**దశిక రాము**
**శ్రీమద్భాగవతము**
చతుర్థ స్కంధం -11
.ధ్రువ యక్షుల యుద్ధము
ధ్రువుడు ప్రతాపాతిశయంతో సర్వదిక్కులు, ఆకాశం మారుమ్రోగే విధంగా శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనిని విని యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరాలైన ఆయుధాలను ధరించి ఉత్సాహంతో పురంనుండి బయటికి వచ్చారు.యక్షులు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదుర్కొనగా…మహారథుడు, వీరాధివీరుడు, ధనుర్ధారి, శూరుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులనూ లెక్కచేయకుండా భయకరంగా మూడు వాడి బాణాలతో గాయపరిచాడు.ఆ యక్షులు నొసళ్ళు పగిలి, మూర్ఛపోయి, తిరిగి తేరుకొని ఆ మహావీరుని పరాక్రమాన్ని ధైర్యాన్ని హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొంటూ కాళ్ళచేత త్రొక్కబడ్డ కాలసర్పాలవలె పట్టరాని రోషంతో భయంకరాకారాలు కలవారై…ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద పద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన ఎడతెగకుండా కురిపించారు.ఆ విధంగా యక్షులు బాణాలను కురిపించగా ఆ ధ్రువుడు …(ధ్రువుడు) ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ…హాహాకారాలు చేస్తూ “అయ్యో! ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా!”అని చింతించే సమయంలో…తాము ఆ ధ్రువుణ్ణి జయించామని అనుకుంటూ గంతులు వేస్తూ రాక్షసులు చెప్పుకొంటుండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటపడిన సూర్యునివలె ధ్రువుడు కనిపించాడు. అలా కనిపించి…(ధువుడు) శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనుస్సును చేపట్టి, భయంకరంగా బాణపరంపరను కురిపించి, పెనుగాలి మేఘాలను పారద్రోలే విధంగా భుజబలంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదరు చేసాడు.మహాత్ముడు, సాటిలేని మేటి వీరుడు అయిన ధ్రువుడు భయంకరాలైన బాణాలను ప్రయోగించి శత్రువుల జీవ స్థానములను బద్దలుకొట్టాడు;వారి అవయవాలను తునాతునకలు కావించాడు; పర్వతాలను బ్రద్దలు కొట్టే ఇంద్రునివలె ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుబెట్టాడు. ఆ సమయంలో…మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువునిచేత వికలాంగులైనవారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది.అప్పుడు చావగా మిగిలినవారు…వరబలం కలవాడు, స్వాయంభువ మనువు మనుమడు అయిన ధ్రువుని బాణాలచేత శరీరాలు తూట్లు పడగా యుద్ధం మానుకొని సింహాన్ని చూచిన ఏనుగులవలె భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలిసికొనలేకపోయాడు. వాళ్ళు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి …ఆలోచించి చూస్తే ఈ భూమిమీద మాయావుల మాయలను తెలిసికొనడం ఎవరికీ సాధ్యం కాదు.” అంటూ శత్రునగరంలోకి ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు. కాని శత్రువుల పట్టణం ధ్రువుని కంటికి కనిపించలేదు.
అందువల్ల ధ్రువుడు మహా ప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక, పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు. దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు. ఆకాశంలో మెరుపులు తళతళ మెరిసినట్లు. మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది. రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి; విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి. ఇంకా మదపుటేనుగులు, సింహాలు, పెద్దపులులు చుట్టుముట్టినట్లు. కెరటాలతో సముద్రం భయంకరంగా పొంగిపొరలుతున్నట్లు కనిపించింది. ప్రళయకాలంలో వలె భయంకరమైన గొప్ప మడుగు కనిపించింది. ఈ విధంగా క్రూరులైన ఆ యక్షలు అనేక విధాలైన భీకరమైన మాయలను సృజించారు. అప్పుడు…విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనువు మనుమడైన ధ్రువుణ్ణి “మనుము!... మనుము!” అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి…వచ్చి ఆ ధువుణ్ణి చూచి ఇలా అన్నారు.“ఓ పుణ్యాత్ముడా! లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా, స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శార్ఙ్గపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక!” అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు. ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం సమసిపోయినట్లు యక్షుల మాయలు అనే కారుచీకట్లు క్షణంలో చెదరిపోయాయి. వారింప శక్యం కాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు అంచులు, రాయంచ రెక్కలవంటి రెక్కలు కల వాడి బాణాలు వేలకొలది పుట్టి, అడవిని చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకరమైన ధ్వనితో శత్రుసైనికుల పైన ఎడతెగకుండా వచ్చి
పడ్డాయి.ఆ విధంగా నారాయణాస్త్రం ప్రయోగించగా…
నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తళతళ మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు.అప్పుడు ధ్రువుడు పదునైన భయంకర బాణాలను ప్రయోగించి యక్షుల పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతులను, చెవులను ఖండించాడు; కన్నులను పెకలించాడు; పొట్టలను చీల్చాడు; సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే ఉత్తమ లోకానికి వారిని పంపించాడు.ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధువునితో ఇలా అన్నాడు “నాయనా! తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు.పుణ్యాత్ముడవైన ఓ ధ్రువకుమారా! మనుకులానికి ఇది తగని పని. ఒక్కనికోసం పెక్కుమందిని వధించావు. ఇట్టి కార్యం నీవు చేయరాదు. దీనిని విరమించు.
అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాలనుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీపురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనములనుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతునకు తనవారనీ, పరులనీ భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం, అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి.
కొందరు ఆయనను స్వభావం అంటారు. మరికొందరు కర్మం అంటారు. ఇంకా కొందరు కాలం అంటారు. కొందరు దైవం అంటారు. మరికొందరు కామం అనికూడ అంటారు.
ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా! పుట్టుకకు, మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాదు. ముక్కుత్రాళ్ళతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు, శిష్టులకు అమృతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక నాయనా! నీవు అయిదేండ్ల వయస్సులో పినతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటలచేత లోలోపల ఎంతో నొచ్చుకొని, కన్నతల్లిని విడిచి, అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి మూడు లోకాలకూ మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం….పవిత్రమైన, పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తే వాడు, నేను, నాది అనే అవిద్యారూపమైన పీటముడిని త్రెంచుకొన్నావు. కావున ధీశాలీ! సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు.
మహాత్మా! మందులవల్ల రోగాలు నశించినట్లు కోపం కలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి కోపాన్ని అణచివేసుకో.పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవాళ్ళు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున…నమస్కారాల చేత, స్తోత్రాల చేత కుబేరుని ప్రసనుని చేసుకో” అని చెప్పి ధ్రువునిచేత పూజ లందుకొని స్వాయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు…కోపాన్ని తగ్గించుకొని, యక్షులను సంహరించడం మానుకొన్న ధ్రువుని దగ్గరకు యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనవారు స్తుతిస్తుండగా కుబేరుడు వచ్చాడు.
వచ్చి తనకు నమస్కరించిన ధ్రువునితో ఇలా అన్నాడు “రాకుమారా! నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడిచావు. అందువల్ల నీపట్ల నేను ప్రసన్నుడనైనాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం. కావున ఓ సుగుణాత్మా! వేయి మాట లెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడు కాడు. యక్షులను చంపినది నీవు కాదు.అంతేకాక కర్మ సంబంధాలైన దుఃఖం మొదలైనవి దేహాభిమానం కారణంగా మానవునికి కలుగుతూ ఉంటాయి. స్వప్నంలో వలె ‘నేను, నీవు’ అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. సర్వభూత స్వరూపుడు, అధోక్షజుడు, సంసార బంధ విమోచకుడు, పూజింపదగిన పాదపద్మాలు కలవాడు, అంతము లేని అపరిమితమైన శక్తి కలవాడు, త్రిగుణాలతో నిండిన మాయ లేనివాడు అయిన భగవంతుని సేవించు. నీకు మేలు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో. నీవు విష్ణుదేవుని పాదపద్మాలను స్థిరంగా పూజించేవాడవని నాకు తెలుసు” అని కుబేరుడు బుద్ధిమంతుడు, భాగవతోత్తముడు అయిన ధ్రువుణ్ణి ప్రోత్సహించాడు. ధ్రువుడు “ఏ హరి స్మరణం వల్ల దురంతమూ దుస్తరమూ అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలమో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో సుస్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు” అని కోరుకొన్నాడు. కుబేరుడు సంతోషించి ధ్రువునికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా నిజ రాజధానికి మరలి వచ్చి…ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణ లిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేసాడు. యజ్ఞవిభుడు, కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదలినవాడు, ఉత్తముడు, సర్వాత్మకుడు, కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింప జేశాడు. తనలోని మహాత్ముడు, చరాచరములన్నింట ఉండేవాడు, లక్ష్మీపతి, పరాత్పరుడు, దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి