27, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆదిపర్వము -32

 


ఏకలవ్యుని వృత్తాంతం


ద్రోణుడి కీర్తిని విని హిరణ్యధన్వుడు అనే ఎరుకల రాజు కొడుకు ఏకలవ్యుడు, ద్రోణుడి వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కాని ద్రోణుడు హీనజాతి వాడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి అంగీకరించలేదు.

అప్పుడు ఏకలవ్యుడు అడవిలోకి వెళ్లి, మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేసాడు. దానిని భక్తితో పూజించాడు. ఆ విగ్రహం ఎదురుగా విలువిద్య సాధన చేసాడు.

ఒకరోజు పాండవులు, కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్ళారు. పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి మొరగసాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలను సంధించి, ఆ కుక్క నోటిలో కొట్టాడు. ఆ కుక్క వెనక్కు తిరిగి కురుకుమారుల దగ్గరకు వచ్చింది. దానిని చూసి కురుకుమారులు ఆశ్చర్యపోయారు. ఆ బాణాలు ఎవరు వేసారా అని వెదుకుతూ వెళ్ళారు. వారికి జింక చర్మాన్ని కట్టుకున్న ఏకలవ్యుడు కనిపించాడు.

వారు అతనిని చూసి “నీవు ఎవరు. విలువిద్యలో నీకు గురువు ఎవరు?” అని అడిగారు. దానికి ఏకలవ్యుడు “నా పేరు ఏకలవ్యుడు. ఎరుకలరాజు కొడుకును. నాగురువు ఇదిగో ఈయన ద్రోణాచార్యులు” అని విగ్రహం చూపించాడు. కురుకుమారులు తిరిగి వచ్చి ద్రోణుడికి విషయం అంతా చెప్పారు.

కాని అర్జునుడు భ్రించాలేకపోయాడు. ద్రోనుడిని ఒంటరిగా కలుసుకొని “గురువు గారు, నేనే తమ ప్రియ శిష్యుడు అనారు. అన్ని విద్యలు నేర్పించాను అన్నారు. కాని ఆ ఎరుకల వాడు తమకు ప్రియ శిష్యుడట కదా. అతనికి నాకన్నా విలువిద్యలో నైపుణ్యం ఎక్కువట కదా?” అని అడిగాడు.

ద్రోణుడికి ఇదేమి అర్థం కాలేదు. అర్జునుడి వెంట ఏకలవ్యుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ద్రోణుడికి ఎదురు వచ్చి నమస్కరించి “అయ్యా, నేను తమరి శిష్యుడిని, విలువిద్య నేర్చుకున్నాను” అని చెప్పాడు.

వెంటనే ద్రోణుడు “మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా” అని అడిగాడు.

“గురువుగారు, ఇది నా దేహం, ఇది నా ధనం, వీరు నా సేవకులు. మీకు ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను” అని అన్నాడు.

“నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు ఇవ్వు. అదే నా గురుదక్షిణ” అని అడిగాడు.

ఏకలవ్యుడు అలోచిచకుండా కత్తి తీసుకొని తన కుడి చేతి బొటన వేలు కోసి ఇచ్చాడు. ఇంక ఏకలవ్యుడు విల్లు పట్టా లేడు, బాణం సంధించలేడు. తను నేర్చుకున్న విలువిద్యనంతా కోల్పోయాడు. అర్జునుడి మనసుకు శాంతి లభించింది. భీముని బలాన్ని,అర్జునిడి విలువిద్యను చూసి దుర్యోధనాదులు సహించలేకపోయారు.

కామెంట్‌లు లేవు: