మహాభారతము ' ...66 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
అరణ్యపర్వం.
తానువేసే బాణాలన్నీ కిరాతుని దేహంలో లీనమౌతుంటే, యేమిచెయ్యాలో తోచక విస్తుపోయాడు అర్జునుడు. కిరాతుని దేహం కుసుమకోమలంగా వున్నది. అతడు కిరాతుడు కాదేమో అని అనుమానమొచ్చింది. తన బాణాలు అడ్డుకోగల ధీశాలి యితడు యెవరై వుంటాడు ? అనుకున్నాడు. ఏది యేమైనా, యీ దెబ్బతో అతడో నేనో తేలిపోవాలి అని తనకు ఖాండవవనదహన సమయంలో అగ్నిదేవుడు యిచ్చిన అక్షయ తూణీరాలను బయటకుతీశాడు అర్జునుడు. వాటిని ప్రచండవేగంతో సంధించి వదిలాడు. ఆ తూణీరాలన్నీ అయిపోయినా శివుడు చెక్కుచెదరలేదు.
తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏమి చేయవలెనో తోచలేదు అర్జునునికి. అంతయోధునికి అట్టి పరిస్థితి వస్తుందని అతడేనాడు వూహించలేదు. రాబోయే యుద్హాలలో జరుగబోయే పరిణామాల సంకేతామేమో అన్నట్లుగా ఆ ఓటమి అంగీకరించలేక, చావో రేవో అన్నరీతిలో తన గాండీవాన్ని వెనుకకు త్రిప్పి పట్టుకుని, వింటికొమ్ముతో కిరాతుని వేషంలో వున్న ముక్కంటిని గట్టిగా కొట్టాడు. గాండీవం తగిలీ తగలగానే, దానిని వెంటనే పట్టుకుని తనవద్దకు లాగేసుకున్నాడు గౌరీపతి.
గాండీవాన్ని లాగివేసుకున్నాకూడా, మరే ఆలోచన లేకుండా ఒరలోనుండి కత్తి దీసి, కత్తి పిడితో కిరాతుని తలపై కొట్టాడు, అర్జునుడు. కిరాతునికి ఇసుమంతైనా దెబ్బతగలలేదు సరికదా, కత్తి మూడు ముక్కలయింది. ఇంకా అజ్ఞానపొరలలో నుండి బయటకు రాక, ఆ వచ్చినదెవరో తెలియక, అర్జునుడు మూర్ఖంగా పెద్ద పెద్ద రాళ్లను కిరాతుని పై విసర సాగాడు. చెట్లు పెకిలించి అతనిపై వేయసాగాడు. కిరాతుడు అదరలేదు, బెదరలేదు. ఇక చివరిప్రయత్నంగా కిరాతునితో ముష్టియుద్ధానికి దిగాడు, అర్జునుడు. ఏమి పుణ్యఫలమో ఈశ్వరునితో ముష్టియుద్ధం ! . ఆ అవకాశం యెవరికీ దక్కినట్లు యే పురాణాలలో చూడలేదు. ఆకాశంలో నుండి దేవతలు యీ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూడసాగారు.
భూతనాధునితో పిల్లచేష్టలా ! శివుడు అర్జునుని పట్టు తప్పించుకొనడానికి యెంత మెల్లగా కొట్టినా, నాడులు కదిలిపోసాగాయి అర్జునునికి. కొద్దిసేపు ప్రయత్నించి అర్జునుడు మూర్చిల్లాడు. మళ్ళీ లేచి, తాను వున్న పరిస్థితి చూసుకున్నాడు. రక్తమోడుతున్న దేహం. జారిపోతున్న కీళ్లు. అప్పుడు అర్ధమైంది తనకు దేవుడే దిక్కని. తనకిష్టమైన పరమేశ్వరుని ' యెలుగెత్తి ప్రార్ధించాడు. నీవేదిక్కని పిలిచాడు. వచ్చి రక్షింపమన్నాడు.
పక్కన వున్న మట్టినితీశాడు. భూమిలోనున్న గంగను ప్రార్ధించి నీళ్లతో తడిపాడు. పార్థివలింగానికి చుట్టుపక్కల వున్న పూలతో మాల తయారుచేసి, వేశాడు. అటు తిరిగి యిటు చూడగా, ఆ మాల లింగం పైన గాక, కిరాతుని మెడలో దేదీప్యమానంగా వెలుగుతూ కనబడింది. అప్పుడు అర్ధమైంది, యెదురుగా వున్న వారెవరో ! వెంటనే వారి పాదాలపై పడ్డాడు. అర్జునుడు తమను గుర్తించగానే, ఆ ఆదిదంపతులు, తమ నిజ రూపాలతో, అర్జునునికి సాక్షాత్కరించారు.
వారికి సాష్టాంగప్రణామాలు చేసి, అర్జునుడు శరణుకోరి, అనేకవిధాల స్తుతించి, ఆ పార్వతీ పరమేశ్వరులకు తాను వచ్చినపని చెప్పాడు. ఈశ్వరుడు కూడా సంతసించి, ' అర్జునా ! నీవలననే రాబోయే సంగ్రామంలో శాంతి స్థాపన జరగాలి. నీపై గురుతర బాధ్యత వున్నది. అందుకే నీ పరాక్రమాన్ని పరీక్షించాను. నీకన్నా పెద్దశక్తి యెదురయ్యే పక్షంలో యేమి చెయ్యాలో పధక రచన చేసుకోవాలి. ' అని సలహా చెప్పాడు .
' హే దయానిధీ ! నాకు దయచేసి, బ్రహ్మముఖంగా కల పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించు. రాబోయే యుద్ధంలో నాకు అండగా వుండు తండ్రీ ! ' అని దీనంగా అడిగాడు. ' అర్జునా ! ఈ అస్త్రాన్ని పొందడానికి నీవే అర్హుడవు. ఇంద్ర, యమ, కుబేర, వరుణులకు కూడా దీనిని ప్రయోగించడం తెలియదు. ఈ అస్త్రాన్ని యెదిరించి నిలబడగలిగే శక్తి ముల్లోకాలలో యెవరికీ లేదు. దీని ప్రయోగం ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలోనే జరగాలి. ' అని చెప్పి, అర్జునునికి పరమశివుడు ఆశక్తి మంత్రోపదేశం చేసిన తరువాత, అర్జునుని ఆశీర్వదించి, అంతర్ధానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు.
అర్జునుడు, తాను అంబతో కూడిన పరమశివుని దర్శించడమే గాక, పాశుపతాన్ని పొందినందుకు పరమానంద భరితుడయ్యాడు. అర్జునునికి శివ అనుగ్రహం కలిగిందని తెలిసి, వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు అర్జునుని చూడడానికి వచ్చారు. ఇంద్రుడు తనభార్య శచీ దేవితో కూడి ఐరావతంపై వచ్చాడు.
యమధర్మరాజు, రాబోయే యుద్ధంలో కృష్ణునితో కూడి అర్జునుడు చెయ్యబోయే, ధర్మ సంస్థాపనకొరకై, దండాయుధాన్ని అర్జునునికి యిచ్చాడు. వరుణుడు వరుణపాశాన్ని అనుగ్రహించాడు. కుబేరుడు అంతర్ధానాస్త్రం ప్రసాదించాడు. అంతలో ఇంద్రుని రధము మాతలి తోలుతుండగా వచ్చింది. దానిలో స్వర్గలోకానికి రమ్మని ఇంద్రుడు ఆహ్వానించాడు అర్జునుని.
అర్జునుడు ప్రక్కనే వున్న గంగానదిలో స్నానమాడి నిత్యకర్మలను చేసుకుని, హిమవత్పర్వత అధిదేవత అయిన హిమవంతునికి నమస్కరించి, తన ప్రాంగణంలో వుండి తపస్సు చేసుకొనుటకు అనుమతించినందుకు కృతజ్ఞతలు చెప్పి, మాతలికి నమస్కరించి, ముందు మాతలిని రధం అధిరోహించమని గౌరవపూర్వకంగా ప్రార్ధించి తరువాత అర్జునుడు ఇంద్రరధం యెక్కి, అమరావతి వైపు రథంలో ప్రయాణించాడు.
మార్గమధ్యంలో అనేక రకాలైన విమానాలలో జీవులను స్వర్గం వైపు తీసుకెళ్తున్నట్లు, కొందరు తిరిగి భూమిపైకి వస్తున్నట్లు అర్జునునికి గోచరించగా, మాతలిని అడిగాడు, వారంతా యెవరని. ' అర్జునా ! వారి వారి పాపపుణ్యాలను బట్టి జీవులు వుండవలసినంత వరకు స్వర్గలోకంలో వుండి, తరువాతి తిరిగి భూమిపై జన్మిస్తూ వుంటారు. నీవు చూస్తున్నది అట్టి జీవులనే. 'అని మాతలి అర్జునునికి చెప్పాడు.
స్వర్గలోకం చేరిన తరువాత, ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుని, ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుని, అర్ధాసనం యిచ్చి గౌరవించాడు. మిగిలిన దేవగణాలు అర్జునునికి అతిధిపూజ చేశారు. స్వర్గలోకంలో అతిధిగా ఆనందంగా కొన్నాళ్ళు వున్నాడు అర్జునుడు. ఆ రోజులలో, ఒకనాడు ఊర్వశీ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఇంద్రుడు. దేవతలతో పాటు అర్జునుడూ ఆశీనుడై వున్నాడు, ఆ సభలో. ఊర్వశి నృత్యాన్ని మైమరచి చూస్తున్నాడు అర్జునుడు. ఇంద్రుడు అది గమనించాడు.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి