడ తీర్థం ఏర్పడింది. బ్రహ్మోత్సవ సమయంలో స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడకు కూడా తీసుకొస్తారు.


తుంబురు తీర్థం🙏


తిరుమల నుంచి 12 కిలోమీటర్లు, పాపవినాశనం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి సమయంలో ఈ తీర్థానికి వెళ్లే దారిని తెరుస్తారు. దట్టమైన అటవీ మార్గంలో మొత్తం ఐదు జలపాతాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. గంధర్వుడైన తుంబురుడు తన భార్యను శపించడంతో ఆమె కప్ప రూపంలో మారి తుంబుర తీర్థంలో ఉంటుంది. అగస్త్య ముని ఓరోజు ఇక్కడి తీర్థానికి రావడంతో ఆమె తన చరిత్ర గురించి చెప్పగా, అగస్త్యుడు అనుగ్రహం వల్ల ఆమె తిరిగి తన యథా రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పటి నుంచి ఇది తుంబుర తీర్థంగా వెలుగులోకి వచ్చింది. మరో కథనం ప్రకారం తుంబురు మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఈ తీర్థానికి తుంబుర తీర్థం పేరు స్థిరపడినట్టు చెబుతారు.


జాబాలి తీర్థం🙏


తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఈ తీర్థం ఉంది. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం చూడవచ్చు. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టు చెబుతారు. శ్రీరాముడు వనవాసంలో భాగంగా సీతమ్మవారు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లతో ఇక్కడ కొంత కాలం ఉన్నారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.


నాగ తీర్థం🙏


దేవాలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉంటుంది నాగతీర్థం. అలాగే, ఈ తీర్థానికి సమీపంలోనే బాలతీర్థం కూడా చూడవచ్చు. ఇక్కడ స్నానం చేస్తే బాలల్లా మారిపోతారని, అంటే అలాంటి శక్తిని సంతరించుకుంటారని చెబుతారు. ప్రస్తుతానికి ఈ తీర్థంలో జలం కనిపించడం లేదు. సృష్టికి విరుద్ధం కనుక జలం అంతరించిందని అంటారు.......


శేషతీర్థం🙏


సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు ఆదిశేషుడు (నాగేంద్రుడు) రూపంలో కొలువై ఉన్న తీర్థం ఇది. తిరుమల పాపవినాశనం డ్యామ్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో కొంతదూరం ప్రయాణించడం ద్వారా చేరుకోవచ్చు. ఈ తీర్థాన్ని చేరుకోవాలంటే నీటి ప్రవాహాలను దాటాల్సి ఉంటుంది. చివరిగా పది మీటర్ల వ్యాసార్థంతో కూడిన పెద్ద తీర్థం ఉంటుంది. ఈత బాగా వచ్చిన వారు ఇందులోకి దిగి కొంత మేర లోపలికి వెళ్లినట్టయితే అక్కడ ఆదిశేషుడి శిలారూపాన్ని దర్శించుకోవచ్చు.


ఈత రాని వారు గాలి నింపిన వాహనాల ట్యూబులు, తాడును రక్షణగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గైడ్ సహకారం తప్పనిసరి. ఎందుకంటే అటవీ ప్రాంతం... శేష తీర్థంలో పేరులో ఉన్నట్టుగానే నాగు పాములు ఈ తీర్థంలో, చుట్టు పక్కల సంచరిస్తుంటాయి. కనుక తెలియకుండా వెళ్లి అపాయాన్ని కొని తెచ్చుకోకుండా గైడ్ సాయం తీసుకుని వెళ్లడం మంచిది.


ఒకరోజు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలాన్ని తీసుకురావాలని గరుత్మంతుడ్ని పురమాయించారు. కానీ ఆయన ఎంత సేపు అయినా నీరు తేకపోవడంతో అప్పుడు స్వామివారు ఆదిశేషుడ్ని కోరతారు. దీంతో ఆదిశేషుడు జలాన్ని తన తోక ద్వారా రప్పించి స్వామి వారి దాహం తీర్చారని,కే ఇది శేష తీర్థం అయ్యిందని పురాణ చరిత్ర.


పాండవ తీర్థం🙏


వనవాస సమయంలో పాండవులు తిరుమలలో పర్యటిస్తూ ఈ తీర్థంలో స్నానం చేశారని చెబుతుంటారు. దీనికి గోగర్భ తీర్థం అని మరో పేరు కూడా కలదు. స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉంది. ఈ నీటిని ఒడిసి పట్టుకునేందుకు టీటీడీ 1963లో గోగర్భం డ్యామ్ నిర్మించింది. 


కుమారధార తీర్థం🙏

కుమారధార తీర్థానికి విశిష్ట చరిత్ర ఉంది. మాఘమాసంలో పౌర్ణమి రోజున సంతాన భాగ్యం లేని మహిళలు ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సంతాన భాగ్యం సిద్ధిస్తుందని చెబుతుంటారు.


*సేకరణ*

కామెంట్‌లు లేవు: