**
*ప్రజాశక్తి దిన పత్రిక సంపాదకీయం*
'కూతురుండు ఇల్లంటే మమతలను పెంచేటి కోవెల/ కూతురుతో ప్రవహించును సంతోషాలు గలగల' అంటాడొక కవి. పగలంతా నట్టింట సందడి చేసే చిట్టితల్లి... రాత్రయ్యే సరికి చీకటిలో కూరుకుపోకుండా, చంద్రుణ్ణి వెలిగించి.. లోనున్న నక్షత్రాల్ని బయటకు లాగి కనుమరుగవుతున్న సూర్యుడిలా అగుపిస్తుంది. కూతురు జీవితంపై అత్యంత ప్రభావం చూపేవారిలో మొట్టమొదటి వ్యక్తి తండ్రే. సాధారణంగా ఎక్కువ శాతం తండ్రులు తమ కూతుళ్ళను మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం నిండిన రేపటి మహిళగా చూడాలని తపన పడతారు. అందుకు తగిన ప్రోత్సాహాన్నీ అందిస్తున్నారు. అదే సందర్భంలో పురుషాధిక్యత, మనువాద భావజాలం ఆడపిల్లల జీవితాలపై అనేక కట్టుబాట్లను లిఖిస్తోంది. 'పరువు' కోసమంటూ, గోరుముద్దలు తినిపించి ముద్దు చేసిన చేతులే పాషాణ హదయులై కన్నపేగును తెంపుకుంటున్నాయి. కొడుకులకు లేని ఆంక్షలు, కట్టుబాట్లు... కూతుళ్లకు లక్ష్మణరేఖలుగా మారుతున్నాయి. ఆధిపత్యం, అసమానత, చిన్నచూపు, వేధింపులు, హింస.. ఇందులో ఏదో ఒకదానిని అన్ని దశలలోనూ ఆడపిల్ల ఎదుర్కొంటోన్న మాట నగ్న సత్యం.
మన దేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 27వ తేదీని 'కూతుళ్ల దినోత్సవం'గా జరుపుతున్నారు. ఆడ పిల్లలపై వివక్ష తొలగాలనే ప్రధాన ధ్యేయంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆడ, మగ అనే బేధం లేదని, ఇద్దరూ సమానమేనని చాటి చెప్పడం దీని లక్ష్యం. కానీ, నయా ఉదారవాద విధానాలు ఆడపిల్లను అంగడి వస్తువుగా మార్చుతున్నాయి. మనువాదం తన కట్టుబాట్లతో వ్యక్తిత్వంలేని మనిషిగా మార్చుతోంది. భూస్వామ్య విధానం పురుషాధిక్యతను ప్రదర్శిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో పురుషాధిక్య భావజాలం, భూస్వామ్య విధానం, మనువాదం ఇంకా రాజ్యమేలుతూనే వుంది. ఉత్తరప్రదేశ్, హర్యానాల్లోని కొన్నిచోట్ల భ్రూణ హత్యల నుండి కాప్ పంచాయతీలు కొనసాగుతునే వున్నాయి. తండ్రుల కర్కశత్వానికి, లైంగిక దాడులకు బలౌతున్న ఘటనలు ఒకవైపు, కుల దురహంకార హత్యలు ఇంకోవైపు జరుగుతూనే వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మనువాద భావజాలం, కుల దురహంకార హత్యలు నిత్యకత్యంగా మారాయి. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచామని చెబుతూనే, వేరే కులం వాడ్ని ప్రేమించినా, పెళ్లాడినా ప్రాణాలు తీసేస్తున్నారు. కూతుళ్లను ఎంత గారాబంగా పెంచినా... కుల దురహంకారం, మనువాద భావజాలం ముందు అదంతా దిగదుడుపే అవుతోంది. ఇక కార్పొరేట్ల ప్రోద్భలంతో బలవంతంగా అమలులోకి తెస్తున్న ఆన్‌లైన్ విద్య కూడా ఆడపిల్లలకు అశనిపాతమే. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఆన్‌లైన్ చదువులకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్‌లు, లాప్‌టాప్ లు వీరికి అందుబాటులో వుండవు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఎక్కడన్నా కొద్దిమందికి ఇంటర్నెట్ వున్నా... సిగల్ సమస్యలతో సతమతమౌతుంటారు. సిగల్ వచ్చే చోటకు వెళ్లాలంటే ఆడపిల్లలకు ఎన్నో సమస్యలు. ఒక్కరినే వెళ్లనీయక పోవడం, బయటకు వెళితే రక్షణ లేకపోవడం వంటి అనేక సమస్యలున్నాయి. కూతురుగా ఇంట్లో ఎంత గారాబం చేసినా, గడప దాటితే అనేక ఆంక్షలు, కట్టుబాట్లను ఎదుర్కోవాల్సి వుంది. ఇన్ని కట్టుబాట్ల నడుమ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆన్‌లైన్ విద్య సాధ్యమా? ఇక్కడా ఆడపిల్ల వివక్షను ఎదుర్కోక తప్పడంలేదు.
'ఆడపిల్ల అంటే ఆటబమ్మ కాదు.. ఒక అద్వితీయ శక్తి' అన్నాడో రచయిత. 'కొడుకు ఒక్కడుంటే చాలు' అనుకొనే రోజుల నుంచి 'కొడుకైనా, కూతురైనా ఒక్కటే'నని భావన బలోపేతమవుతోంది. ఎంతోమంది అన్ని భావజాలాలను ఎదిరించి, నిలదొక్కుకుంటున్నారు. విజయబావుటాలు ఎగరేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాన్ని సైతం నడిపే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూతురంటే అమ్మకు స్నేహితురాలు, నాన్నకు రాజకుమారి. ప్రతి ఆడపిల్లా ఈ దేశానికి ఎవరెస్టు శిఖరం కావాలి. ఒక శక్తి స్వరూపిణి కావాలి. తల్లిదండ్రులు ఆ శక్తికి బాసటగా నిలవాలి. కుల దురహంకారం, మనువాద భావజాలం నుండి బిడ్డలను రక్షించుకోవాలి. ఉన్నత ఆశయాలవైపు నడిపించాలి. ఆడపిల్లలపై వివక్ష తొలగాలనే ఉద్దేశంతో ఏర్పాటైన కూతుళ్ల దినోత్సవానికి అప్పుడే సార్థకత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి