ఖాండవప్రస్థం-ధర్మరాజు పట్టాభిషేకం
స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టినది అర్జునుడని, వారు పాండవులని, దుర్యొధనుడు వేగుల వలన తెలుసుకున్నాడు. పాండవులు లక్క ఇంటిలో తగబడకుండా బతికి బయతపడ్డందుకు దుర్యోధనుడు ఎంతో చింతించాడు.
విదురుడికి పాండవుల విషయం తెలిసి ఎంతో ఆనందించాడు.
ధృతరాష్ట్రుడికి ఈ విష్యం చెప్పాడు. ద్రుపదుని కుమార్తె అయిన ద్రౌపదిని వివాహం చేసుకోవడం వల్ల పాండవులు ఎంతో మిత్రలాభం పొందారు అని అనుకున్నాడు ధృతరాష్టుడు.
ఒకరోజు కర్ణ దుర్యోధనులు, విదురుడు దగ్గరలేని సమయంలో, ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు.
“తంద్రీ! పాండవులు బతికే ఉన్నారు. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల మేలు కోరేవాడు అని తెలిసి కూడా మీరు అతని మాటకు విలువ ఇస్తున్నారు. అది మా దురదృష్టము” అని నిర్వేదంగా అన్నాడు దుర్యోధనుడు.
“నాయనా దుర్యోధనా! నేను పైకి పాండవులు అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు ఉంటాను కాని ఆ విషయం విదురునికి తెలియనీయను. ఒక విషయం మాత్రం మీరు మరువద్దు. పాండవులకు దైవబలం ఉన్నది. వారిని మనం ఏమి చెయ్యలేము” అని అన్నాడు ధృతరాష్ట్రుడు.
“తండ్రీ! పాండవులు ఇప్పుడు ద్రుపద రాజపూరంలో ఉన్నారు. వారికి పాంచాల రాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవ రాజులు, వృష్ణి, భోజ, అంధక రాజులు తోడుగా ఉన్నారు. అప్పుడు వారిని ఎవ్వరూ జయించలేరు. కాబట్టి వాఇని పాంచాల రాజు నుండి వేరు చెయ్యాలి. ఇది ఒక మార్గము.
ఇంక రెండవది. కుంతీ పుత్రులకు, మాద్రీ పుత్రులకు మధ్య విభేధాలు పుట్టించి వారిని వేరు చెయ్యాలి. మూడవది, అత్యంత అందగత్తెలైన స్త్రీలను పాండవుల మీద ప్రయోగించి, వారికి, ద్రౌపదికి మధ్య విభేధం కైగించాలి. ఇంక నాలుగవది, మరల మంత్ర తంత్రములతో కుటిలోపాయములతో భీముని చంపి పాండవులను నిర్వీర్యులను చెయ్యడం. వీటిలో ఏది ఉత్తమ మార్గం ఆలోచించండి” అని తన మనసులో విషయం బయటపెట్టాడు దుర్యోధనుడు.
కర్ణుడు దీనికి ఒప్పుకోలేదు. “సుయొధనా! అసలు, ద్రుపదుడు సజ్జనులు అయిన సత్ప్రవర్తనులు అయిన పాండవులను ఎందుకు వదలివేస్తాడు. అది అసంభవము. పాండవులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వారిలో విభేధాలు ఎందుకు వస్తాయి. పైగా, ద్రౌపది వారిని కోరి వివాహం చేసుకుంది. కాబట్టి ఆమెకు వారిమీద ఎందుకు ద్వేషం పుడుతుంది. కాబట్టి ఇవన్ని ఏవి పని చెయ్యవు.
పైగా ఇప్పటిదాకా మీరు భీముని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఏముంది? భీముని ఏమీ చెయ్యలేకపోయారు. కాబట్టి అదికూడా ప్రయోజనం లేదు. ఇంక ఒక్కటే మార్గము. దండోపాయము. మనము మన సేనలతో ద్రుపద మహారాజు మీదికి యుధ్ధానికి వెళ్లి, ద్రుపదుని ఓడించి, పాండవులను తీసుకొని వద్దాము” అని అన్నాడు.
ఇది అంతా విని, ధృతరాష్ట్రుడు “పెద్దలతో ఆలొచించి రేపు నిర్ణయం తీసుకుందాము” అని అన్నాడు.
మరునాడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారిని సమావేశపరిచి, విషయం అంతా వివరించాడు. అప్పుడు, కురు వృద్దుడు భీష్ముడు, దుర్యోధనుని చూసి ఇలా అన్నాడు.
“సుయోధనా! నాకు మీ మీద కాని, పాండవుల మీద కాని భేధభావము లేదు. అందరూ నాకు సమానమే. కాని, పాండవులతో యుధ్ధం చెయ్యడానికి నేను అంగీకరించను. మీవలెనే, పాండురాజు కుమారులు కూడా ఈ రాజ్యానికి వారసులు. అందుచేత, పాండవులకు చెందవలసిన అర్థ రాజ్యాన్ని వారికి పంచి ఇవ్వు. అది ధర్మము. ధర్మాన్ని ఆచరించి కీర్తిమంతుడవు గా!” అని అన్నాడు భీష్ముడు.
ద్రోణుడు కూడా “నాయనా సుయోధనా! తాతగారి మాట పాటించుము. నీవు ఈ కర్ణుని మాటలు విని, యుధ్ధము మాట తలపవద్దు. ద్రుపదునికి తగిన కానుకలు ఇచ్చి, పాండవులను ఇక్కడకు తీసుకొని రావడానికి నీ తమ్ములను పంపు” అని హితభోధ చేసాడు.
ఈ మాటలకు కర్ణునికి కోపం వచ్చింది. “సుయోధనా! వీరంతా నీకు కీడు చెయ్యడానికి తలపెడుతున్నారు. నీ సంపదను అపహరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి మాట నమ్మకు” అని అన్నాడు.
ఏమి మేము కీడు తలపెట్టు వారమా! నీవేనా హితము చెప్పువాడివి. నీవలననే కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది” అని అన్నాడు.
వారిద్దరిని వారించి ధృతరాష్టునితో విదురుడు ఇలా అన్నాడు.
“మహారాజా! భీష్మ, ద్రోణులు వయసులు పెద్దవారు. వారు చెప్పినది చెయ్యడం ధర్మం. అదీ కాక, పాండవులు స్వతహాగా అజేయులు. ఇప్పుడు, వారికి మహా బలవంతుడైన ద్రుపద మహారాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వారికి మిత్రులు. కాబట్టి వారిని జయించడం సులభం కాదు.లక్క ఇంటిలో వారిని తగలపెట్టినా వారు బతికారు. పురోచనుని వలన కలిగిన అపకీర్తి పోగొట్టుకో. వెంటనే వారిని పిలిపించి అర్థ రాజ్యం ఇమ్ము. అది అందరికీ శ్రేయస్కరము” అని అన్నాడు విదురుడు.
చేసేది లేక ధృతరాష్ట్రుడు దానికి అంగీకరించాడు. పాండవులను తీసుకురావడానికి విదురుని ద్రుపదపురానికి పంపాడు. అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల వద్ద ఉన్నాడు. విదురుడు ద్రుపద మహారాజుకు తగిన కానుకలు సమర్పించాడు. ద్రుపదుని ఎదుట, శ్రీకృష్ణుని ఎదుట పాండవులతో ఇలా అన్నాడు.
“ద్రుపద మహారాజా! మా పాండవులకు మీతో బంధుత్వము కలిసినందుకు భీష్మునికి, ద్రోణునికి, కృపాచార్యునికి నాకూ చాలా ఆనందంగానున్నది. కుంతీదేవి, పాండవులు తమ వద్దలేనందుకు ధృతరాష్ట్రుడు మిక్కిలి చింతించుచున్నాడు. పాండవులను, తమ కొడలు సౌభాగ్యవతి ద్రౌపదిని చూడవలేనని ఎంతో ఆతురతతో ఉన్నారు. నీవు అనుమతిస్తే పాండవులు హస్తినకు రాగలరు. అందువలన మీరు పాండవులను పంపమని కోరుతున్నాను” అని అన్నాడు విదురుడు.
“మహాశయా! ధృతరాష్ట్రుడు పంపగా వచ్చావు నీవు. భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు, పాండవుల శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుతుంటారు. మీరు ఏమి చేసినా అది పాండవులకు క్షేమకరం అవుతుంది” అని అన్నాడు ద్రుపదుడు.
“విదురుడు ఎల్లప్పుడూ పాండవుల క్షేమం కోరుతుంటాడు. మనం అతిగా ఆలొచించవద్దు. పాండవులు కోరుకున్నది సిధ్ధిస్తుంది” అని అన్నాడు శ్రీకృష్ణుడు.
అందరు చెప్పినది శ్రధ్ధగా విన్న ధర్మరాజు చేతులు జోడించి “భీష్ముడు, ద్రోణుదు, విదురుడు మాకు పెద్దలు. మా క్షేమం కోరుతుంటాఉ. శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి, వారి మాట నాకు శిరోధార్యము” అని అన్నాడు.
ద్రుపదుని అనుమతితో తల్లి కుంతీ, భార్య ద్రౌపది, తమ్ములతో సహా హస్తినాపురం పోవడానికి నిశ్చయించుకున్నాడు. విదురుడు, పాండవులను, ద్రౌపదిని, కుంతిని తన వెంట తీసుకొని వస్తున్నాడు. శ్రీకృష్ణుడు, ధృష్ట్ద్యుమ్నుడు, అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వికర్ణుడు, చితసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవులకు ఎదురుపోయి వారికి స్వాగతం పలికారు.
పాండవులని చూసి హస్తినాపుర ప్రజలు “ఈ పాండవులకు దైవబలం, మానవ బలం ఎక్కూవగానున్నది. అందువలననే, అన్ని ఆపదలు తొలగిపోయాయి. ఇంక ధర్మరాజు హస్తినాపురంలో ఉండి మనలను పరిపాలించుగాక” అని అనుకున్నారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, దృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా అయిదు సంవత్సరాలు గడిచాయి.
ఒక రోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోదనాదులు సమావేశమై ఉండగా శ్రీకృష్ణుని సమక్షంలో దృతరాష్ట్రుడు పాండవులతో ” ధర్మరాజా పెద్దల ఎదుట శ్రీ కృష్ణుని సాక్షిగా మీకు అర్ధ రాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకిస్తున్నాను స్వీకరించండి. ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్ని పాలించుకోండి ” అని చెప్పి ధర్మరాజుని అర్ధ రాజ్యాభిషిక్తుని చేసాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించారు. పాండవులు తల్లిని, భార్యని, తమ్ములను తీసుకుని ఖాండవప్రస్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిపించి పాండవులకు రాజధాని నిర్మించి ఇవ్వమని చెప్పాడు. ఇంద్రుడు దేవశిల్పి విష్వకర్మ సహాయంతో విలాస వంతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. పాండవులు శ్రీకృష్ణుడు, వ్యాసుని అనుమతితో నగర ప్రవేశం చేసారు. ధర్మరాజు పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి