హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా అశ్వియుజ మాసంలో బహుళ తదియ రోజున వచ్చే పండుగ అట్లతద్దిని హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విజయదశమి తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ అట్లతద్ది.
దీపావళికి ముందు వచ్చే ఈ పండుగను మహిళలంతా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పండుగ సమయంలో అమ్మాయిలంతా ఆనందోత్సాహాలతో ఈ అట్లతద్దిని జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నవంబరు 3వ తేదీ(మంగళవారం)రోజున అట్ల తద్ది వచ్చింది. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. ఈరోజంతా మహిళలంతా తమ చేతులకు మరియు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటారు.
ఎవరి గోరింటాకు అయితే బాగా పండుతుందో వారికి ఎక్కువ లక్కీ కలసి వస్తుందని నమ్ముతారు. ఈ అట్ల తద్ది పండుగ సందర్భంగా మహిళలు పూజను ఏ విధంగా చేస్తారు.. వ్రతాన్ని ఎలా చేస్తారు.. దీని వల్ల వారికి ఎలాంటి ఫలితాలొస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
*ఈ పండుగ సమయంలో..*
అట్ల తద్ది పండుగ సందర్భంగా మహిళలందరూ ఉదయాన్నే నిద్ర లేచి.. సూర్యోదయానికి ముందే తలస్నానం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటిస్తారు.
*ఊయల కట్టి..*
ఈ పండుగ సమయంలో ఆడపిల్లలందరూ చల్లని నీడనిచ్చే చెట్ల కింద చేరతారు. అక్కడ ఊయల కట్టి అందులో ఆనందంగా ఊగుతారు. ఎంతో సందడిగా జరుపుకుంటారు. అలాగే ‘అట్ల తద్ది ఆరట్లు.. ముద్దపప్పు మూడట్లు'' అంటూ పాటలు పాడుకుంటూ మహిళలందరికీ.. ఇరుగుపొరుగువారికి వాయినాలిస్తారు.
*తమ కలలు నిజం కావాలని..*
చాలా మంది అమ్మాయిలలో పెళ్లి వయసు వచ్చిన వారంతా తనకు కాబోయే భర్త మంచివాడు.. గుణవంతుడు.. సౌమ్యుడిగా ఉండాలని కలలు కనడం అత్యంత సహజం. తమ కలలు నిజం కావాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. అందులో ప్రతి సంవత్సరం జరుపుకునే అట్లతద్దికి చాలా ప్రాముఖ్యత ఉంది.
*మంచి భర్త కోసం..*
పెళ్లి కాని ఆడపిల్లలంతా తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తే.. పెళ్లి అయిన వారు మాత్రం తమకు మంచి భర్త దొరికినందుకు.. తను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో పరమేశ్వరున్ని పతిగా పొందడానికి పార్వతీ దేవి తొలిసారి చేసిన విశిష్టమైన ఈ అట్ల తద్ది.
*అట్లంటే కుజుడికి మహాప్రీతి..*
పురాణాల ప్రకారం నవ గ్రహాలలో ఉండే కుజ గ్రహానికి అట్లంటే మహాప్రీతి. అందుకే తనకు అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం తొలగిపోతుందని.. తమ దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయని చాలా మంది నమ్ముతారు.
*గర్భధారణలోనూ..*
రజోదయానికి కూడా కుజుడు కారకుడు. కాబట్టి రుతుచక్రం సక్రమంగా ఉంచి.. దానికి సంబంధించిన సమస్యల నుండి కాపాడాతాడని.. దీని వల్ల గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి.
*ఏమి చేయాలి..*
అట్లతిద్ది నాడు ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి, గణేశుడి పూజ తర్వాత, గౌరీ స్తోత్రం పఠించాలి. సాయంకాలం చంద్రుడిని దర్శించుకొని.. తిరిగి గౌరీపూజను చేసి సుమారు 10 అట్లను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం వాటితో పాటు పండ్లను ఇరుగుపొరుగు వారికి వాయినంగా సమర్పించాలి.
*అన్ని పది రకాలే..*
ఈ పవిత్రమైన అట్ల తద్ది రోజున పది రకాల పండ్లను తినాలి. పది రకాల తాంబూలాలు వేసుకోవాలి. పదిసార్లు ఊయలను ఊగాలి. అందుకే ఈ పండుగను ఊయల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ సమయంలో గౌరీ దేవి అనుగ్రహం లభించి పెళ్లికాని స్త్రీలకు మంచి భర్త.. పెళ్లి అయిన వారికి సంతానం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఎక్కువగా జరుపుకుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి