11, అక్టోబర్ 2020, ఆదివారం

-గీతా మకరందము

 15-20-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అధ్యాయముయొక్క ఫలశ్రుతిని జెప్పుచున్నారు -


ఇతి గుహ్యతమం శాస్త్రం

ఇదముక్తం మయాఽనఘ

ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్

కృతకృత్యశ్చ భారత || 


తాత్పర్యము:- పాపరహితుడవగు ఓ అర్జునా! ఈ ప్రకారముగ అతిరహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పితిని. దీనిని చక్కగా తెలిసికొనినవాడు జ్ఞానవంతుడును, కృతకృత్యుడును కాగలడు.


వ్యాఖ్య:- ఇంతదనుక చెప్పబడిన ఈ గీతాశాస్త్రమునంతను చక్కగా తెలిసికొనిన వారికి కలుగు ఫలితమును ఇచట వచించుచున్నారు. తానుగావించిన ఈ బోధయంతయు అతిరహస్యమైనదని ("గుహ్యతమమ్”) మొట్టమొదట భగవానుడు పలికెను. కనుకనే " గుహ్యమ్" అనిగాని, 'గుహ్యతరమ్’ అనిగాని చెప్పక "గుహ్యతమమ్" - అని "తమ” ప్రత్యయపదమును ప్రయోగించి బోధయొక్క అతి గోప్యత్వమును, పరమరహస్యత్వమును వెల్లడించిరి. సామాన్యముగ అతిరహస్యమైన విషయమును మహనీయులు అందఱికిని జెప్పరు. యోగ్యతగలిగినవానికే, ‘అధికారి’కే చెప్పుదురు. "మఱి అర్జునుడు అట్టి యోగ్యతను బడసెనా? అతనికి చిత్తశుద్ధికలదా" అని జనులు ప్రశ్నించుదురేమో యని తలంచికాబోలు భగవానుడు వెనువెంటనేే ‘అనఘ' (పాపరహితుడా) అని అర్జునుని సంబోధించి ఆ సంశయమును తీర్చివైచిరి. అర్జునుడు పాపరహితుడు, నిర్మలచిత్తుడు, ఆధ్యాత్మికవిజ్ఞానశ్రవణమునకు, గ్రహణమునకు అధికారి , అర్హుడు. అర్జునునివలెనే ఎవరైనను సరియే తమచిత్తమందలి దోషములను, పాపములను కడిగివైచికొనినచో వారికి సర్వేశ్వరుడు ఏ మహనీయుడగు గురువుద్వారానో, లేక ఏదియో యొక నిమిత్తముచేతనో బ్రహ్మతత్త్వము నుపదేశింపజేయును. లేక స్వయముగనే అట్టి ఆధ్యాత్మికజ్ఞానగ్రహణానుకూలమగు ధీశక్తిని వారికి కలుగజేయును (దదామి బుద్ధియోగం తమ్).

భగవదుక్తమగు ఈ బోధ నెఱుగుటవలన కలుగు ఫలితమేమి? దాని నెఱుగుట వలన మనుజుడు (1) జ్ఞానవంతుడు (స్వస్వరూపానుభవము కలవాడు) (2) కృతకృత్యుడు కాగలడు. ఇట్టి బోధ తెలిసికొనుటవలన మనుజుడు భగవంతునిపై అనన్యభక్తిగలవాడై తద్ద్వారా బుద్ధియోగమును అనగా జ్ఞానానుభవమును (స్వస్వరూపానుభవమును) బడయగల్గును. దానిచే నతడు కృతకృత్యుడు కాగలడు. అట్టి కృతకృత్యత్వముచే కృతార్థుడున్ను తప్పక కాగలడు. ప్రపంచములో ఏ యితరకార్యముచే గూడ మనుజుడు కృతకృత్యుడు కాజాలడు. ఒక్క బ్రహ్మవిద్యచేతనే, అధ్యాత్మజ్ఞానముచేతనే అతడు కృతకృత్యుడు కాగలడు - అని భగవాను డిచట “ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్కృతకృత్యశ్చ” - అను వాక్యముద్వారా స్పష్టముగ చెప్పివైచిరి. కావున ధన్యులు, కృతకృత్యులు కాదలంచినవారు, జన్మసార్థకత నొందదలంచినవారు భగవానుని ఈ వాక్యముపై విశ్వాసముంచి గీతయందు తెలుపబడిన పరమార్థరహస్యములనెల్ల చక్కగ నభ్యసింపవలయును. అట్లు కృతకృత్యులు కాకుండ మరణించినచో గొప్ప ప్రమాదము గలదు. జన్మపరంపర వారిని విడనాడదు. దుఃఖజాలము వెన్నంటుచునే యుండును.


ప్రశ్న:- భగవానుడు బోధించిన ఈ అధ్యాత్మశాస్త్ర మెట్టిది? 

ఉత్తరము:- అతిరహస్యమైనది (గుహ్యతమమ్). 

ప్రశ్న:- దానిని అర్జునునికే ఏల బోధించెను? 

ఉత్తరము:- అతడు పాపరహితుడు (అనఘుడు) గనుక. 

ప్రశ్న:- ఈ బోధ నెఱుగుటవలన కలుగు ఫలితమేమి?

ఉత్తరము:- దాని నెఱుగుటవలన మనుజుడు (1) జ్ఞానవంతుడు (2) కృతకృత్యుడు కాగలడు.

ప్రశ్న:- కావున జ్ఞానవంతుడగుటకు, కృతకృత్యత్వమును బడయుటకు ఉపాయ మేమియని తేలుచున్నది?

ఉత్తరము:- భగవానుడు బోధించిన ఈ పరమార్థరహస్యములను చక్కగ ఆచరించుటయే అందులకు ఉపాయము.


ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే పురుషోత్తమప్రాప్తియోగోనామ 

పంచదశోఽధ్యాయః


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు పురుషోత్తమప్రాప్తియోగమను 

పదునైదవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

కామెంట్‌లు లేవు: