అగస్త్య మహాముని వారిని తన ఆశ్రమములోనే ఉండమని కోరాడు .కానీ రాముడు తమకు చక్కటి వాసయోగ్యమైన ప్రదేశం ఒకటి చూపమని మహర్షిని కోరాడు.
. రాముని ఆంతర్యం గ్రహించినవాడై అగస్త్యుడు, రామా ! ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ఫలపుష్ప భరితమైన సుందర ప్రదేశం ఉన్నది.అక్కడ మీరు మిగిలినఅరణ్యవాసకాలముపూర్తిచేసుకోవచ్చు .
అందుకు అది అనువైన ప్రదేశము
దాశరదీ !తపః ప్రభావమువలన నాకు అంతా తెలిసినది..
.
మీకు శుభము కలుగుతుంది వెళ్లి రండి.
నీవు అరణ్యవాసము పూర్తిచేసుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళగలవాడవు. సుఖంగా వెళ్ళండి అనిపలుకగా మహర్షికి నమస్కరించి పంచవటి వైపుగా సాగిపోయారు సీతా రామలక్ష్మణులు.
..
.మార్గమధ్యములో మహాకాయముతో ఉన్న ఒక పెద్ద గ్రద్దను రాముడు చూశాడు ,అది ఎవరో మాయావి అయిన రాక్షసుడు అనితలచి, నీవు ఎవరు ?అని గద్దించాడు.
.
అప్పుడు ఆ పక్షి చాలా సౌమ్యముగా ,మృదువుగా రామా! నేను నీ తండ్రి స్నేహితుడను. నన్ను జటాయువు అంటారు ,నా అన్న సంపాతి,మా తండ్రి పేరు అరుణుడు ,నీకు ఇష్టమైన ఎడల వనవాసకాలములో నీకు సహాయకారిగా ఉంటాను అని పలికాడు.
.
తండ్రి స్నేహితుడు అని తెలుపగానే చాలా ఆనందించి కౌగలించుకొని వారిరువురి స్నేహం గురించి మరల మరల ప్రశ్నించాడు రాముడు.
.
జటాయువుతో కూడా కలిసి పంచవటిలో ప్రవేశించాడు రాముడు.
.
అక్కడ లక్ష్మణుని చేతిలో చెయ్యివేసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగి పర్ణశాల నిర్మించడానికి అనువైన ప్రదేశం నిర్ణయించుకున్నాడు రాముడు.
.
రామాయణమ్ 127
......................
పంచవటి చాలా మనోహరంగా ఉన్నది .
చుట్టూ పర్వతాలు అందమైన దాతువులచేత ప్రకాశిస్తూ వివిధ వర్ణ శోభితమై రమణీయంగా కనపడుతున్నాయి
ఎటుచూసినా ఎత్తైన చెట్లు. సాల,తాళ,తమాల,పనస,ఆమ్ర,నివార,తిమిస,పున్నాగ,చందన,స్పందన,నీప,పార్ణాస,లికుచ,ధవ,అశ్వకర్ణ,ఖాదిర,సామీ,కిమ్సుక,పాటల వృక్షాలు కనపడుతూ ఉన్నాయి.
.
అందంగా మెలికలు తిరుగుతూ చక్రవాక పక్షులచేత శోభితమై ఉన్న గోదావరీ నదిని చూడగానే రాముడి మదిలో ఉత్సాహం ఉరకలేసింది.
.
ఒక చక్కని ఎత్తైన ప్రదేశం ఎంచుకుని లక్ష్మణా ఈ ప్రదేశం చాలా బాగున్నది ఇక్కడ పర్ణశాల నిర్మించుకొందాం అని పలికాడు.
.
వెంటనే లక్ష్మణుడు ఆ ప్రాంతములో మట్టిని బాగా ఎత్తుగా చేశాడు,మంచి దృఢమైన స్తంభాలు తీసుకొచ్చి నిలిపాడు,పొడవైన వెదుళ్లతో వెన్నుబద్ద ఏర్పాటు చేశాడు ,జమ్మికొమ్మలు తెచ్చి పరచి చాలా గట్టిగా కట్లుకట్టాడు.దానిమీద రెల్లుగడ్డి,దర్భలు,ఆకులు వేసి కప్పేసాడు ,లోపటి నేలను చదునుచేసాడు.
.
ఆ పర్ణశాల చూడటానికి అందంగా ,విశాలంగా ఉంది .రాముడికోసం చాలా అందంగా తీర్చిదిద్దాడు లక్ష్మణుడు .అక్కడ దేవతా పూజలుచేసి నివసించటానికి సిద్ధమైన పర్ణశాల రాముడికి చూపాడు .
.
ఆ పర్ణశాల చూడగానే ఆనంద భరితుడై గట్టిగా తమ్ముని కౌగలించుకొని లక్ష్మణా నాన్న లేని లోటు నీవు తీరుస్తున్నావు ,నా తండ్రి నీ రూపంలో మరల కనబడుతున్నాడు నాకు.
.
ఆ పర్ణశాలలో సీతా సమేతుడై లక్ష్మణుడు సేవ చేస్తూ ఉండగా స్వర్గంలో దేవేంద్రుడు నివసించినట్లు కొంతకాలం నివసించాడు రామచంద్రుడు.
*************************
రామాయణం 126 మరియు 127 భాగాములు👆
*************************
ఈమె సీత నా సుత
.
ఈమె సీత నా సుత
నీకు సహధర్మచారిణి
ఈమెను నీవు స్వీకరింపుము
నీకు మంగళమగుగాక
ఈమె చేయిని నీ చేతితో గ్రహింపుము
ఈమె పతిని సేవించుటయే వ్రతముగాకలది!
గొప్ప స్వభావము కలది
నీడలా నిన్ను అనుసరించిఉంటుంది ఎల్లప్పుడూ !
.
ఇదీ సీతమ్మ తండ్రి అయిన జనకమహారాజు రామచంద్రుడిని తన అల్లుడుగా చేసుకొనేటప్పుడు తన కుమార్తె గురించి చెపుతూ అన్నమాటలు !
.
ఇదుగో రామా! ఈమె సీత!
ఆసౌందర్యము,సౌకుమార్యము,లావణ్యము ఒక్కసారి చూడము!
.
....కేవలం రూపమే అనుకున్నావా !
నా కుమార్తె ఈమె ,మేము జనకులము, రాజర్షుల ఇంట్లో పెంచబడ్డ పిల్ల ఈ తల్లి !
.
ఇంకొక మాట నువ్వు తల్లిగర్భవాసం చేసి పుట్టావు ,కానీ మాతల్లి అలా కాదు అయోనిజ ! పుట్టుకలో కూడా నీ కంటే ఒక మెట్టు ఎక్కువే !
.
ఈమెను నేను ఇవ్వడంలేదు ! నీవే స్వీకరించు ఆమె నీసొత్తు !....
.
ఏనాం ప్రతీచ్ఛ ! ఏనా అంటే అ + ఇనా ....అ అంటే విష్ణువు, ఇన అంటే స్వామిగా కలిగినటువంటిది అనగా
లక్ష్మీ దేవి !
.
అనగా ఆమె ఎప్పటినుండో నీ సొత్తు ! ఎప్పటినుండి అంటే ? ఎప్పటినుండో ఎవరికీ తెలియదు ! ....ఈ నీ సొత్తు కొంతకాలమునుండి మాత్రమే నా వద్ద ఉన్నది !
.
లక్ష్మీదేవి విష్ణువును ఎన్నడూ వీడనిది !
.
ఆమెను ఇవ్వటానికి నాకేమి అధికారమున్నది? నీవేస్వీకరింపుమయ్యా !
.
చూసేవారి దృష్టి తగులకూడదని "భద్రంతే" ! అని కూడా అన్నాడు ఆ తండ్రి !
.
నీకుభద్రము !
.
ధర్మాచరణము కోసము స్వీకరింపుము అని చెప్పాడాయన.
అందుకే అరచేతిలో అరచేయి ఉంచినది !
.
ఇది శారీరిక వాంఛలు తీర్చుకొనుటకు జరిగిన కళ్యాణము కాదు ధర్మాచరణకోసము జరిగిన వివాహము !
.
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా !
.
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారు తెలిపిన రహస్యమది )
*************************
రాముడు ఎవరు???
.
ఎందుకు పూజిస్తున్నాం! ఆయనను !
మనలాగే మానవ జన్మెత్తాడుకదా!
.
ఏమిటి speciality!...
.
ఈ రామాయణాన్ని వ్రాసిన మహర్షి వాల్మీకి ( నేటిలెక్కలలో ఒక గిరిజనుడు)...
.
రాముడికి సహాయం చేసిన వారు గిరిజనులు (వానరులు)
.
రాముడు ఎంగిలి తిన్నది ఒక గిరిజన స్త్రీది (శబరి)...
.
రాముడికి అన్యాయం చేసినది వేదవేదాంగవేత్త అయిఉండి కూడా రాక్షసప్రవృత్తికలిగిన ఒక బ్రాహ్మణుడు (రావణుడు)...
...
పదిహేను సంవత్సరాల ప్రాయంలోనే ఘోరరాక్షసి తాటక ప్రాణాలను వైతరిణి దాటించాడు!
.
శివధనుస్సును అవలీలగా ఎక్కుబెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు!
.
భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా వారే నిర్వచనం!
.
ఎప్పటికీ వారే!
.
అర్ధరూపాయి ఆస్థికోసం కన్నతండ్రిని అడ్డంగా నరికే అధములున్న ఈ సృష్టిలో.....
ఇంకాసేపట్లో పట్టాభిషేకము,
చక్రవర్తి కాబోతున్నాడు!
అంతలోనే తండ్రి ఆదేశము అడవులకు పొమ్మనమని!
.
ఏ మాత్రం తొణకలేదు !బెణకలేదు !
తండ్రి పట్ల రవ్వంత ధిక్కారమూలేదు!
.
అడవికి ప్రియసతితో,అనుంగుసోదరుడితో పయనమయ్యాడు!
.
తన ప్రియమిత్రుడు,ఆత్మసమోసఖా! ఆత్మసఖుడయిన గుహుడిని ఆప్యాయంగా కౌగలించుకొని ఆదరంగా పలకరించి మౌనంగా గంగ దాటాడు!....ఈ గుహుడు ఒక నిషాదుడు ...రాముడి ఆత్మ!
.
అన్నా!నీకన్నా రాజ్యం నాకు ఏపాటిది! నేను నీకు సేవకుడిని అని తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్దించినా! పూవులలోపెట్టి రాజ్యాన్ని తిరిగి అప్పగించినా ,తండ్రికి అనృతదోషము అంటకూడదని భరతుడి ప్రార్దన తిరస్కరించాడు!.
.
అన్నదమ్ముల అనురాగానికి ఈ నాటికీ ఎవ్వరూ చేరుకోలేని శిఖరాలు ఆ నలుగురు అన్నదమ్ములు!
భార్య అపహరింపబడ్డ తరువాత అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకు దహన సంస్కారాలు చేసి పశు పక్ష్యాదులు కూడ మనలాంటి ప్రాణులే అని లోకానికి సందేశమిచ్చాడు!
.
పోతే పోయిందిలే !
ఆడవాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు!
నాకేంటి మహారాజును !అని అనుకున్నాడా!...లేదు !
.
ఆవిడ దొరికేంత వరకు ప్రాణంలేని కట్టెలాగ బ్రతికాడు తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూసికూడా ఎరుగడు!...
..
మనుషులను క్రమ పద్ధతిలో నడిపి విజయాలు చాలామంది యోధులు సాధించారు!..కానీ..
చంచల స్వభావులయిన కోతులను ఒక్కతాటిమీదకు తెచ్చి విజయం సాధించాడు .
.
బలమయిన శత్రువును జయించడానికి ఎంత
Organisational skills కావాలి!
ఎంత patience ఉండాలి!
ఎంత స్పష్టదృష్టి (clear vision)ఉండాలి!
.
రావణలంక స్వర్ణలంక ! అది వశమయిన తరువాత కూడా అయోధ్య కు తిరిగి వెళ్ళాడు తప్ప , లంకానగర వైభవం ఆయనను ఏమాత్రం మోహంలో పడేయలేదు!
...
బలము,
వీర్యము,
తేజస్సు,
పితృవాక్పాలన, ఏకపత్నీవ్రతము,
సోదరప్రేమ,
ధర్మవర్తనం, గొప్పనాయకత్వం,
స్నేహధర్మం
.
ఇంతేనా!...
.
ఆయన సర్వభూతమనోహరుడు!
.
ఏదిలేదు ఆయనదగ్గర!
.
ఒక్కొక్కలక్షణము ఒక్కొక్క ఎవరెస్టు శిఖరమే ...
ఆయన తరువాతనే ఎవరయినా!
.
Take any parameter he is the best..ultimate!
.
ఏకాలంలో అయినా అత్యుత్తమ మానవుడు ఆయనే!
...
అత్యుత్తమమైనవన్నీ నేనే! అని కదా కృష్ణపరమాత్మ చెప్పినది!
.
రుద్రులలో..శంకరుడు
వేదాలలో ..సామవేదము
పక్షులలో ..గరుత్మంతుడు
చెట్లలో ...రావిచెట్టు
మృగాలలో..సింహము
శస్త్రధారులలో.....శ్రీ రాముడు
.
....ఈవిధంగా
.
అంతేనా!
Negative ultimate
వంచకులలో..జూదముకూడా ఆయనే!
(Negative,positive మనకు! There is nothing like positive or negative ...situation makes it..)
... విభూతియుక్తము
,ఐశ్వర్యయుక్తము,
కాంతియుక్తము,
శక్తియుక్తము,
అయినవి ఏదయినా ఆయనే!
ఆయన అంశే!
...
యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీ మదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్!
...
మరి శ్రీ రాముడు ఈ నిర్వచనం ప్రకారం
రామ "బ్రహ్మమే"కదా!
.
..శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి