పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - పరమాత్మ పురుషోత్తముడని యేల చెప్పబడెనో తెలియజేయుచున్నారు -
యస్మాత్ క్షర మతీతోఽహం
అక్షరాదపి చోత్తమః |
అతోఽస్మి లోకే వేదే చ
ప్రథితః పురుషోత్తమః ||
తాత్పర్యము:- నేను క్షరస్వరూపునికంటె మించినవాడును, అక్షరస్వరూపుని (జీవుని) కంటె శ్రేష్ఠుడను అయియున్నందువలన ప్రపంచమునందును, వేదమునందును "పురుషోత్తముడ”ని ప్రసిద్ధికెక్కియున్నాను.
వ్యాఖ్య:- క్షర, అక్షరపురుషులు ఇరువురికంటెను అతీతుడై యుండుటవలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను. జీవుడున్ను తన పురుషత్వము (జీవత్వము)తో తృప్తి పడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అపుడే యతడు కృతార్థుడగుచు భవబంధవిముక్తుడై సాక్షాత్ భగవానునివలె లోకమున కీర్తింపబడగలడు.
ప్రశ్న:- భగవానుడు పురుషోత్తముడని లోకమున ఏల ప్రసిద్ధికెక్కెను?
ఉత్తరము:- ఆతడు క్షర, అక్షరపురుషులిరువురికంటెను అతీతుడుగనుక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి