🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 46*
*****
*శ్లో:-ఋణానుబంధ రూపేణ ౹*
*పశు పత్ని సుతాలయా: ౹*
*ఋణ క్షయే క్షయం యాంతి౹*
*తత్ర కా పరిదేవనా ?*
*****
*భా:- మానవ జీవితం ఒక నీటి బుడగ వంటిదని, క్షణభంగురమని అందరికి తెలిసిన నగ్న సత్యమే. సాటి మనిషి మరణానికి మౌనంగా సానుభూతి ప్రకటిస్తాడు. రేపు తన గతి ఇంతే గదా! అని మనసును సమాధానపరచుకోలేడు. తాను, నిత్యమని, శాశ్వతమని భావిస్తాడు. అదే మాయ. ఈ జనన మరణాలకు మధ్య జీవనకాలంలో మనకు ఏ నాటి ఋణమో, దాన్ని తీర్చుకొనేందుకు మన ఇంటికి పశువులు, పక్షులు పెంపకానికి వచ్చి, కాలం తీరగానే కనుమరుగవుతాయి. భార్యాబిడ్డలు కూడా అప్పు తీరగానే నిష్క్రమిస్తారు. మనం కట్టుకున్న, కొన్న గృహాలు బాకీ తీరగానే పరహస్తగతంగా గానీ , శిథిలమై గాని, రూపాంతరం చెంది గాని కనుచూపుకు దూరమౌతాయి. ఈ విధంగా పశు, పత్ని, సుత, ఆలయములు మన వెంట ఉంటూ, మోహంతో మనల్ని మురిపించి, మరిపిస్తూ, కాలం తీరగానే ఋణవిముక్తమై క్షీణించి పోతాయి. ఇదంతా అక్షరసత్యమని తెలిసినా మానవుడు వాని వియోగంలో తీవ్రమైన వేదనతో, నిర్వేదంతో తపించిపోతున్నాడు.ఇలా వచ్చి అలా వెళ్ళేవాటి కోసం ఇంతటి ఆవేదన, విలాపము, పరితాపము కొరగానివి అనేదే తత్త్వబోధ, హితబోధ, ఆత్మబోధగా నిరంతరం ప్రతి ఒక్కరు ఆత్మవివేచన చేసుకోవాలి. సంయమనం అలవరచుకోవాలి. అదే స్థితప్రజ్ఞత*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి