**దశిక రాము**
**శ్రీమద్భాగవతము**
చతుర్థ స్కంధం -9
ధృవుండు తపంబు చేయుట -2.
ఆ సమయంలో అక్కడ ధ్రువుడు...ధ్రువుడు) పోయి పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది.ధ్రువుడు మధువనంలో ప్రవేశించి, యమునా నదిలో స్నానం చేసాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితినిబట్టి మూడు దినాల కొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో రెండవ నెల గడిపాడు. తొమ్మిది దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవసమారాధనలో మూడవ నెల గడిపాడు. అనంతరం పన్నెండు దినాల కొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు. ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చొరనీయలేదు. మహత్తు మొదలైన తత్త్వాలకు ఆధారభూతుడూ, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడూ, శాశ్వతుడూ అయిన భగవంతుణ్ణి తన హృదయపద్మంలో నిలుపుకున్నాడు. శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తదాయత్తం చేసాడు. ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు. అతని తపఃప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిలుచున్నాడు. అతని కాలి బొటనవ్రేలి ఒత్తిడికి...మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి క్రుంగింది. ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి. లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు. అలా వెళ్ళి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు. “శ్రీహరీ! పరమాత్మా! కేశవా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూరం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు
పొందుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు.”
అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ఉత్తానపాదుని కొడుకు విశ్వస్వరూపుణ్ణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ప్రాణనిరోధం కలిగింది. ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింప జేస్తాను. భయపడకండి. మీ మీ ఇండ్లకు వెళ్ళండి” అని ఆనతి నివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునకు నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత...భగవంతుడైన హరి గరుడవాహన మెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో, నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమై పోయింది. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు.
తన కళ్ళతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన చేతులతో స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసాడు.
ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి, చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని, స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామియైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. “దేవా! నీవు అఖిల శక్తిసంపన్నుడవు. అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తివల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం. నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు. దీనబాంధవా! నిద్రనుండి మేలుకొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు? మహానుభావా! దేవా! మాధవా! ముకుందా! అపారమైన సంసార తాపాలను నివారించే సుగుణాలతో కూడిన కథాసుధాపూరం కలవాడా! జనన మరణాలను తొలగించి నీవు ప్రాణులను రక్షిస్తావు. తమ తమ కోరికలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయచేత మోసగింపబడినవారే. భక్తజన కల్పవృక్షం అయిన నిన్ను దైహికాలైన ఐహికసుఖాలకోసం కొందరు సేవిస్తారు. విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది.పద్మానాభా! సాధుజన చింతామణీ! నీ పాదస్మరణం వల్లను, అనురాగ సుధలు చిందే నీ కథలను వినటం వల్లను ప్రాప్తించే పరమసుఖం స్వాత్మానందంతో సమానమైన మోక్షంలో కూడ లభించదంటారు. ఇక యముని కాలదండం చేత విరిగిపడే విమానాల నుండి కూలిపోతున్న వేలుపుల మాట వేరే చెప్పటం దేనికి?శ్రీహరీ! నిర్మలాత్ములై నీ సేవయందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కథాసుధారసాన్ని మనసారా గ్రోలి, దుఃఖాలతో నిండిన సంసార సాగరాన్ని సులభంగా తరిస్తారు. విశ్వతోముఖా! రమామనోహరా! ముకుందా! మాధవా! నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవించిన వారు మరణ శీలమైన శరీరాన్ని లెక్కచేయరు. భార్యాపుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు. పరమాత్మా! మానవులు, దేవతలు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పలువిధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కాని నిత్యకల్యాణమూ, నిరంతర మహైశ్వర్య సంపన్నమూ అయి, శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్రా! రమాకళత్రా! నీవు నిర్మలాకారుడవు. భవభయదూరుడవు. మునిజన సంస్తవనీయుడవు. పరమ భాగ్యధౌరేయుడవు. సర్వేశ్వరా! భవ్యచరిత్రా! కమలదళనయనా! శాశ్వత శుభాకారా! లక్ష్మీవిహారా! అవ్యయానందా! గోవిందా! హరీ! ముకుందా! నీవు కల్పాంత కాలంలో సర్వప్రపంచాన్ని నీలో విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పంమీద శయనిస్తావు. యోగనిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి అనే సముద్రంలోనుండి పుట్టిన బంగారు తామరపువ్వులోనుండి చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మ స్వరూపానికి నిశ్చల నియమంతో నమస్కరిస్తున్నాను.
ఆ విధంగా యోగనిద్రలో మైమరచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటె మిక్కిలి విలక్షణంగా ఉంటావు. అవస్థా భేదాన్ని పొందిన బుద్ధితో, చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించటానికి విష్ణురూపాన్ని గైకొంటావు. నీవు నిత్యముక్తుడవు; పరిశుద్ధుడవు; సర్వజ్ఞుడవు; ఆత్మవు; కూటస్థుడవు; ఆదిపురుషుడవు; భగవంతుడవు; మూడు గుణాలకు అధిపతివి. జీవుడు భాగ్యహీనుడు. అతనియందు నీ గుణాలు ఉండవు. ఏ సర్వేశ్వరుని యందైతే విరుద్ధగమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనం అవుతాయో, అటువంటి జగత్కారణమూ, అద్వితీయమూ, అనంతమూ, ఆద్యమూ, ఆనందమాత్రమూ, అవికారమూ అయిన పరబ్రహ్మవు నీవు. నీకు నమస్కారం. దేవా! నిష్కాములైనవారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్ర పాదసేవనమే. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు తన దూడకు చన్నిస్తూ తోడేళ్ళు మొదలైన క్రూర మృగాల బారినుండి రక్షించే విధంగా సకాములైనవారి కోరికలను తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావు.” అని ఈ విధంగా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో తృప్తిపడి ఇలా అన్నాడు.
అచంచల దీక్షావ్రతా! రాకుమారా! నీ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను.
కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన ఇరవైఆరువేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. ముల్లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజన రంజకంగా ధర్మమార్గాన పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తండ్రి అడవికి పోయి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకై అడవికి వెళ్ళి మరణిస్తాడు. అతనిని వెదుకుతూ అతనియందే మనస్సు చేర్చిన అతని తల్లి అరణ్యంలో ప్రవేశిస్తుంది. ఆమె అడవిలో కార్చిచ్చులో పడి కాలిపోతుంది.
పుణ్యాత్మా! నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ, సకల లోకాలకు వందనీయమై, పునరావృత్తి రహితమై సప్తర్షిమండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు.” అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి, అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంటానికి
వేంచేసాడు. అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన విష్ణువు యొక్క పాదపద్మాలను సేవించడం వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ, సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు. అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు శ్రీహరినుండి వరాలను పొందిన విధం అంతా విదురునికి వినిపించాడు. విన్న విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు. మునీంద్రా! కాముకులకు పొందరానిది, విష్ణు భక్తులైన మునులు మాత్రమే పొందగలిగినది శాశ్వతమైన విష్ణుపదం కదా! ఎన్నో జన్మలకు కాని పొందరాని విష్ణుపదాన్ని తాను ఒక్క జన్మలోనే పొందికూడా పురుషార్థాలను చక్కగా ఎరిగిన ధ్రువుడు తన కోరిక తీరలేదని ఎందుకు భావించాడు?” అని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా అన్నాడు. పుణ్యాత్మా! పినతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాలచేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది. అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనపుడు ముక్తిని కోరలేకపోయాడు. అందుకే అతడు మనస్సులో పరితపిస్తున్నాడు. అప్పుడు ఆ ధ్రువుడు...జితేంద్రియులు, మహాత్ములు అయిన సనందుడు మొదలైన మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధి యోగం ద్వారా ఏ మహానుభావుని చరణకమలాలను దర్శించ గలుగుతారో అటువంటి ఘనుడు, పరమేశ్వరుడు, అవికారుడు, అమేయుడు, అజేయుడు, ఆద్యుడు అయిన శ్రీహరిని..నేను ఆరునెలలు సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచి కూడా భేదదృష్టి కలవాణ్ణి అయ్యాను. నేను దురదృష్టవంతుణ్ణి. సంసారబంధాలను హరించే హరిని దర్శించి కూడా అనిత్యాలైన కోరికలను కోరుకున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? తమ స్థానాలకంటె ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుతానేమో అని ఓర్వలేక దేవతలు నా బుద్ధిని కలతపరచి ఉంటారు. ఆనాడు నారదుడు చెప్పిన మాట నిజమయింది. ఆయన మాటలను నేను లెక్క చేయలేదు. నేను అధముణ్ణి. నిద్రించేవాడు కలలో దైవమాయకు చిక్కి తా నొక్కడే అయినా తనకంటె వేరుగా అనేకులను తనయందు చూస్తాడు. అలాగే నేను ఒక్కడినే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దుఃఖం పొందాను. జగత్స్వరూపుడు, దయామయుడు, సంసారవినాశకుడు అయిన హరిని ఆరాధించి, ఆయన అనుగ్రహం పొందికూడ ఆయుస్సు చాలని రోగికి ఔషధం వలె కొరగాని కోరికలను కోరుకున్నాను. పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైనా అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు’ (అని ధ్రువుడు విచారించాడు).
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి