**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
116 - విరాటపర్వం.
గోగ్రహణఘట్టానికి పధకం రచించాడు దుర్యోధనుడు. ' దుశ్శాసనా ! మన కౌరవసేనలో పెద్దలందరికీ యీవార్త తెలియజేసి యుద్ధానికి సన్నద్ధులను చెయ్యి. మన ఆత్మీయుడు, అమిత పరాక్రమవంతుడు అయిన సుశర్మ, మత్స్యదేశంపై దండెత్తాలని వువ్విళ్లూరు తున్నాడు. ముందుగా అతనిని మత్స్యదేశంపై రణం ప్రకటించమని ప్రేరేపిద్దాం. మత్స్యదేశంలోని యోధులంతా సుశర్మ పైకి యుద్దానికి వెళ్ళగానే, మనం ఆ మరునాడు, ఉత్తర దిక్కుగా విరాటనగరంమీదికి వెళ్లి, గోగ్రహణ క్రీడతో, వారిని వుక్కిరిబిక్కిరి చేద్దాం. రెండుప్రక్కల నుండి శత్రువులను ఎదుర్కోవాలంటే, సామాన్య విషయం కాదు. విరాటరాజు కుందేలుపిల్లలాగా మనకుచిక్కి, పశువులను స్వయంగా ఆయనే, మనకు అప్పగించే పరిస్థితి తెప్పిద్దాం. ' అని అమితమైన వుత్సాహంతో అన్నాడు.
అదే విధంగా, సుశర్మ ఆగ్నేయదిక్కు నుండి బయలుదేరి కృష్ణపక్ష సప్తమినాడు గోవులను ముట్టడించి, భయోత్పాతం సృష్టించాడు మత్స్యదేశరాజు, విరటునకు. మరునాడు అనగా అష్టమినాడు, కౌరవులు ఉత్తరదిక్కుగా గోగ్రహణానికి బయలు దేరారు.
చతురంగ బలగాలతో దండెత్తి వచ్చిన సుశర్మకు, గోపాలురను బాధించకూడదనే జ్ఞానం లేకుండా, మొదటగా వారిని బాధించ సాగాడు. గోవులమీద వున్న ప్రేమతో, గోపాలురు రణరంగ పరాక్రమం లేకపోయినా, సుశర్మ సేనలను యెదిరించి, రక్తసిక్తు లగుతున్నారు. కొందరు పదునైన బాణాలకు మరణిస్తున్నారు. ఇంతలో వేగులవారు విరాటరాజుకు ఆగ్నేయ సరిహద్దులలో గోవులపై ముట్టడి విన్నవించారు. తక్షణం విరాటరాజు, గోపాలురపై హింసతగదని, వీరుడైతే తమ బలగాలను ఎదుర్కోవాలని సుశర్మకు కబురు చేసాడు.
8000 రధాలతో, 1000 ఏనుగులతో, 60000 మేలుజాతి గుర్రాలతో, సేనను సిద్ధం చేయించాడు. విరాటుని సోదరులైన శతానికుడు, మధిరాక్షుడు కూడా ఆయనను అనుసరించారు. ఆ సమయంలో, కంకుభట్టు విరాటునితో, మహారాజా ! నేనుకూడా ధనుర్విద్యలో మెళుకువలు తెలిసినవాడనే. నాకు మునుల అనుగ్రహం వున్నది. అదే విధంగా మన పాకశాలలోని వల్లవుడు, అశ్వగ్రందీ, తంత్రీపాలుడు కూడా అస్త్రవిద్యా పారంగతులని విన్నాను. వారి కౌశలాన్ని కూడా వినియోగించుకొమ్మని మనవి. ' అని వినయంగా అన్నాడు. కొద్దిగా ఆశ్చర్యపోయిన విరాటుడు, సమయం మించి పోతున్నదని, యెక్కువ తర్కించకుండా, వారికికూడా కవచములు, రథాలు యేర్పాటు చేసి, తమతో బయలు దేరదీసాడు.
హుటాహుటిన గోసమూహాలు వున్న చోటికి చేరారు. మత్స్య, త్రిగర్త సైన్యాల మధ్య భీకరపోరు సాగింది. పరిస్థితి అదుపుతున్న సమయంలో ధర్మరాజు యుద్ధకౌశలం ఆ సంగ్రామంలో బాగా ద్యోతకమైంది. ధర్మరాజు గరుడవ్యూహాన్ని రచించి, శత్రు సైన్యాన్ని, అయోమయానికి గురిచేశాడు. నాసికా స్థానంలో ధర్మరాజు స్వయంగా పర్యవేక్షిస్తూ, నకుల సహదేవులను విహంగానికి రెండువైపులా రెక్కల ప్రదేశంలో, భీముని చివరవైపు తోకదగ్గర నియమించి, వేయిమంది సుశర్మ సైన్యాన్ని ఒకేసారి మట్టుపెడుతూ, ముందుకు సాగుతున్నాడు. వందలమందిని నకుల సహదేవులు, వేలమందిని భీమసేనుడూ చంపుతూ అప్రతిహతంగా యుద్ధం సాగిస్తున్నారు.
ధర్మరాజు నేర్పరితనాన్ని విరాటుడు ప్రశంసిస్తూ, తానుకూడా సమరోత్సాహంతో, 500 రథాలను, 800 అశ్వాలను కూల్చివేశాడు. ఆవిధంగా త్రిగర్తవీరులను విరాటుడు ఎదుర్కుంటూ, సరాసరి సుశర్మతో యుద్ధానికి తలపడ్డాడు. వారిరువురికీ జరిగిన ప్రచండ యుద్ధంలో యెట్టకేలకు సుశర్మ, విరాటుని బంధించాడు.
ధర్మరాజు భీమసేనునితో, ' మనం విరాటరాజును విడిపించాలి. అతని ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది. త్వరగా ఆకార్యం చక్కబెట్టు ' అన్నాడు. ఏకకాలంలో, విరాటుని, అగ్రజుని మెప్పు పొందవచ్చని, ఉత్సాహంతో భీముడు, సుశర్మను సమీపించాడు. సుశర్మకు భీముడు యముడిలాగా కనిపించాడు భీముడు సుశర్మ చూస్తూ వుండగానే, అతని సేనలను నాశనం చేస్తున్నాడు. సమయం చూసుకుని బందీగా వున్న విరాటుడు, రధంపై నుండి ఒక్కదూకు దూకి, సుశర్మ చేతిలోని గదను లాగివేసుకుని, అదే గదతో, సుశర్మను కొట్టడానికి వెంబడించాడు. పరుగుపెడుతున్న సుశర్మ వేపు వెళ్తున్న విరాటుడు, ఆ సమయంలో వయసుమళ్ళిన యువకుడిలాగా వున్నాడు.
సుశర్మ పారిపోతూ వుంటే, ' అంత భయస్తుడవు. నాగోవులపై యెందుకు కన్నువేశావు ? దుష్టుడా నిలు, నిలు ' అంటూ గదపట్టుకుని, సుశర్మను రణరంగమంతా పరుగులు పెట్టించాడు, విరాటుడు. భీముడు అతని వెన్నంటే వున్నాడు, రక్షణగా. కొద్దిసేపటి తరువాత, విరాటునికి విశ్రాంతిని యిస్తూ, భీమసేనుడు, సుశర్మ జుట్టుపట్టుకుని లాగి నేలపై పడవేసి, కాలితో తన్ని, పిడిగుద్దులు గుద్దుతూ హింసించి మూర్ఛపోయేటట్లు చేసాడు.
సుశర్మను మెడలువంచి ధర్మరాజు వద్దకు తీసుకుని వచ్చాడు భీముడు. ధర్మరాజు సుశర్మను మందలించి, అతనికి క్షమాభిక్ష పెట్టాడు. పాండవుల పరాక్రమము, దయాగుణం, క్షమాగుణం చూసి సుశర్మ చలించిపోయాడు. విరాటుడు నోటిమాట రాక చిత్తరువువలే వుండిపోయాడు. నెమ్మదిగా తేరుకుని, ' కంకుభట్టూ ! నీ దాక్షిణ్యం వలననే నేను బంధ విముక్తుడను అయ్యాను. నీవు పంపిన వల్లవుడు, నాకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించాడు. ఈ నాటినుండీ విరాటరాజ్యానికి ప్రభువులు మీరే ! ' అంటూ ధర్మరాజును పరిపరివిధాలా స్తుతించాడు.
' మహారాజా ! మీరు కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడిన మాటలు మా హృదయాలు కదిలించాయి. ఎల్లప్పుడూ, ఇలాగేదయాశీలులై మెలగండి. మీరాజ్యాన్ని మీరే ఏలుకోండి.' అంటూ ధర్మరాజు బదులిచ్చాడు. విరాటుని విజయవార్త, స్వయంగా కంకుభట్టే రాజ్యానికి తెలియచేయమని దూతలను పంపించాడు. నగరమంతా ఆనందంతో కోలాహలంగా తయారయ్యింది.
సరిగ్గా, ఇక్కడ విరాటసేనలకూ, సుశర్మసేనలకూ, యుధ్ధం జరుగుతుండగా, ఉత్తర దిక్కునుండి, దుర్యోధనుడు విరాటనగరాన్ని ముట్టడించి, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వద్ధామ, శకుని, దుశ్శాసనుడు మొదలగు వారిని యుద్ధభూమిలో నిలబెట్టి, తన అనుచరగణంచేత 60,000 గోవులను విరాటుని గోశాల నుండి తస్కరింప జేసి, హస్తినమార్గం పట్టించాడు.
విరాటుని గోశాలలో గోపాలురు హాహాకారాలు చేస్తూ, విరాటుని కుమారుడు, యువరాజు అయినా భూమింజయుని, ఉత్తరుడు అనికూడా పిలువబడే, ఉత్తమకుమారుడిని కలిసి విన్నవించారు.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి