27, సెప్టెంబర్ 2020, ఆదివారం

పురుషోత్తమప్రాప్తియోగము

 15-07-గీతా మకరందము

         

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జీవుడు వాస్తవముగ తనయొక్క అంశమేయని భగవానుడు తెలుపుచున్నారు- 


మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః | 

మనుష్షష్ఠానీన్ద్రియాణి 

ప్రకృతిస్థాని కర్షతి || 


తాత్పర్యము:- నాయొక్కయే అనాదియగు (నిత్యమగు) అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్ చక్షు శ్శ్రోత్ర జిహ్వా ఘ్రాణ మనంబులను ఆఱు ఇంద్రియములను ఆకర్షించుచున్నది.


వ్యాఖ్య:- ‘మమైవాంశః’ - జీవుడు (జీవాత్మ), దేవుడు వాస్తవముగ వేఱువేఱు కారు. దేవుని యంశయే జీవుడు. జీవుడు సాక్షాత్ దేవుడే. ఇరువురును సనాతన స్వరూపులే. నిత్యులే. కాని అజ్ఞానవశమున, ఉపాధిసంబంధమువలన జీవుడు ఆ ఉపాధిని, ఉపాధిగుణములను తనయం దారోపించుకొని, ఆ ఉపాధికిజెందిన ఇంద్రియాదులతో గూడినవానిగ తనను భావించుకొనుచున్నాడు. ఘటాకాశము విశాలాకాశము యొక్క అంశమాత్రమే యగును. విశాలాకాశముయొక్క లక్షణములన్నియు ఘటాకాశమునందు ఉండియేయున్నవి. అట్లే పరమాత్మయొక్క సనాతనత్వము జీవునియందు (జీవాత్మయందు) కలిగియేయున్నది. ఎపుడు జీవుడు తన ఉపాధిభావమునువీడి నిజరూపమును స్మరించునో అపు డాతడు సాక్షాత్ పరమాత్మయే యగుచున్నాడు.


'మమైవాంశః’ అని జీవునిగూర్చి చెప్పుటవలన భగవంతునియొక్క అంశమే జీవుడని తేలుటచే, ఇక నట్టి భగవదంశములలో తక్కువయేమి? ఎక్కువయేమి? కావున సర్వజీవులును సమానులే. సర్వులు భగవదంశస్వరూపులేయని విజ్ఞుడు తలంచి సర్వులయెడల ప్రేమ, దయ, సమబుద్ధిగలిగి యుండవలెను. భగవానుని ఈవాక్యముచే జీవులకు పరమధైర్యము లభించుచున్నది. ఏలయనగా, ఇంతవఱకు అజ్ఞానముచే తాను బద్ధుడననియు, అల్పుడననియు, దుఃఖిననియు తలంచియున్నవాడు ఈ వాక్యములచే గొప్ప ఆశ్వాసమును బడయుచున్నాడు. తాను వాస్తవముగ అల్పుడు కాదు, జీవుడుకాదు, నశ్వరుడుకాదు, తాను సనాతనుడు. సాక్షాత్ పరమాత్మయే తాను. మాయావశముచే ప్రకృతికి లోబడి, భగవంతుని మఱచి, ప్రకృతిస్థములగు ఇంద్రియాదులతో గూడి కాలక్షేపము చేయుచున్నాడు. వానిని ఆకర్షించుచున్నాడు. (కర్షతి). ఆహా! ఇదివఱలో (అజ్ఞానకాలమున) ఎంత గొప్ప తప్పిద మాచరించుచునుండెను. ఇప్పుడీ భగవద్వాక్యస్మరణముచే జ్ఞానముకలుగ, అట్టి పొరపాటున కాస్కారములేదు. తిరిగి తన అమర, ఆనంద, ఆత్మరూపమునుగూర్చి చింతించి జీవుడు దానితో నైక్యమొందవలెను, అదియే మోక్షము.

జీవుడు తన స్వస్థానము ఈ జీవలోకముకాదనియు ఆత్మలోకమేయనియు భావింపవలెను. ఇది తన స్వస్థలముకాదనియు పరస్థలమనియు చింతింపవలెను. దీనినే ఆశ్రయించుకొనినచో, ఈ ఇంద్రియములనే, ఈ ప్రకృతినే నమ్ముకొనినచో జన్మపరంపర తప్పదు, సంసారబాధలు తప్పవు - అని నిశ్చయించుకొని జీవుడు తన నిజరూపమును నిజస్థానమును అగు పరమాత్మను సంస్మరించి తద్రూపుడుగనే శేషించి ధన్యుడు కావలయునని ఈశ్లోకముయొక్క తాత్పర్యమై యున్నది. 


ప్రశ్న:- జీవుడు వాస్తవముగ నెట్టివాడు?

ఉత్తరము:- భగవదంశస్వరూపుడు, సనాతనుడు (నిత్యుడు). 

ప్రశ్న:- కాని అజ్ఞానవశమున నేమియొనర్చుచున్నాడు?

ఉత్తరము:- తాను ఉపాధినని తలంచి, ఇంద్రియాదులతోను, మనస్సుతోనుగూడి కాలక్షేపము చేయుచున్నాడు.

ప్రశ్న:- కాబట్టి జీవు డేమిచేయవలెను?

ఉత్తరము: - (దృశ్యవస్తువులయెడల విరక్తిగలిగి) తన నిజరూపమగు పరమాత్మను సంస్మరించి తద్రూపుడుగనే శేషించవలెను. అదియే మోక్షము.

కామెంట్‌లు లేవు: