*నిరంతర సాధన*
మనిషి ఒక క్రమమైన మార్గంలో నడవాలంటే నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మనసును లక్ష్యంతో నింపితే, అది మనిషిని తుదివరకు నడిపిస్తుంది. లక్ష్యం అనేదే లేకపోతే మనిషి ఎటు నడవాలో నిర్ణయించుకోలేడు. మనసుకు నియంత్రణ లేక పరాధీనమవుతుంది. కోరికల చట్రంలో బిగుసుకుని మనసులో పుట్టిన ప్రతి వాంఛను తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకే లక్ష్యం లేకుండా జీవించే వ్యక్తిని పశువుతో పోలుస్తారు పెద్దలు.
లక్ష్యంతో జీవించడమంటే ఉన్నత ఆశయాలకోసం ఉత్తమ ఆదర్శాలను పాటించడం. మనిషి గురిపెట్టి చేసే ప్రయత్నాలన్నీ లక్ష్యంతో కూడినవిగా చెప్పలేం. మృగానికి వేటలో జంతువు లక్ష్యమైనా, అది లక్ష్యంతో జీవిస్తున్నట్లు కాదు. లక్ష్యం ఆమోదయోగ్యమైనది, విలువలతో కూడినది అయి ఉండాలి. ఇదే లక్ష్యశుద్ది. లక్ష్యశుద్ధి ఉంటేనే లక్ష్యసిద్ధి కలుగుతుంది. లక్ష్మి సిద్ధిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ధనం కాదు. అన్ని సిరిసంపదలకు మూల స్థానం. లక్ష్యాన్ని సాధించాలన్న తపన నుంచి శ్రద్ధ, పట్టుదల, కృషి, నైపుణ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, బాధ్యత క్రమంగా మనిషికి అలవడతాయి. ఇవే అష్టైశ్వర్యాలు
మనిషిలో లక్ష్య నిర్దేశం విద్యార్థి దశలోనే ఏర్పడాలి. విద్యా బోధన కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సమర్థంగా చింతన చేసే శక్తిని, నైతిక విలువలను బోధించాలి.
ప్రతి వ్యక్తీ ఏదో ఒక ప్రత్యేక కళ, ప్రతిభతోనే పుడతాడు. ఏదో ఒక రంగంలో నైపుణ్యం అతడిలో సహజంగానే దాగి ఉంటుంది. తనలోని ప్రతిభను అతడు గుర్తించలేడు. అనుభవజ్ఞులు మాత్రమే వ్యక్తిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి, బయటకు తీసి, సానపట్టి నిపుణుడిగా తీర్చిదిద్దగలరు. సముద్రాన్ని లంఘించగల అసమాన సామర్థ్యం తనలో దాగిఉందని వానర పెద్దలు చెబితేగాని హనుమకు తెలియలేదు!
లక్ష్య నిర్దేశానికి, లక్ష్య సాధనకు మనిషి గురువుల నుంచి మార్గదర్శనం పొందాలి. లక్ష్య సాధనకు సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత, ఉద్రిక్తతా రాహిత్యం అనే నాలుగు సూత్రాలను కఠోపనిషత్తు బోధిస్తుంది. ఏ రంగంలో విజయం సాధించాలన్నా మనిషి తన శక్తియుక్తులు బలహీనతలను, అందుబాటులో ఉన్న అవకాశాలు, వాటిని అందుకోవడంలో అవరోధాలు అనే నాలుగు అంశాలను క్షుణ్నంగా విశ్లేషించి కార్యాచరణకు సిద్ధపడాలని విజ్ఞులు చెబుతారు. లక్ష్య సాధనాక్రమంలో తప్పిదాలు జరగడం సహజం. ఓటమి అంచుకు చేరనూ వచ్చు. తప్పిదాలను తలచుకొని కుంగిపోవడం, ఓటమికి భయపడి లక్ష్యాన్ని మధ్యలో వదలడం అవివేకం. నిరాశా నిస్పృహలు ముసురెయ్యకుండా మనసును ఉల్లాస ఉత్సాహాలతో నింపాలి. కొన్ని సందర్భాల్లో లక్ష్యం చాలా పెద్దదిగా, అసాధ్యమైనదిగా అనిపిస్తుంది. దానిపై అనురక్తి తగ్గే అవకాశమూ ఉంది. అప్పుడు ఆ లక్ష్యాన్ని తరచూ జ్ఞప్తికి తెచ్చుకొనే స్వయం సూచనా ప్రక్రియను పాటించాలి.
విజయాన్ని వినయంతో స్వీకరించాలి. పరాజయాన్ని గుణపాఠంగా భావించి మరింత కృషితో మరొకసారి ప్రయత్నించాలి. అవమానాన్ని అనుభవంగా గ్రహించాలి. శక్తిమేరకు కృషిచేసి ఫలితాన్ని యథాతథంగా ఆహ్వానించే మనోస్థితిని అభ్యసించాలి. ఆందోళన, వ్యాకులత అనే బలహీనతలను అధిగమించేందుకు మనసును నిబ్బరంగా, తటస్థంగా ఉంచే ప్రయత్నం చేయాలి. దీనికోసం రోజూ కొంతసమయం ఏకాంతంగా తనతో తాను గడపాలి. నిజానికి లక్ష్యసాధన అనేది నిరంతర ప్రక్రియ. నిరంతర సాధనలో గెలుపు ఓటములుండవు. శ్రద్ధగా పనులను ఆచరించడమే గెలుపు. సాధనలో ఉండటమే లక్ష్యం.
✍🏻పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి