11, అక్టోబర్ 2020, ఆదివారం

( మంజరీ ద్విపద

 శ్రీమన్నారాయణ అథర్వ శీర్షము -- 1

         )


✍️ గోపాలుని మధుసూదన రావు 


పరమ పురుషు డైన పద్మనాభుండు 

తా ననేకము కాగ తలచియు మదిలొ

చేసెను జగమందు సృష్టి నెల్లెడల 

పరమాత్మ హరి దివ్య భావంబు నుండి 

పంచ ప్రాణంబులు ప్రభవించె దొల్లి

పంచ భూతంబులు ప్రభవించె పిదప

అంబర వాయువు లగ్నినీరములు 

అన్నిటిన్ భరియించు యవనియు గూడ 

ప్రభవించె నప్పుడా పరమాత్మ నుండి 

నారాయణుని నుండి నలువ జనించె

నారాయణుని నుండి నటరాజు బుట్టె 

నారాయణుని నుండి నాకేంద్రు డొచ్చె

ప్రజలు ప్రజాపతి ప్రముఖసంయములు 

యాదిత్య వసు రుద్రులఖిల ఛందంబు

నారాయణుని నుండి నఱయ వర్తిల్లె

నారాయణుని నుండి యఖిల జగంబు 

ప్రభవించి వర్తిల్లి భాసించు నెపుడు 

ఈ రీతి " ఋగ్వేద " మింపుగా జెప్పు 


అఱయ నిత్యుండొక్క నారాయణుండె

నలుమోము బ్రహ్మయూ నారాయణుండె

నాగభూషణుడును నారాయణుండె

నాకాధిపతి కూడ నారాయణుండె

పంచ భూతంబులు వాసుదేవుండె 

కాలంబు దిశలును నారాయణుండె

అఱయంగ నుప దిశల్ నారాయణుండె

ఊర్ధ్వ మథోభాగ మునికియు నతడె

యంతర్భహిరముల నాతడై యుండె

సర్వంబు యాతడే సంస్థితంబయ్యె 

నిర్వికల్పుడతడు నిష్కల్మషుండు

అఱయ నిరంజను డయియుండె నతడు 

శుద్ధుండు దేవుండు శోభితుం డతడు

అన్యులు లేరిక నాతండు దప్ప

ఒక్కడే దేవుండు నొరులింక లేరు 

నారాయణు డొకడె యన్యంబు లేరు 

నారాయణుని యిట్లు యఱసిన వాడు 

శ్రీ విష్ణు నీరీతి చింతించు వాడు 

విష్ణురూపుండౌను విధికృతంబుగను 

చివరకు నాతడే శ్రీవిష్ణు వగును 

ఇట్లు  " యజుర్వేద " మింపుగా జెప్పె

కామెంట్‌లు లేవు: