( మంజరీ ద్విపద )
రచన ..
గోపాలుని మధుసూదన రావు
ఒకటవ అధ్యాయము
శ్రీకరుండైనట్టి శ్రీమహావిష్ణు
త్రైలోక్యనాథుడై తరియింప జేయ :
నట్టి లోకేశుని నతిభక్తి తోడ
తలవంచి ప్రణమిల్లి తశ్శక్తి తోడ
బహుశాస్త్ర ధృతమై భాసిల్లు నట్టి
రమణీయ మైనట్టి రాజనీతులను
విబుధుల కొఱకునై వివరించ నుంటి
మూర్ఖశిష్యులకును ముదముజెప్పుటయు
నశ్లీలవనితను నాదరించుటయు
నదృష్టలేమిచే నలమటించేటి
మనుజులచెంతను మసలుటయున్ను
పండితు , బాధలో పడవేయు నెపుడు.
దుష్ట తత్వంబుతో దూషించు భార్య
కుట్ర తత్వంబుతో కూడు మిత్రుండు
అవిధేయ తత్వంబు నలరు భృత్యుండు
కన్నుల ముందుగా కదలు సర్పంబు ,
నుండెడి గృహములో నుండిన యెడల
మరణమే శరణంబు మనిషికి యెపుడు
ఆపదార్ధంబునై యర్ధార్జనంబు
నిరతంబు మనుజుండు నెఱపంగ వలయు.
అర్థంబు యున్ననూ నసలు లేకున్న
నతివను రక్షించ నావశ్య మగును.
ఆత్మరక్షణముకు యర్థ మంగనల
త్యాగంబు సేయుటే తగిన మార్గంబు
వర్జించ వలయును వరుసగా రెండు.
బ్రతుకంగవృత్తియు , బంధువర్గంబు ,
నాగమవిద్యయు , నాత్మగౌరవము ,
అభివృద్ధి కొఱకునై నవకాశములును ,
మేల్గోరు వారలు , మిత్రవర్గంబు ,
లే దేశమందున యెన్నంగ లేరొ
యా దేశమందున నావాస ముంట
నరయ చింతించంగ నవివేకమగును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి