3, నవంబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 69

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 69*

                                  *****

     *శ్లో:- ఋణం యాచ్నా చ వృద్ధత్వం ౹*

           *జార  చోర  దరిద్రతాః ౹*

           *రోగ శ్చ  భుక్త  శేష శ్చా ౹*

           *ప్య  ష్టకష్టా:   ప్రకీర్తితాః ౹౹*

                                     *****

*భా:- మానవ జీవితంలో సుఖాలు,కష్టాలు చక్రభ్రమణాన్ని పోలి ఉంటాయి. ఒకదాని పిమ్మట ఒకటి వచ్చి పోతుంటాయి. మానవుడు ఓర్వజాలని కష్టాలు 8 ఉన్నాయి. అవి.  1."ఋణము" :- కుటుంబపోషణ, పిల్లల చదువుసంధ్యలు, ఉపాధి,పెళ్లిళ్లు,వేడుకలు,మర్యాదల నిర్వహణకు తలకు మించిన చేసిన "అప్పు".   2."యాచనము":- సరియైన అండ, ప్రాపు, దిక్కు, నిలువనీడ లేక లేమితో ఇంటింటికి తిరిగి "బిచ్చమెత్తుకొనవలసి రావడము".  3. "వృద్ధత్వము" :- కళ్ళు,కాళ్ళు,పళ్ళు, ఒళ్ళు శిథిలమై సహకరించని స్థితిలో, తీరని తాపంతో  పరాధీనంలో  దైన్యంగా గడుపుతున్న "ముసలితనం".  4."జారవృత్తి":- బ్రతుకు భారమై , ఆన్ననీరాలు కరువైన పరిస్థితిలో జానెడు పొట్టకోసం అందాన్ని పణంగా పెట్టి "వ్యభిచారం చేయవలసి రావడం". 5."చోరవృత్తి" :- మనస్చాంచల్యము, అత్యాశ,  దుస్సంగతి, వ్యామోహ ప్రభావాలతో  ప్రవృత్తిగా మారిన "దొంగతనము". 6. "దరిద్రత" :- తరాలుగా వచ్చిన ఆస్తి పాస్తులు, స్వార్జితవిత్తం  అంతా విలాసాలకు కర్పూరహారతిలా కరిగిపోగా యేర్పడిన  "దుర్భర దారిద్య్రం". 7."రోగము" :- ఆనువంశికంగాను, అశుచి,  ఆహారవ్యహహారాలవల్లను సంక్రమించిన "మానసిక, శారీరక రోగాలు". 8."భుక్తశేషము":-  విధి వైపరీత్యం వల్ల దైన్యంగా  పరులపంచన జేరి, వారి మోచేతి నీళ్లు గ్రోలుతూ, తినవలసి వచ్చిన "ఎంగిలికూడు". అనే యీ 8  అష్ట కష్టాలుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలలోను, కలలోను ఎవరికి ఇలాంటి కష్టాలు రాకూడదని నిత్యం దేవుని ప్రార్థించాలి. సంపదలలోనే కాదు, విపత్తుల్లోను దైవస్మరణ చేయాలని  సారాంశము. "సంపత్" సంస్మరణ విష్ణో: "విపత్" విస్మరణం విష్ణో: " అని ఆర్యోక్తి మరువరాదు*.

                        *****

            *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: