3, నవంబర్ 2020, మంగళవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -10


.ధృవుండు మరలివచ్చుట 


అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు ” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీవంటివాళ్ళు తనంత తాను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని...మనస్సులో ఇలా తలంచాడు. చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా? అన్నివిధాల నిర్భాగ్యుడనైన నాకు అంతటి అదృష్టం ఎలా లభిస్తుంది? (ధ్రువుడు మరలి వస్తున్నాడు) అని ముందు నమ్మనివాడై “నీ కొడుకు తొందరలోనే తిరిగివస్తాడు” అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి,తన కొడుకు వస్తున్నాడని చెప్పిన చారునకు ధనం, ముత్యాల దండలు సంతోషంగా ఇచ్చి, కొడుకును చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా...వడిగల గుఱ్ఱాలను పూన్చిన బంగారు రథాన్ని ఆత్రంగా ఎక్కి, బ్రాహ్మణులతో కులవృద్ధులతో బంధు మిత్రులతో మంత్రులతో కలసి బయలుదేరాడు. వేదఘోషలు, వాద్యధ్వనులు, శంఖ కాహళ వేణు నాదాలు అతిశయించాయి. పెద్దభార్య సునీతి, చిన్నభార్య సురుచి బంగారు పల్లకీలెక్కి ఉత్తమునితో కూడి అనుసరించారు. అలా వేగంగా ముందుకు సాగి వెళ్తూ పురం వెలుపల ఉపవనం సమీపాన అల్లంత దూరంనుండి వస్తున్న ధ్రువకుమారుణ్ణి ఉత్తానపాదుడు చూచి...రథం దిగి, అనురాగం పొంగిపొరలగా సంభ్రమంతో ధ్రువునికి ఎదురువెళ్ళాడు. శ్రీపతి పాదపద్మాలను సేవించి పాపాలను పోగొట్టుకొని, ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరికలు తీర్చుకున్న తన కుమారుని సమీపించి ప్రేమతో పులకించిపోతూ సంతోషంగా...గట్టిగా కౌగిలించుకొని, ముఖం నిమిరి, శిరస్సు మూర్కొని, గడ్డం పుణికి, జలజల ప్రవహించే ఆనందబాష్పాలతో పుత్రుని శిరస్సును అభిషేకించి ఉత్తానపాదుడు ఆశీర్వదించగా, చిరకీర్తివంతుడైన పుత్రుడు ఆ ధ్రువుడు...తండ్రి దీవనలను అందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తన్మయుడై నమస్కరించాడు. సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున జేర్చుకొని...(సురుచి) ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో “చిరంజీవ!” అని దీవించింది. పల్లమునకు నీళ్ళు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా, విదురా! విష్ణుభక్తులు పరమపవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు. కనుక, ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒడలు మరచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి. వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాలకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తనూస్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆనందబాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పొంగులెత్తాయి. పురజనులు ధ్రువుని తల్లియైన సునీతిని చూచి అంతులేని సంతోషంతో “చాలాకాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు.”అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరులచేత ఉపలాలింప బడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండ బెట్టి, ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపొరలే సంతోషంతో పురం వైపు బయలుదేరి వచ్చి…గోడలు, తలుపులు, గోపురాలు బంగారు పూతతో తళతళ మెరుస్తున్నాయి. పండ్లతోను పూలగుత్తులతోను నిండిన అరటి స్తంభాలు, చిన్న చిన్న పోకచెట్లు వీధికి ఇరువైపుల కనువిందు చేస్తున్నాయి. అంగళ్ళముందు పచ్చకర్పూరం, కస్తూరి, చందనం కలిపిన నీళ్ళు చల్లారు. ప్రతి ఇంటి ముంగిట్లోను నవరత్నాలతో ముగ్గులు తీర్చి దిద్దారు. పవిత్ర నదీజలాలతో నిండిన మంగళ కలశాలు నిలిపారు. బంగారు లాజలు, అక్షతలు, పూలు, పండ్లు పూజాద్రవ్యాలు సిద్ధపరిచారు. ఈ విధంగా అలంకరింపబడిన పట్టణంలోకి…అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధృవునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో…సన్నని సింగపు నడుములు గల పురస్త్రీలు ఒయ్యారంగా మేడలపై నిలబడి, చేతులకు ధరించిన మణులు తాపిన బంగారు గాజులు ఝణఝణ ధ్వనులు చేస్తుండగా ఆ ఉత్తమోత్తముడైన భగవద్భక్తునిపై తెల్లావాలు, పండ్లూ, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్ళను చల్లారు.

ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ, బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతు లివ్వగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి…

ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితాలైన గవాక్షాలతోను మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరీ అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేళ్ళు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి. ఇంకా…

ఎన్నెన్నో సుందర వస్తువులతోను, సుందరీమణులతోను కలకలలాడుతూ కనువిందు చేస్తున్న రాజప్రాసాదంలో స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లు ధ్రువుడు ప్రవేశించాడు. ఆ విధంగా ప్రవేశించగా రాజర్షి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఆశ్చర్యపడ్డాడు. ధ్రువునకు ప్రజలపై గల అనురాగాన్ని, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానాన్ని పరికించి నవయౌవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని సుగతిని పొందడానికి నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు. ఆ తరువాత ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహమాడి ఆమెవల్ల కల్పుడు, వత్సరుడు అనె ఇద్దరు కొడుకులను పొందాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమెవల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే వేటాడటానికి హిమవత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లియైన సురుచి పుత్రదుఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ కారుచిచ్చు మంటలలో చిక్కి మరణించింది. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతోను, దుఃఖంతోను కలత చెందిన మనస్సు కలవాడై జయశీలమైన రథాన్ని ఎక్కి ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోను, యక్షులతోను నిండిన అలకాపురాన్ని చూచి మహాపరాక్రమవంతుడైన ఆ ధ్రువుడు…

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: